సీఎం జగన్‌ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇదే..

25 May, 2023 14:59 IST|Sakshi

నాలుగేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏమి సాధించారు? ఆయన కేంద్రంపై పోరాడలేకపోతున్నారు.. అంటూ తెగ రాసిన ఎల్లో మీడియాకు మాడు పగిలేలా సమాధానం వచ్చింది.

జగన్ సైలెంట్‌గా కేంద్రం నుంచి 10461 కోట్ల నిధులను సాధించుకురావడంతో తెలుగుదేశం నేతలకు, ఆ పార్టీని నెత్తిన పెట్టుకునే మోసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలకు దిమ్మదిరిగినట్లయింది. ఇది నిజమా! అని వారే నిర్థారించుకుని ఏడుస్తూనే వార్త ఇవ్వవలసి వచ్చింది. తెలుగుదేశం కోసం బట్టలూడదీసుకుని తిరిగే ఒక మీడియా మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించకుండా కనుమరుగు చేయాలని యత్నించినట్లు అనిపించింది. తదుపరి ఈ డబ్బు తీసుకుంటే కేంద్రం నుంచి ఇంకేమీ రావని చెబుతూ తప్పుడు ప్రచారం ఆరంభించింది. ఏకంగా లక్ష కోట్ల నష్టం వస్తుందని అబద్దపు లెక్కవేసింది.

రెవెన్యూ లోటుకు, కేంద్రం వివిధ పథకాలకు  ఇచ్చే నిదులకు సంబంధం అంటూ మోకాలికి, బోడిగుండుకు లింకు పెట్టే యత్నం చేసింది. ఒక్కసారిగా ఎపి ప్రభుత్వానికి ఇంత డబ్బు వచ్చిందా అన్న ఏడుపు అన్నమాట. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉందని అంచనా వేశారు.

దీనిపై ఏపీ ప్రభుత్వం తరచుగా కేంద్రానికి లేఖలు రాసేది. ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో చంద్రబాబు నాయుడు తమకు ఈ రెవెన్యూలోటు ఇవ్వాలని మీడియా ముందు కోరుతుండేవారు. కాని కేంద్రం కేవలం నాలుగువేల కోట్లే ఇచ్చి సరిపెట్టుకుంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలలో టీడీపీ, బీజేపీలు భాగస్వాములు అయినా వారు అడిగిన రెవెన్యూలోటు మొత్తం మంజూరు కాలేదు. దానికి కారణం అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలిసినా, ఆర్దిక మంత్రిని కలిసినా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కాకుండా, రాజకీయ విషయాలకే ప్రాధాన్యం ఇవ్వడమేనని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండేవారు.

ఆనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా పలుమార్లు ఈ మాట చెప్పేవారు. అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పాలు చేయాలని కేంద్రంలోని పెద్దలను చంద్రబాబు కోరుతుండేవారని ఆయన పేర్కొనేవారు. అఫ్ కోర్స్.. కన్నా ఇప్పుడు ఆ మాటలు చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆయనే తెలుగుదేశం పార్టీలో చేరారు కనుక. అయినా వాస్తవం దాచేస్తే దాగదు కదా! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదిన్నరవేల కోట్ల రూపాయలను జగన్ ఎలా సాధించగలిగారన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న.

ఈ విషయంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని కూడా అభినందించాలి. జగన్ సూచనల మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి ఈ విషయాలపై పాలోఅప్ చేస్తుంటారు. అది ఫలించి ఇప్పుడు ఈ సాయం అందిందని అనుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా అభినందనలు తెలియచేయాలి.

జగన్ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలనే అధికంగా ప్రస్తావిస్తుండడం, ఆయనలోని చిత్తశుద్దిని గుర్తించడం, రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ స్కీముల తీరు మొదలైనవాటిని పరిశీలించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.

అయితే ఇదంతా ఏదో డబ్బుల వాన మాదిరిగా చిత్రించాలని ఈనాడు మీడియా ప్రయత్నించింది. ఒకవైపు రోదన, మరో వైపు ఈ విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలన్న తాపత్రయంతో ఆ కధనం రాసినట్లు అర్దం అవుతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోతూ రోజు గడవడమే కష్టంగా ఉన్న ఆంద్రప్రదేశ్ పై కేంద్రం కరుణ కురిపించిందని రాశారు కాని, ఎపికి న్యాయం చేశారని రాయడానికి వారికి చేతులు రాలేదు. ఇది ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఘనత అని చెప్పలేదు. చంద్రబాబు టైమ్ లో అసలు అప్పులే చేయనట్లుగా ఈనాడు మీడియా చిత్రీకరించాలని చూస్తోంది.
చదవండి: రామోజీ మంటకు ‘మందు’ ఉందా?

అప్పుడు చంద్రబాబు, ఆర్దిక మంత్రి గా ఉన్న యనమల రామకృష్ణుడు కాని పలుమార్లు బీద అరుపులు అరిచినా, అప్పులమీదే కాలం గడుపుతున్నామని చెప్పినా, ఇదే ఈనాడు మీడియాకు ఆనంద భైరవి రాగంలా అనిపించేది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారు.కేంద్ర నిబంధనల ప్రకారమే అప్పులు చేస్తున్నా వీరికి అజీర్ణమే. టిడిపి మీడియాకు చెందిన ఒక పత్రిక ఎంతగా వాపోయిందంటే ఆర్దికశాఖలో ఒక అధికారి ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, అందువల్లే అప్పులు పుడుతున్నాయని ఏడ్చేసింది. కేంద్రంపై జగన్ పోరాడడం లేదని ప్రచారం చేయడానికి ఈనాడు మీడియా పలుమార్లు పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాలపై కదనాలు ఇస్తుంటుంది.

అవసరమైన నిధులు రాబట్టలేకపోతోందని చెప్పేది. తెలుగుదేశం నేతలైతే జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ఏవో కేసుల గురించే అని తప్పుడు ప్రచారం చేసేది. వారికి ఎల్లో మీడియా తానా తందానా అనేది. తీరా జగన్ ఇప్పుడు ఇంత విజయం సాధిస్తే మాత్రం దానిపై కూడా ఏడుపుగొట్టు తీరులో వార్తలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ టైమ్‌లో కనుక ఇలా కేంద్రం డబ్బు మంజూరు చేసి ఉంటే చంద్రబాబు అంత ఘనాపాటి.. ఇంత ఘనపాటి.. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు దెబ్బకు దిగివచ్చారు.. అన్న చందంగా కదనాలు ఇచ్చి ఉండేవి. ఇప్పుడు మరో ప్రయత్నం జరగవచ్చు.
చదవండి: YSRCP: చారిత్రక విజయానికి నాలుగేళ్లు..

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆర్థిక సాయం అంతా చంద్రబాబు కృషివల్లే అని ప్రచారం చేసినా ఆశ్చర్యం ఉండదు. ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ఏమి చేపట్టినా, అదంతా చంద్రబాబు ఎప్పుడో చేసేశారు.. అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కేంద్రం ఇచ్చిన ఒకే ధపా కేంద్ర నిధులు పదిన్నరవేల కోట్లు విడుదల అయితే ప్రభుత్వానికి మంచి వెసులుబాటే అవుతుంది. ఇక టీడీపీ కాని, ఎల్లో మీడియా కాని ప్రతిదానికి ఈ నిధులకు లింక్ పెట్టి వివిద వర్గాలను, ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేయవచ్చు.

అందువల్ల ఈ ఆర్దిక సాయం తీరుతెన్నులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ప్రజలందరికి అర్దం అయ్యే రీతిలో వివరణ ఇస్తే మంచిది. ఏ ఏ అంశాలకు ఈ డబ్బు వాడుకోవచ్చు? ఇందులో కండిషన్లు ఏమైనా ఉంటాయా? తదతర వివరాలు తెలియచేస్తే మంచిది. ఏది ఏమైనా ఒకేసారి కేంద్రం ఏపీకి పదిన్నర వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం గొప్ప విషయమే. అది రాష్ట్రానికి రావల్సి ఉన్న డబ్బే తప్ప, కేంద్రం డబ్బులవాన కురిపించినట్లు కాదన్న సంగతి ముందుగా అంతా తెలుసుకోవాలి. అలా నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. అలాగే వాటిని సాధించడంలో జగన్ సహనంతో చూపిన చొరవను అభినందించవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు