పవన్‌.. అన్ని సీట్లలో పోటీచేయలేనని చేతులెత్తేశారా?

15 Mar, 2023 15:50 IST|Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో జరిగిన సభలో  ప్రసంగించిన తీరు ఆయనలోని నిస్పృహను, నిట్టూర్పును స్పష్టంగా తెలియచేస్తుంది. ఎట్టి పరిస్థితిలోను వచ్చేసారి అసెంబ్లీలోకి అడుగుపెడతామని చెప్పడంలోనే ఆయన బాధ అర్ధం అవుతుంది. వచ్చేసారి తాను ముఖ్యమంత్రి అయి తీరుతానని, జనసేన అధికారంలోకి వస్తుందని కాని చెప్పినట్లు అనిపించలేదు. తెలుగుదేశంతో పొత్తుకోసం దారులు వెదుక్కున్నట్లు తెలిసిపోతూనే ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీతో విడాకులు ఎలా పొందాలో రిహార్సల్ వేసుకున్నట్లుగా ఉంది. గత సారి రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన పరాభవ అనుభవం ఆయనను వెన్నాడుతోంది. పైకి గంభీరంగా మాట్లాడినా ఆయన లోపల కుమిలిపోతున్నారు.

ఒకవైపు కులం లేదంటాడు.. మరొకవైపు కుల ప్రస్తావన
అందుకే ఆయా సందర్భాలలో ఆ విషయాన్ని ప్రస్తావించి కాపులంతా తనకు ఓట్లు వేసి ఉంటే తాను ఎందుకు ఓడిపోతానని వాపోతున్నారు. కాపు సంక్షేమ సేన సభలో కాని, పార్టీ ఆవిర్భావ  దినోత్సవ సభలోకాని ఆయన పదే,పదే కులం గురించిమాట్లాడడం ఆయనలోని బలహీనతను తెలియచేస్తుంది. ఒకవైపు కులం లేదంటారు.. మరో వైపు కాపులంతా తనకు మద్దతు ఇస్తే సీఎం అవుతానని చెబుతారు. అదెలాగో వివరించరు.అది వేరే సంగతి.

తన పార్టీకి డబ్బులు లేవని పవన్  అన్నారు. అది ఆశ్చర్యం కలిగించే అంశమే. ఆయన నిజం చెప్పలేదన్న సంగతి ఆయన విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు వెళ్లిన తీరు చూస్తేనే అవగతమవుతుంది. ఉదాహరణకు విజయవాడ బెంజ్ సెంటర్ నుంచి బందర్ వరకు రోడ్డు వెంట పెట్టిన భారీ హోర్డింగ్ లే ఆ పార్టీ దీనికోసం ఎంత ఖర్చు పెట్టింది, లేదా ఆయన పార్టీ నేతలు ఎంతగా వెచ్చించింది తెలుసుకోవచ్చు. అంతేకాదు.. కొన్ని చోట్ల భారీ క్రేన్ లను తీసుకు వచ్చి పవన్  కళ్యాణ్ కు గజమాలలు వేశారు. దీనికి ఎంత వ్యయం అవుతుందో తెలియదు కాని, ఏర్పాట్లు అయితే అట్టహాసంగానే చేశారని చెప్పవచ్చు. ఆయన అభిమానులు ఆటోనగర్ వద్దకాని, మరి కొన్ని ఇతర చోట్ల కాని రోడ్ వెంబడి తమ వాహనాలను నిలిపివేసి గుమికూడడంతో ట్రాఫిక్ జామ్ అయింది.

ఈ ఖర్చు టీడీపీదేనా?
దాంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆటోనగర్ నుంచి బెంజ్ సెంటర్ వరకు ఇలాగే జనంతో కిక్కిరిసి ఉందేమోనని అనుకోవచ్చు.కాని ఇదంతా ఒక ఫర్లాంగ్ దూరమే హడావుడి. ఆ తర్వాత జనం కనిపించలేదు.ఆయన  అధిరోహించిన వారాహి వాహనం చుట్టూరా, ఆ పరిసరాలలో మాత్రం అభిమానులు ముఖ్యంగా యువకులు కనిపించారు. ఈ మాత్రం రావడం వారికి సంతృప్తి కలిగించే అంశమే కావచ్చు.  సినీ  గ్లామర్ కూడా ఇందుకు ఉపకరించి ఉండవచ్చు. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఫోటో తో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ల ఫోటోలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీనిని గమనిస్తే జనసేనతో పొత్తు కోసం ముందస్తు యత్నాలలో భాగంగా ఒకవేళ టీడీపీవారే ఈ ఖర్చు అంతటిని భరించి ఉండవచ్చనిపిస్తుంది. ఇక ప్రసంగం  చూస్తే , గెలుస్తామన్న  నమ్మకం కుదిరితే ఒంటరిగా పోటీ చేయడానికి వెనుకాడం అని ఆయన మాటవరసకు చెప్పారని ఇట్టే తేలిపోతుంది.

అన్ని సీట్లలో పోటీచేయలేనని చేతులెత్తేశారా?
ఒక వైపు చంద్రబాబు నాయుడిని సమర్దుడని పొగుడుతూ, మరో వైపు ఈ మాటలు చెబితే ఎవరు కనిపెట్టలేరు? నిజానికి కాపు సంక్షేమ సభలో మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య మరికొందరు జనసేన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా టీడీపీ వ్యూహం పన్నుతోందని, జనసేనవారిని కించపరిచేలా ఇరవై సీట్లే ఇస్తామని ప్రచారం చేస్తోందని వాపోయారు. ఆ సందర్భంలో తాను ఆత్మగౌరవానికి భంగం రానివ్వనని ఆయన చెప్పినా, అదంతా ఒట్టిమాటేనని ఈ సభలో స్పీచ్‌ను బట్టి తెలుస్తుంది. 175 సీట్లలో పోటీచేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్ సవాల్ చేస్తోందని, కాని ఏమి జరిగితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చెప్పడం ద్వారా ఆయన తాను అన్ని సీట్లలో పోటీచేయలేనని చేతులెత్తేశారు. బీజేపీ రోడ్ మాప్ ఇచ్చి ఉంటే తెలుగుదేశం అవసరం లేకుండానే ఎదిగేవాళ్లం అని ఆయన టీడీపీ వైపు చూస్తున్న సంగతిని చెప్పేశారు.

తనకు ప్రత్యేకమైన ప్రేమ చంద్రబాబుపై లేదని చెబుతూనే, ఆయన సమర్దుడని పొగిడేశారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబును ఉద్దేశించి ఎన్ని తీవ్ర విమర్శలు చేసింది మర్చిపోయినట్లున్నారు.వెయ్యి కోట్ల ప్యాకేజీ అని అంటే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుందని ఆయన అన్నారే కాని, ఫలానా టీడీపీ పత్రిక యజమాని అన్నారని, ఆయనకు తన సమాదానం ఇదేనని మాత్రం చెప్పలేకపోయారు. దివంగత నేత వంగవీటి రంగా వివాహం గురించి ప్రస్తావించడం అసందర్భంగా ఉన్నా, అందులో వ్యూహం ఏమిటంటే కాపు సామాజికవర్గం వారు కమ్మవారితో  రాజీపడాలన్న లక్ష్యం ఉందని తెలుస్తుంది.

కాపులకు జగన్‌ ప్రభుత్వం చేస్తున్న మేలు కనిపించడం లేదా పవన్‌?
కులం చూసి ఓటేస్తారో, గుణం చూసి ఓటేస్తారో తేల్చుకోవాలని ఆయన అనడం సమర్దనీయమే అయినా, అంతకు  ఒక రోజు ముందే కాపులంతా కట్టుబాటుగా ఉండాలని, తనకే మద్దతు ఇవ్వాలని ఎందుకు అన్నారు. అంటే తనవరకు కులాన్ని చూడండని కాపు వర్గాన్ని ఆయన కోరుతున్నారన్నమాటే కదా! ఇక్కడే ఆయనలోని డబుల్ స్టాండర్డ్స్ ఇట్టే బయటపడిపోతుంటాయి. కాపులలో ఇతర పార్టీల నేతలను ఈయన గౌరవించడానికి సిద్దపడడం లేదన్నమాట. కాపులకు రిజర్వేషన్ కుదరదని జగన్ అన్నా ఆయనకు ఓటు వేశారని పవన్ అంటున్నారు. నిజానికి జగన్ అన్నది ఆ విషయం కేంద్రం పరిదిలోదని, తాను కాపులకు మేలు చేసే స్కీములు తెస్తానని అంటే దానిని అచ్చం చంద్రబాబు మాదిరే ఈయన కూడా వక్రీకరిస్తున్నారు. మరి కాపు మహిళలకు కాపు నేస్తం స్కీమ్ కింద ఏటా 18500 రూపాయల ఆర్దిక సాయాన్ని జగన్ ప్రభుత్వం చేస్తోంది.

దానిని కొనసాగించాలని పవన్ కోరుకుంటారా?లేదా? అన్న విషయం చెప్పలేదు. కాపులెవరూ సీఎం కాలేదని అనుకుంటుంటారని, తనకు ఓటు వేస్తే సీఎం అయి చూపిస్తానని పవన్ వ్యాఖ్యానించడం విశేషం. తీరా కాపులు ఈయనకు ఓటు వేశాక, చంద్రబాబే సీఎం అభ్యర్ధి అని చెబితే ఆ వర్గం వారు ఏమి చేయాలి? అసలు పవన్ తమ సీఎం అభ్యర్ది అని టీడీపీ కాని, చంద్రబాబు కాని ప్రకటించడానికి సిద్దంగా ఉన్నారా? ఈ విషయాల గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ ఏదేదో చెబితే ఆయనను కాపు వర్గం ఎందుకు నమ్ముతుంది? ఈసారి జనసేనను బలిపశువు కానివ్వబోనని, ప్రయోగాలు చేయబోనని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ఆయన ఇంతకాలం సిద్దాంతం అంటూ ప్రచారం  చేసింది ఉత్తిత్తి విషయమేనని, ఎలాగొలా తాను అసెంబ్లీలోకి రావాలన్నదే అసలు లక్ష్యమని  ప్రజలు తెలుసుకోలేరని అనుకోవడం భ్రమే అవుతుంది.  జనసేన వారిని అలగా జనం అంటూ ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎద్దేవ చేసినా, తన  ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా ఆయన ఎదుట అన్ స్టాపబుల్ గా నవ్వుతూ కూర్చున్న పవన్ కళ్యాణ్ మరోసారి జనసేన కార్యకర్తలను బలిపశువు చేయరన్న గ్యారంటీ ఉంటుందా?


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు