జనసేనానికి పెద్ద చిక్కే వచ్చి పడిందిగా.. అస్సలు ఊహించి ఉండడు!

13 Mar, 2023 21:34 IST|Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పెద్దచిక్కు వచ్చి పడింది. ఆయన పార్టీ నేతలు, జన సైనికులు తమకు ఆత్మగౌరవం కావాలని అంటున్నారు. తమ పార్టీని అవమానిస్తున్న తెలుగుదేశంకు టిట్ ఫర్ టాట్ జరగాలని కోరుకుంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కు ఇలాంటి విషయాలపై పెద్దగా పట్టుదల ఉందని అనుకోలేం. ఎందుకంటే ఆయన ఆయా  సందర్భాలలో అనుసరించిన శైలి ఇందుకు నిదర్శనంగా ఉంటుంది.

జనసైనికులను అలగా జనంతో పోల్చిన ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద ఆన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొనడం ఆత్మ గౌరవం అవుతుందా? తనకు లోపాయికారీ ఒప్పందం లేదని చెప్పవలసి వచ్చింది. ఆ మాట అనవలసి వచ్చిందంటే ఆ పార్టీ కార్యకర్తలలో ఆ రకమైన సందేహం ఏర్పడిందన్నమాటే కదా! కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ఆయా విషయాలపై మాట్లాడారు. అంతకుముందు కొందరు కాపు పెద్దలు కాని, జనసేన అభిమానులు కాని చాలా స్పష్టంగా తమకు ఎదురవుతున్న అవమానాలను ప్రస్తావించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్న మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య మాట్లాడుతూ  ఒకవైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతూనే ,మరో వైపు జనసేనను తెలుగుదేశం పార్టీ బలహీనపరచే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

కన్నా లక్ష్మీనారాయణ వంటివారిని జనసేనలోకి రాకుండా టిడిపిలోకి చంద్రబాబు తీసుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనసేనకు 20 సీట్లు ఇస్తే సరిపోతుందని, చంద్రబాబుకే ముఖ్యమంత్రి పదవి  ఇవ్వడానికి ఆ పార్టీ ఒప్పుకుందని ప్రచారం చేస్తుండడంపై ఆయన ఒకరకంగా చిన్నబోయారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మరీ క్లారిటీగా మాట్లాడలేదు కాని, కొంత సర్దిచెప్పుకునే యత్నం చేశారు.  అయినా తాను ముఖ్యమంత్రి అభ్యర్దినని, అందుకోసం పోరాడతానని చెప్పలేకపోయారు. ఒకప్పుడు తాము త్యాగాలకు సిద్దంగా లేమని చెప్పిన పవన్ ఈసారి అంత సూటిగా చెప్పలేదు. కాకపోతే జనసేన కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వనని చెప్పారు. కాని దానిని నమ్మేంతగా ఆయన మాట్లాడినట్లు అనిపించదు.

జనసేనకు సైద్దాంతిక బలం ఉందని ఆయన చెప్పారు కాని ఆ సిద్దాంతం ఏమిటో వివరించడం లేదు. కాపులకు పెద్దన్న పాత్ర ఉండాలని, మిగిలిన బిసి,ఎస్.సి వర్గాలను కలుపుకుని వెళ్లాలని చెప్పడం బాగానే ఉన్నా, ఆయనే కాపులంతా తనకు ఓట్లు వేస్తే తాను ఎందుకు గాజువాక, భీమవరంలలో గెలవలేదని,  ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. నిజానికి ఏ ఒక్క కులంపైనో ఆధారపడి ఎక్కడా ఎన్నిక జరగదు. పైగా ఈయన ఒక్కరే కాపులకు ప్రతినిధి కాదు కదా! ఉదాహరణకు భీమవరంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ,టిడిపి ల పక్షాన పోటీచేసినవారు కూడా కాపు నాయకులే.తనకు ఓటు వేస్తేనే కాపులు అని, లేకుంటే కాపులు కాదన్నట్లుగా తపదేళ్లుగా పార్టీ నడుపుతున్న నేత అంటున్నారంటే ఆయన రాజకీయ పరిజ్ఞానం ఎంత  ఉన్నది అర్దం అవుతూనే ఉంది. నిజానికి ఏ ఒక్క కులమో ఓట్లు వేస్తే ఎన్నికలలో గెలవరు. అన్ని వర్గాలలోని ప్రజల మద్దతు పొందవలసి ఉంటుంది. కాపులు కట్టుబాటుగా ఉండాలని ఆయన చెప్పడం ఎంతవరకు సరైన రాజకీయం అవుతుంది. అంటే ఆయనకు నిజమైన సిద్దాంత బలం లేకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నారు.

వైసిపి అధినేత జగన్ తనకంటూ ఒక విధానాన్ని ప్రకటించారు. దానిని అన్ని వర్గాలవారికి తెలియచెప్పి వారి మద్దతు పొందారు తప్ప, తాను ఫలానా వర్గం కనుక వారంతా ఓట్లు వేయాలని ఎక్కడా చెప్పలేదు. ఆ మాటకు వస్తే చంద్రబాబు కూడా అలా ఎప్పుడూ మాట్లాడడానికి సాహసించలేదు. పోనీ ఈయన నిజంగానే ఎప్పుడైనా కాపులు సంక్షోభంలో ఉన్నప్పుడో, ఉద్యమాలు చేస్తున్నప్పుడో వారికి మద్దతు ఇచ్చారా అంటే అదీ చేయలేదు. ముద్రగడ పద్మనాభంకు టిడిపి ప్రభుత్వ హయాంలో దారుణమైన అవమానం జరిగితే పవన్ కళ్యాణ్ కనీసం పలకరించలేదు. తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉందని ఇతర పార్టీలవారే కాదు..జనసేన పార్టీ వారు కూడా విశ్వసిస్తున్నారు.పలుమార్లు చంద్రబాబుతో భేటీ అవడం, వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పడం, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఏ డైలాగులు  మాట్లాడితే, దాదాపు వాటినే పవన్ కూడా ఉచ్చరించడం వంటివి ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అంతేకాదు.. బిజెపితో అధికారికంగా పొత్తు ఉంటే, వారితో ఎక్కడా కలిసి పనిచేయకుండా చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడాన్ని లోపాయికారి వ్యవహారంగా కాకుండా ఎలా చూడాలి? రాజకీయ పెళ్లి ఒకరితో ,కాపురం మరొకరితో అన్న విమర్శను ఆయన ఇప్పటికే ఎదుర్కుంటున్నారు కదా? వీటి ఆధారంగానే టిడిపి వారు పవన్ కళ్యాణ్ ను,జనసేనను అలుసుగా తీసుకుంటున్నారన్న భావం ఉంది.

తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ ,ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచరుడు అయిన ఒక పత్రికాధిపతి వెయ్యికోట్ల ప్యాకేజీ గురించి మాట్లాడినప్పుడు చెప్పు చూపకపోతే సరి.. కనీసం హెచ్చరిక కూడా చేయలేదు. చివరికి కాపుల మీటింగ్ లో సైతం ఏదో ఆ పత్రికాధిపతిని బతిమిలాడుకుంటున్నట్లు, సర్ది చెప్పుకుంటున్నట్లు , వెయ్యి కోట్ల తో రాజకీయం అవుతుందా అని అన్నారే తప్ప, ఆయనను ఒక్క మాట అనకపోవడం ఏమిటి? అది ఆత్మ గౌరవం అవుతుందా? కాపుల రిజర్వేషన్ ల గురించి ఆ వర్గాన్ని రెచ్చగొట్టే యత్నం చేశారు. నిజానికి రిజర్వేషన్ ల గురించి పలురకాలుగా మాట్లాడింది పవన్ కళ్యాణే. ఒకసారి అసలు కాపులకు రిజర్వేషన్ లు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఒక్క జగన్ మాత్రమే తన విదానాన్ని స్పష్టంగా చెబితే, ఆయనేదో రిజర్వేషన్లు సాద్యమని చెప్పినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. మరో మాట కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. వంగవీటి రంగా దీక్ష చేస్తున్నప్పుడు ప్రతి గ్రామం నుంచి వంద మంది వచ్చి ఉంటే దాడి జరిగేదా అని అడిగారు..

రంగా హత్యకు తెలుగుదేశం వారే కారణమని తెలిసినా, ఇప్పుడు వారి స్నేహం కోసం అర్రులు చాస్తున్నారన్న పాయింట్కు జవాబు దొరకదు. బిసిల సభలో ఒక రకంగాను, కాపుల సభలో మరో రకంగాను మాట్లాడి పవన్ కళ్యాణ్ తన ద్వంద్వ ప్రమాణాలను మరోసారి రుజువు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్  ఒక వైపు కులాలు వద్దని, మరోవైపు  ఆయనే కులాల గురించి మాట్లాడుతుంటారు. నిజంగానే ఆయన కాపులు, ఇతర వర్గాలవారికి కలుపుకుని ముందుకు వెళ్లాలంటే నిర్దిష్టమైన రాజకీయ ప్రణాళికను ప్రకటించగలగాలి. తన పార్టీలో కాపుల పాత్ర ఏమిటి? బీసీ పాత్ర ఏమిటి? ఎస్.సిలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?అన్నవాటిపై స్పష్టత తెచ్చుకోవాలి. ఆయా వర్గాలకు తాను ఏమి చేయదలిచింది చెప్పగలగాలి.

తెలుగుదేశం పార్టీని ఆయన ఏ రకంగా చూస్తారు?మిత్రపక్షంగా ఉండాలని అనుకుంటే దానికి  ఉన్న సిద్దాంత బలం ఏమిటి? ఒక వేళ అధికారం వస్తే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి  టిడిపి సిద్దపడకపోతే జనసేన ఏమి చేస్తుంది? ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది?అయితే టిడిపి, జనసేనలు అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.అది వేరే విషయం.ఏది ఏమైనా వీకెండ్ పాలిటిషియన్ గా ఎపికి వస్తున్న పవన్ కళ్యాణ్ ముందుగా తాను పుల్ టైమ్ పాలిటిషియన్ అన్న నమ్మకాన్ని జనసేన వారికి కల్పించాలి కదా? ఆ తర్వాత ఆత్మగౌరవం మిగిలినవాటి గురించి మాట్లాడుకోవచ్చేమో! పాపం! ఆత్మగౌరవం, లోపాయికారి వ్యవహారాలపై జనసేన కార్యకర్తలు ఇంతగా రియాక్ట్ అవుతారని అనుకోలేదు. అదే పవన్ కు పెద్ద చిక్కు అవుతోంది.  

-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు