చంద్రబాబు గోల్డెన్ ఛాన్స్ ఎందుకు వదులుకున్నారో!

18 Jun, 2022 12:40 IST|Sakshi

మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలోను, తెరచాటు రాజకీయాలు చేయడంలోను తెలుగుదేశం పార్టీది అందెవేసిన చెయ్యి అని చెప్పాలి. ఆ పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి వచ్చిన గొప్ప అవకాశాన్ని చేజేతులారా వదులుకోవడం బహుశా తెలుగుదేశం అభిమానులకు తీవ్ర ఆవేదనకు గురి చేస్తుండవచ్చు. మహానాడు తర్వాత ఇక వార్ ఒన్ సైడ్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అంటే దాని అర్థం ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందని, తెలుగుదేశం గెలవడమే ఆలస్యమని చెప్పడమే కాదు. దానికి తాన అంటే తందానా అని ఆ వర్గం మీడియా భజన చేయడమే కదా! ఆ సవాల్‌ను నిజం చేసుకునే అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకుంటున్నారు? నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీ చేయకుండా వదలుకోవలసిన అవసరం ఏమి వచ్చింది?
చదవండి: ఈనాడు’ కట్టుకథలు: నీళ్లిచ్చిన వారిమీదే... రామోజీ రాళ్లు! 

ఒకవైపు వైసీపీ దమ్ముంటే టీడీపీ అక్కడ పోటీచేసి సత్తా చూపెట్టాలని చాలెంజ్ చేస్తున్నా టీడీపీ వెనక్కి తగ్డడాన్ని ఎలా చూడాలి? నిజమే. ఆత్మకూరు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి అయిన మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. వైసీపీ తరపున ఆయన సోదరుడు విక్రం రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడ బీజేపీ కూడా రంగంలో ఉంటామంటూ తన అభ్యర్దిని నిలిపింది. మరి అలాంటప్పుడు టీడీపీ కూడా పోటీ చేసి విజయం సాధిస్తే నిజంగానే వార్ ఒన్ సైడ్ అయిందని ప్రచారం చేసుకోవచ్చు కదా! ఆ మాట అంటే తాము ఎక్కడైనా సిటింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే పోటీ చేయబోమన్న నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.

మరణించిన శాసనసభ్యుడి కుటుంబంలో  వారు పోటీ చేయాలని తెలివిగా  జోడించారు. వాస్తవానికి ఏ పార్టీ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ పార్టీకే ఆ సీటు ఇచ్చి వేయాలన్నది ఒక అభిప్రాయం. అయినా ఆ  కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే తాము పోటీచేయబోమన్న టీడీపీ బద్వేల్‌లో ఎందుకు పరోక్షంగా బీజేపీకి సహకరించింది. తమ పార్టీ స్థానిక నేతలనే ఎందుకు బీజేపీ ఏజెంట్లుగా కూర్చోబెట్టడానికి ముందుకు వచ్చింది. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొందరు నేతలు సూచించిన విధంగా బద్వేలులో టీడీపీ ఎందుకు  వ్యవహరించింది? వీటికి సమాధానం దొరకదు. ఎందుకంటే ఇక్కడే టీడీపీ తెరచాటు రాజకీయాలు చేసే విషయం బహిర్గతం అవుతుంటుంది. చిత్తశుద్ధితో టీడీపీ ఉప ఎన్నికలో పోటీచేయకపోతే అభినందించవచ్చు. ఆత్మకూరులో  అసలు పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు తెలుసు కనుక ఆయన టీడీపీని రంగంలో దించ లేదని అనుకోవాలి. పోటీచేసి అతి పెద్ద తేడాతో ఓడిపోతే దాని ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికలపై పడుతుందన్నది వారి భయం.

కాకపోతే అదేదో మేకపాటి కుటుంబంపై సానుభూతి కోసం  అన్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఒకవేళ తమకు గెలిచే అవకాశం ఉందని సర్వేలలో తెలిస్తే చంద్రబాబు వదలేవారా? ఏదో ఒక సాకు చూపి పోటీ చేయకుండా ఉంటారా? ఈ ఉప ఎన్నికలో గెలిస్తే రెచ్చిపోయి రాష్ట్రం అంతటా తిరిగే అవకాశాన్ని ఆయన చేజేతులారా వదలుకుంటారా? గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్  పార్టీ కూడా టిడిపి సిటింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా మరణిస్తే అక్కడ తన అభ్యర్ధిని రంగంలో దించలేదు. ఆ సంప్రదాయాన్ని నిజాయితీగా పాటించింది.

ఉదాహరణకు గత టరమ్‌లో నందిగామ, తిరుపతిలలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే వైసీపీ ఆ ఉప ఎన్నికల జోలికి వెళ్లలేదు. చాటు మాటు  వ్యవహారాలు నడపలేదు. అందువల్లే ఆ రెండు చోట్ల టీడీపీ భారీ మెజార్టీతో గెలిచింది. తిరుపతిలో అయితే టీడీపీకి  లక్షాపాతికవేల ఓట్ల  ఆధిక్యత వచ్చింది. కాని తదుపరి సాధారణ ఎన్నికలలో వైసీపీ ఈ రెండు సీట్లను కైవసం చేసుకుంది. అది వేరే సంగతి. అప్పట్లో నంద్యాల సిటింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైసీపీకి చెందినవారు కాగా, ఆయనను టీడీపీ ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకు వెళ్లింది. దురదృష్టవశాత్తు ఆయన మరణించారు.

ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆ సీటు తమది కనుక తామే పోటీచేస్తామని వైసీపీ ప్రకటించింది. కాని చంద్రబాబు దానికి సమ్మతించకుండా భూమ అన్న కుమారుడిని పోటీలో పెట్టారు. అంతేకాక విపరీతంగా శ్రమించి, ధన వ్యయం చేస్తే సుమారు 25 వేల ఓట్ల ఆధిక్యతతో టీడీపీ గెలిచింది. ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ దీనిని సవాల్‌గా తీసుకుని ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. అయినా ఆయన కుంగిపోలేదు.. అందువల్లే ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో సుమారు 45 వేల ఓట్ల  ఆధిక్యతతో వైసీపీ గెలిచింది. 2019లో వైసిపి అదికారంలోకి వచ్చాక తిరుపతి లోక్ సభ, బద్వేల్ శాసనసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తిరుపతిలో టీడీపీ పోటీచేసింది. కాని మూడు లక్షల తేడాతో ఓడిపోయింది. ఆ అనుభవంతో బద్వేలులో రంగంలోకి దిగలేదు. కాకపోతే పరోక్షంగా బీజేపీ, జనసేన అభ్యర్దికి సహకరించి , వైసీపీ మెజార్టీ తగ్గించే యత్నం చేసింది. అక్కడే నిజాయితీ లోపించిందని తెలిసిపోతుంది.

అలాకాకుండా నిబద్దతతో వ్యవహరించి ఉంటే అప్పుడు సిటింగ్ ఎమ్మెల్యే మరణానికి సానుభూతిగా టీడీపీ సింటిమెంట్‌ను గౌరవించిందిలే అనుకునే అవకాశం ఉండేది. బీజేపీ ఎక్కడైనా పోటీచేస్తామని, అది తమ విధానమని ప్రకటించి ఆ ప్రకారం చేస్తోంది. జనసేన కూడా తొలుత తాము బద్వేలులో పోటీచేయబోమని చెప్పి, ఆ తర్వాత బీజేపీకి మద్దతు ప్రకటించి మాట తప్పింది.  ఉప ఎన్నికలలో ఆయా పరిస్థితులను బట్టి పోటీచేయడం, పోటీ చేయకపోవడం ఆ రాజకీయ పార్టీల ఇష్టం. కాని రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదలుకోదు. అందులోను అదికార పక్షం సవాల్ విసిరినప్పుడు సెంటిమెంట్‌తో సంబంధం లేకుండా పోటీలో దిగవచ్చు.

ఒక ఉదాహరణ చూద్దాం. తెలంగాణలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండేవారు. కాని వారి మధ్య పొరపొచ్చాలు రావడంతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి అధికార టిఆర్ఎస్‌కు సవాల్ విసిరారు. అందులో పాతికవేల మెజార్టీతో ఆయన గెలవడంతో బీజేపీకి కొంత ఊపు వచ్చింది. అంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్ధి  రఘునందనరావు వెయ్యికి పైగా ఓట్ల తేడా తో గెలిచి సంచలనం సృష్టించారు. ఇప్పుడే కాదు..1993లో ఉమ్మడి ఏపీలో నెల్లూరు జిల్లా కోవూరుకు కాంగ్రెస్ పక్షాన ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో శ్రీనివాసులు రెడ్డి కుమారుడు ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు.

మరో నియోజకవర్గం కైకలూరు సీటుకు కాంగ్రెస్ నేత  కనుమూరి బాపిరాజు  రాజీనామా చేస్తే జరిగిన ఉప ఎన్నికలో కూడా టీడీపీ విజయం సాధించింది. దీంతో 1994 శాసనసభ ఎన్నిలకు ముందు ఈ పలితాలను ట్రయల్‌గా భావించారు. 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకత కావచ్చు. ఇతర కారణాలు కావచ్చు.. ఇలా ఉప ఎన్నికలో ప్రతిపక్షం గెలిస్తే వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. కాని ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అలా సవాల్ చేయలేకపోతున్నారు. అధికార వైసీపీనే సెంటిమెంట్‌తో సంబంధం లేకుండా పోటీచేసి గెలవండని చాలెంజ్ చేసిన తర్వాత టీడీపీకి సెంటిమెంట్‌తో పని ఏమి ఉంటుంది? అయినా టీడీపీ వెనక్కి తగ్గుతోందంటే ఓటమి భయంతోనే అన్న అభిప్రాయం కలుగుతుంది.

ఇప్పుడు సెంటిమెంట్ గురించి చెబుతున్న టీడీపీ గతంలో  కూడా అలాగే చేసిందా?  ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలోని చేవెళ్లలో  కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న పి.ఇంద్రారెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి సబితా ఇంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నం జరిగినా ఆమె అంగీకరించలేదు. ఆమె కాంగ్రెస్‌లోనే ఉండి పోటీచేయగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ సెంటిమెంట్ ను పట్టించుకోకుండానే పోటీ పెట్టింది. సబితే గెలిచారు.  అలాగే అప్పట్లో హోం మంత్రిగా ఉన్న మాధవరెడ్డి ఆకస్మిక మరణంతో భువనగిరికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య ఉమా మాధవరెడ్డి పోటీచేస్తే, కాంగ్రెస్ కూడా  తన అభ్యర్దిని నిలిపింది. కాని ఓడిపోయింది. అది వేరే విషయం. తెలంగాణ ఉద్యమం యాక్టివ్‌గా ఉన్న రోజులలో 2010లో  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ కూడా పదవికి రాజీనామా చేశారు.

అప్పుడు కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కూడా పోటీచేసింది. చంద్రబాబు పేరుకు పోటీ పెట్టారు కాని, ఆయన అక్కడకు ప్రచారానికి కూడా వెళ్లలేదు. దానిని డైవర్ట్ చేయడానికి బాబ్లి ప్రాజెక్టుకు నిరసన అంటూ ఒక పోటీ కార్యక్రమాన్ని పెట్టి కథ నడిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సిటింగ్ ఎమ్మెల్యే కోర్టు తీర్పు కారణంగా సీటును వదలుకోవలసి వచ్చింది. అప్పటికే మరణించిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.ఆర్. రెండో భార్య లక్ష్మీపార్వతి సొంత పార్టీ పక్షాన పోటీచేస్తే, ఆమెను ఓడించడానికి చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ విశేష కృషి చేసింది. కాని ఆశ్చర్యంగా లక్ష్మీపార్వతి గెలిచింది. అప్పుడు ఎన్.టి.ఆర్. ఇష్టపడ్డ వ్యక్తి కదా అని ఆ సీటును లక్ష్మీపార్వతికి వదలిపెట్టలేదు.

ఎప్పటికప్పుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆయన సెంటిమెంట్లు, విలువల గురించి పట్టించుకుంటారంటే నమ్మడం కష్టమే. అయినా మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో టీడీపీ తన బలాన్ని రుజువు చేసుకోవాలి కదా? అందులోను వైసీపీ ప్రభుత్వం అన్నిటిలోను విఫలం అయందని, జగన్‌ను అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ సారి తాము అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న చంద్రబాబు ఆత్మకూరు సీటును వదలుకోవడం ఆత్మహత్య సదృశ్యం కాదా! ఆయా సందర్భాలలో దమ్ముంటే ఎన్నికలు పెట్టండని చంద్రబాబు సవాలు విసురుతుంటారు. అదేదో కుప్పంతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు రాజీనామా చేసి అధికార పక్షాన్ని రంగంలో దించవచ్చు కదా అంటే ఆ పని చేయరు. కనీసం ఇప్పుడు ఆత్మకూరులో పోటీచేసి టీడీపీ క్యాడర్‌లో జోష్ నింపుతారనుకుంటే పోటీకే వెనుకాడారు. టీడీపీ మీడియా ఒకటి గోవిందా.. గోవిందా అంటూ జగన్‌కు వ్యతిరేకంగా పాటలు ప్రచారం చేస్తోంది. సరిగ్గా గోవిందా అన్న నినాదం ఆత్మకూరులో టీడీపీకి వర్తిస్తుందా!


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు   

మరిన్ని వార్తలు