గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్‌ బలం అదే.. ఇదీ లెక్క..!

18 May, 2023 10:29 IST|Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గేరు మార్చి స్పీడ్ పెంచారు. తన రాజకీయ ప్రత్యర్ధులు ఏదైతే బలం అనుకుంటున్నారో, దానిని ఆయన వారి బలహీనతగా ప్రజలకు చూపిస్తున్నారు. ఒక వైపు తన ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరిస్తూనే, మరో వైపు రాజకీయ విమర్శలకు ఆయన బదులు ఇస్తున్నారు. నిజాం పట్నంలో మత్స్యకార భరోసా కార్యక్రమం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అనుసరించిన వ్యూహం ఇదే అనిపిస్తుంది.

ప్రతి సందర్భంలోనూ ఇదేరీతిలో ఆయన ప్రసంగాలు సాగుతున్నా, నిజాంపట్నంలో మరింత స్పష్టంగా తన రాజకీయ వ్యూహాన్ని ఆయన అమలు చేసినట్లు అనిపిస్తుంది. తాను పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు పెత్తందారి పార్టీలుగా మారాయని, ధనిక వర్గాల కోసం అవి పనిచేస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. తద్వారా పేద,పెత్తందారి ధీరిని మరోసారి ప్రజలకు ఆయన వివరించారు. పేదల కోసం తీసుకు వస్తున్న స్కీములను ఈ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడం ఆయన లక్ష్యం. అంతవరకు ఆయన సఫలం అయినట్లే అనిపిస్తుంది.

అందుకే తెలుగుదేశం పార్టీ జనంతో యుద్దం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మాదిరే ఆర్ధిక పరిస్థితి ఉన్నా, ఇంకా కొన్ని సమస్యలు అదనంగా వచ్చినా తాను ప్రజలకు 2.10 లక్షల కోట్ల మేర నేరుగా అందచేశానని, చంద్రబాబు అలా ఎందుకు చేయలేకపోయారని, ఆయన హయాంలో ఈ డబ్బు అంతా ఏమైందని జగన్ ప్రశ్నించడం ద్వారా తన ప్రభుత్వంలో అవినీతి లేదని, బటన్ నొక్కితే ప్రజల ఖాతాలలోకి వెళుతుందని ఆయన వివరించారు.

తాను ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలలో 98.5 శాతం నెరవేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు.ఈ నేపధ్యంలో తాము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ స్కీములను తీసివేయబోమని చంద్రబాబు,పవన్ లు చెప్పవలసి వస్తోంది. ఈ రకంగా వారిని జగన్ తన ట్రాప్ లోనే ఉంచుతున్నారు. వారికి తనే ఎజెండా సెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మత్స్యకారులకు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలు గురించి ఆయన చెప్పారు. ఈ రకంగా సంబంధిత కార్యక్రమం, ప్రభుత్వ స్కీముల గురించి మాట్లాడిన తర్వాత రాజకీయ అంశాల వైపు మళ్లుతున్నారు.

తెలుగుదేశం, జనసేనల పొత్తు గురించి ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు తాము కలవడం బలం అనుకుంటున్న సంగతి తెలిసిందే. దానినే వారి బలహీనతగా జగన్ చూపిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని వంటివారిని ఎంపిక చేశానని డాంబికాలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు 175 సీట్లలో పోటీ చేయలేకపోతున్నారని, పవన్ కళ్యాణ్‌ తను బలహీనుడనని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ రెండు పార్టీలు కలిసినా తనను ఓడించలేవని, తన బలాన్ని చూసి భయపడే వారు పొత్తులు పెట్టుకుంటున్నారని జగన్ ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం తనకు సీఎం పదవి ఎవరిస్తారని బేలగా మాట్లాడాన్ని జగన్ తనకు అడ్వాంటేజ్‌గా మలచుకున్నారు. లోకేష్ ను నాయకుడిగా చేసేందుకు చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నం, దాని కోసం అందరినీ కలుపుకుని ప్రభుత్వంపై విష ప్రచారం దిగుతుందని ప్రజలకు కూడా అర్థమవుతోంది.   ఇదే అంశాన్ని వైఎస్సార్ సిపి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తొంది. 

పవన్‌ను ఎప్పుడూ ఆయన దత్తపుత్రుడు అని సంభోదిస్తారు. అదే సంబోధనతో ఆయనకు సీఎం పదవి వద్దట.. ప్యాకేజీ ఇస్తే చాలట అని వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు ఏమి ఆదేశిస్తే జీహుజూర్ అంటూ పవన్ సిద్దంగా ఉంటారని చెబుతూ ప్రజలలో ఆయన పట్ల మరింత వ్యతిరేకత పెంచడానికి జగన్ యత్నించారు.పొత్తులు పెట్టుకుని వివాహం చేసుకునేది వీరే.. విడాకులు ఇచ్చేది వీళ్లే అని అంటూ గత చరిత్రను ఆయన గుర్తు చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేయకుండా కేవలం చంద్రబాబుకే మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికలనాటికి టీడీపీకి దూరం అయి అంటే విడాకులు తీసుకుని వేరే కూటమి కట్టి పోటీచేశారు. అది కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓటు చీలడానికే అన్న వ్యూహం అప్పట్లో అమలు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

పేరుకు విడిపోయినా, పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాలలో చంద్రబాబు ఎంపిక చేసినవారికే జనసేన టిక్కెట్లు ఇచ్చారని చెబుతారు. చంద్రబాబు, లోకేష్‌లు పోటీచేసిన కుప్పం, మంగళగిరిలలో పవన్ ప్రచారం చేయలేదు.. అలాగే పవన్ పోటీచేసిన రెండు చోట్ల గాజువాక, భీమవరంలలో చంద్రబాబు ప్రచారం చేయలేదు. ఇదంతా మాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని తేలింది. ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ మళ్లీ బిజెపి గూటికి చేరారు. అది కూడా చంద్రబాబును రక్షించే క్రమంలోనే అని వైసీపీ చెబుతుంటుంది.

బీజేపీతో పొత్తులో ఉన్నా, పవన్ టీడీపీతో రాజకీయ అక్రమ సంబంధం నెరపుతున్నారు. వీటన్నిటిని జగన్ తో సహా వైసీపీ నేతలు బాగా ఎక్స్ పోజ్ చేశారు. చంద్రబాబు, పవన్ లు విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తారని చెబుతూ సోదాహరణంగా ఆయా విషయాలను జగన్ ఉటంకిస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ గత రెండున్నర దశాబ్దాలలో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. వారితో విడిపోయింది. ఉదాహరణకు 1996, 98 లోక్ సభ ఎన్నికలలో వామపక్షాలతో స్నేహం చేసి, బీజేపీని మసీదులతో కూల్చే పార్టీ అని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టేవారు.
చదవండి: రాజకీయాల్లో సినిమావాళ్ల విలువ ఎంతంటే..

కాని 1998 ఎన్నికలు పూర్తి కాగానే చెప్పాపెట్టకుండా వామపక్షాలకు గుడ్ బై చెప్పి బీజేపీ చంక ఎక్కారు. 1999,2004 ఎన్నికలలో వారితో కలిసి పోటీచేసి, ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలవనని అనేవారు. కాని 2014 ఎన్నికలనాటికి బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ చుట్టూ తిరిగి మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. 2002లో నరేంద్ర మోదీని నరహంతకుడని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌కే రానివ్వనని అనేవారు. 2014లో ఆయన తో కలిసి రాజకీయంగా లబ్ది పొందినా, తిరిగి 2018 నాటికి మళ్లీ దూరం అయి మోదీ వేస్ట్ అని, దేశం నాశనం అవుతోందని అనేవారు. 2024 నాటికి తిరిగి మోదీతో ఎలాగొలా స్నేహం చేయాలని అర్రులు చాస్తున్నారు.

2009లో టీఆర్ఎస్‌తో పొత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. తీరా రాష్ట్ర విభజనకు కేంద్రం పూనుకుంటే సోనియాగాంధీ దెయ్యం, ఏపీకి నష్టం చేసిందని అనేవారు. కాని 2018 తెలంగాణ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తోనే చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఇలా ఇన్ని విన్యాసాలు చేసిన వ్యక్తిగా చంద్రబాబును ప్రజల ముందు జగన్ ఉంచే యత్నం చేశారు. చంద్రబాబు మాదిరే పవన్ కూడా పలు కూటములు మార్చిన తీరును ఆయన ఎండగడుతున్నారు. వీరిద్దరూ అనైతిక రాజకీయాలు చేస్తారని ప్రజలలో ఎస్టాబ్లిష్ కావడానికి వీటిని గుర్తు చేస్తుంటారు.

వచ్చే శాసనసభ ఎన్నికలలో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కొంత ఇబ్బంది వస్తుందన్న ప్రచారాన్ని ఆయన తిప్పి కొడుతున్నారు.చంద్రబాబు, పవన్ లు కుట్ర పూరితంగా రాజకీయం చేస్తున్నారని, తద్వారా పేద ప్రజలకు నష్టం చేయాలని చూస్తున్నారని ఆయన వివరిస్తున్నారు. తాను పేదలవైపు ఉన్నానని, టీడీపీ, జనసేనలు, పెత్తందారుల వైపు ఉన్నాయని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. పొరపాటున చంద్రబాబును గెలిపిస్తే ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్ని ఆగిపోతాయని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.
చదవండి: మలుపు తిప్పిన ముఠా! పవన్‌ కల్యాణ్‌కూ వాటా

ఈ రకమైన వ్యూహాలతో జగన్ తన ఓటు బ్యాంకును చెక్కు చెదరనివ్వకుండా కాపు కాచుకుంటున్నారని చెప్పాలి. యథా ప్రకారం చంద్రబాబు, దత్తపుత్రుడుతో పాటు ఈనాడు, జ్యోతి, టివి 5 మీడియా సంస్థలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి అసత్య కదనాలు ఇస్తున్నది చెప్పకుండా మానడం లేదు. వీళ్లందరిని కలిపి ఆయన తోడేళ్ల గుంపుతో పోల్చుతున్నారు. చంద్రబాబు కొంతకాలం క్రితం టీడీపీ, జనసేన కూటమి అంటే జగన్ భయపడుతున్నారని అన్నారు.

దానికి ప్రతిగా వారిద్దరూ కలవడం వారి బలహీనత అని, వైఎస్సార్‌ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ప్రజలే తన ధీమా అని, తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని జగన్ అంటున్నారు. మీ బిడ్డ అంటూ తనను పరిచయం చేసుకుంటున్నారు. ఇది మీ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం అని చెబుతూ ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. సింహంలా సింగిల్ గానే ఎన్నికలలో వైసీపీ పోటీచేస్తుందని, అదే తన బలం అని ప్రజలలో విశ్వాసం కల్పించడానికి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు