చరిత్ర పునరావృతమవడం అంటే ఇదే.. యూపీఏ హయాంలోనే పుట్టుక!

18 Jun, 2022 19:13 IST|Sakshi

మనదేశంలో ఎక్కువ మంది విధిని నమ్ముతారు. కాలచక్రం కూడా ఆగదు. చరిత్ర పునరావృతమవుతుందటని అంటారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఎదుట విచారణకు హాజరైన విషయం గమనించిన తర్వాత ఈ అంశాలు గుర్తుకు వస్తాయి. ఎంత పెద్ద పొజిషన్ ల ఉన్నా ఒక్కోసారి విధికి తలొగ్గక తప్పదని అనుకోవాలి. అలాగే ఎప్పుడూ ఒకే రకంగా పరిస్థితులు ఉండవు. అలాగైతే కాలచక్రం స్తంభించిపోతుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విదంగా సీబీఐ, ఈడీ, ఐటి వంటి శాఖలను ప్రయోగించారో, ఇప్పుడు బీజేపీ కూడా అదే పనిచేస్తోందన్న విశ్లేషణలు వస్తాయి. అసలు ఈడీని ఏర్పాటు చేసిందే యుపీఏ హయాంలో. అదే సంస్థ పెట్టిన కేసులో రాహుల్ గాంధీ విచారణకు వెళ్లవలసి వచ్చింది. 

నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఉన్న సుమారు ఐదువేల కోట్ల రూపాయల ఆస్తులను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తమ వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకునే ప్రయత్నంలో స్కామ్ కు పాల్పడ్డారన్నది అబియోగం. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదంతా కక్ష అని ప్రచారం చేసినా, ఇందులో పలు కోణాలు ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు, అసలు వాస్తవాలు అన్నిటిని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఒకప్పుడు యువరాజుగా వెలుగొందిన రాహుల్ గాంధీ ఈ కేసులో తొమ్మిది గంటలు విచారణను ఎదుర్కోవలసి వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. అంతేకా, తల్లి,కొడుకు ఇద్దరూ ఇప్పటికే ఈ కేసులో బెయిల్ పొంది ఉన్నారు.ఈ నెల 23న సోనియాగాంధీ కూడా ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉంది. ఆమె అప్పటికీ కోలుకుంటారో, లేదో తెలియదు. అప్పట్లో సోనియాగాంధీ మహా సామ్రాజ్ఞిగా చక్రం తిప్పినప్పుడు ఎవరిపైన పడితే వారిపై ఈ దర్యాప్తు సంస్థలను ప్రయోగించారన్న విమర్శలు ఎదుర్కున్నారు. 

సరిగ్గా  ఇప్పుడు ఆమె ఈ విచారణ సంస్థలను ఎదుర్కోవలసి వస్తోంది. దీనినే చరిత్ర పునరావృతం అని అంటారు. కాంగ్రసె్ పార్టీ చేపట్టిన జోడో యాత్రను అడ్డుకోవడానికనో, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి అనో ఆ పార్టీ నేతలు చెబుతున్నా, ఇప్పటికైతే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బీజేపీకి ముఖ్యంగా మోదీ, అమిత్ షా లకు గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. అందువల్ల ఇలాంటి విచారణలకు నిరసనలు తెలిపినా కాంగ్రెస్ కు ఎంత సానుభూతి వస్తుందన్నది అనుమానంగానే ఉంది. అయితే అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్దులపై ఈడీ,సీబీఐ లను యధేచ్చగా వాడుతోందన్న వాదన కూడా ఉంది. 

ఎలాంటి కేసులు ఉన్నా, బీజేపీకి అనుకూలంగా మారితే వారి జోలికి ఆయా సంస్థలు వెళ్లడం లేదని ప్రజలు నమ్ముతున్నారు. కొంతకాలం క్రితం టీడీపీనుంచి బీజేపీలోకి వెళ్లిన ఇద్దరు ఎంపీ కేసులను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.అలాగే ఎపి మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై దాడి చేసి రెండువేల కోట్ల లావాదేవీలపై అనుమానాలు వ్యక్తం చేసిన కేంద్ర సంస్థలు ఆ తర్వాత అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. అంటే  మోడీని టిడిపి అధినేత మేనేజ్ చేయగలిగారా? లేక ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయగలిగారా అంటే ఏమి చెప్పగలం.

చంద్రబాబుపైన అయినా, ఎవరిపైన అయినా అక్రమ కేసులు పెట్టాలని ఎవరూ అనరు. కాని అప్పట్లో కేంద్ర సంస్థలు ఒకరకంగా, ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడాన్ని బట్టి అనుమానాలు వస్తాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే , సోనియా, రాహుల్ గాంధీలు విచారణకు హాజరైతే పార్టీకి ప్రజలలో సానుభూతి వస్తుందా? అన్న ప్రశ్న ఎటూ ఉంటుంది.

అన్ని సందర్భాలలో సానుభూతి రావాలని లేదు.అలాగని అసలు సానుభూతి ఉండదని చెప్పజాలం. కాని సానుభూతి వచ్చినా దానిని ఓట్లుగా మలచుకునే పరిస్థితి కాంగ్రెస్ లో కనిపించడం లేదు .1978 లో ఆనాటి జనతా ప్రభుత్వం మాజీ ప్రధాని ఇందిరాగాందీని పార్లమెంటు నుంచి బహిష్కరించడమేకాకుండా కొన్ని కేసులు కూడాపెట్టింది. పార్లమెంటును పదే,పదే దిక్కరించారన్న అబియోగం, ఎమర్జెన్నీలో ప్రతిపక్ష నేతలను జైళ్లలో ఉంచి చంపించడానికి కుట్ర చేశారన్న ఆరోపణ, ఎన్నికలలో 104 జీపులను వాడుకోవడానికిగాను రెండు కంపెనీలపై ఒత్తిడి తేవడం, ఒక ఆయిల్ కాంట్రాక్టు విషయంలో ఒక సంస్థకు పేవర్ చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. 

అంతకుముందు ఇందిరాగాంధీ దమ్ముంటే  తనపై జనతా ప్రభుత్వం కేసులు పెట్టాలని సవాల్ చేస్తుండేవారు. కేసులు పెట్టాక ఆమె వాటిని తనకు అనుకూలంగా పూర్తిగా మార్చుకోగలిగారు. దేశ వ్యాప్తంగా ఆమెకు సానుభూతి పవనాలు వీచేలా చేసుకోగలిగారు. అప్పటి జనతా ప్రభుత్వంలో గొడవలు, ఇందిరాగాంధీ పట్ల అంతవరకు ఉన్న వ్యతిరేకత తగ్గడం వంటివి కూడా ఇందుకు కారణాలు అని చెప్పాలి. చివరికి ఇందిరాగాందీని నిర్భంధంలోకి తీసుకుని వారం రోజులు ఉంచేసరికి, దేశ వ్యాప్తంగా ఏర్పడిన అశాంతి నేపద్యంలో ప్రభుత్వం ఆమెను వదలివేయవలసి వచ్చింది. ఇది ఆనాటి రాజకీయ, సామాజిక వాతావరణం అని చెప్పాలి. 

అప్పట్లో జనతా పార్టీ ఒక కలగూరగంప మాదిరిగా ఉండేది. అది కూడా ఆమెకు కలిసి వచ్చింది.నిర్భంధంలోకి వెళ్లడానికి ముందు ఇందిరాగాంధీ ఒక ప్రకటన చేస్తూ, ఎవరూ తనకోసం కంటతడిపెట్టవద్దని, చిరునవ్వుతో పంపించాలని, తాను కూడా అలాగే బయటకు వస్తానని సెంటిమెంట్ డైలాగులు ఆమె ప్రయోగించారు. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. సోనియాగాంధీకిగాని, రాహుల్ గాంధీకి ఆ చరిష్మా లేదనే చెప్పాలి. యూపీఏ టైమ్ లో వివిధ ఇతర పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు.కాని ఆ తర్వాత ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కీలుబొమ్మగాచేసి సోనియా ఆడించారని ప్రతిపక్షాలు విమర్శిస్తుండేవి. 

ఇందిర హత్య తర్వాత ఆ సానుభూతితో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. కాని ఆయన దానిని నిలబెట్టుకోలేకపోయారు. బోఫోర్స్ కేసు వంటివి ఆయనకు చుట్టుకున్నాయి. బోఫోర్స్ తుపాకుల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై విపక్ష ఎంపీలంతా రాజీనామా చేశారు.1989లో రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయారు.  తదుపరి మరో కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు ఐదేళ్లు విజయవంతగా ప్రభుత్వాన్ని నడిపినా, ఎంపీల కొనుగోలు కేసులోమూడేళ్ల శిక్షకు గురయ్యారు.హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో జైలుకు వెళ్లవలసిన అవసరం తప్పింది. 

ఆ కేసువల్ల పీవీ అప్రతిష్టపాలయ్యారు. ఆయనపై అప్పట్లో సానుభూతి రాలేదు. పైగా సోనియాగాంధీనే అప్పట్లో పీవీతో గొడవపడి పట్టించుకోలేదు. యూపీఏ హయాంలో సోనియాగాంధీ ఆధ్వర్యంలో పలువురిపై సీబీఐ కేసులు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేసు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ విషయం తెలిసి పలువురు షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వారిని పరామర్శించి ,ఆర్దిక సాయం చేయడానికి జగన్ ఓదార్పు యాత్రను పెట్టుకుంటే కొందరు సీనియర్ల చెప్పుడు మాటలు విని సోనియాగాంధీ , తెలుగుదేశంతో కలిసి ఆయనపై సీబీఐ కేసు వచ్చేలా చేశారు.

ఆ కేసులో సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తికి రిటైర్ మెంట్ తర్వాత మరో ముఖ్యమైన పదవి కట్టబెట్టడంతో ఇదంతా కావాలని చేసిందేనని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. జగన్ ను పదహారు నెలలపాటు జైలులో ఉంచారు. అయినా ఆయన మొండి ధైర్యంతో ముందుకు సాగి,2014 శాసనసభ ఎన్నికలలో అధికారంలోకి రాలేకపోయినా, శ్రమించి 2019లో అధికారంచేజిక్కించుకున్నారు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదికారంలో ఉంటే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలో నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో నిందితులుగా
విచారణను ఎదుర్కుంటున్నారు.

ఇదే చరిత్ర పునరావృతమవడం అంటే.ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మత కలహాలు జరిగాయి. అప్పట్లో సీబీఐ విచారణ జరిగింది.ఆ విచారణకు మోదీ హాజరుకావల్సి వచ్చింది. సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని  ఆయన ఆరోపించేవారు. మరో నేత అమిత్ షా ఒక ఎన్ కౌంటర్ కేసులో జైలుకు వెళ్లవలసి వచ్చింది. అంతేకాక ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కించారు. తదుపరి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకోవడమే కాకుండా, ఇప్పుడు దేశానికి హోం మంత్రి అయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆయా కేసులలో జైలుకు వెళ్లవలసి వచ్చింది. అలా వెళ్లిన ప్రతి సందర్భంలో ఆమెకు జనంలో విపరీతమైన సానుభూతి వచ్చేది.

తద్వారా ఎన్నికలలో విజయం సాధించింది. కాగా మాజీ ముఖ్యమంత్రులు చౌతాలా, లాలూ ప్రసాద్ యాదవ్ వంటివారికి అవినీతి కేసులలో శిక్ష పడి జైలుకు వెళ్లారు. అన్ని కేసులు కక్షపూరితం అని చెప్పలేకపోయినా, ఎక్కువ సందర్భాలలో మాత్రం అలాగే ఉంటోందన్న అభిప్రాయం ఉంది. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరిని ఈడీ అరెస్టు చేసింది. డిల్లీలో ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒకరిని అరెస్టు చేశారు.జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఈడి నోటీసులు ఇచ్చింది. పశ్చిమబెంగాల్ లో కొందరు టీఎంసీ నేతలు ఈ కేసులను తట్టుకోలేకే బీజేపీలో చేరారని అంటారు. కానీ బీజేపీ అధికారంలోకి రాలేకపోవడంతో వారిలో పలువురు తిరిగి టీఎంసీలోకి వచ్చేశారు. ప్రస్తుతం కేరళ  ముఖ్యమంత్రి విజయన్ ను కూడా బంగారం స్మగ్లింగ్ కేసు వ్యవహారంలో ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తుంటారు. విశేషం ఏమిటంటే ఈడీ సంస్థను ఏర్పాటు చేస్తూ చట్టం తెచ్చిన ఆనాటి మంత్రి చిదంబరం కూడా ఇదే చట్టం కింద తీహారు జైలులో ఉండవలసి వచ్చింది.

బీజేపీ ఆయా విషయాలను ఖండిస్తున్నా, ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇచ్చేలా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. మనదేశంలోనే కాదు. ఇతర దేశాలలో కూడా రాజకీయ నేతలు ఇలాంటి కేసులలో జైళ్లకు వెళ్లిన ఘట్టాలు చాలానే ఉన్నాయి. పాక్ లో బుట్టో అయితే ఉరిశిక్షకు గురి కాగా, నియంత ముషారఫ్ కేసును ఎదుర్కుంటున్నారు. ఆ దేశంలో పదవి వదలుకునే మాజీ ప్రధానులు దేశం విడిచి ఏ దుబాయిలోనో తలదాచుకుంటుంటారు. అందుకు ఉదాహరణగా నవాజ్ షరీఫ్ ను తీసుకోవచ్చు. 

బంగ్లాదేశ్ లో ప్రతిపక్షనేతగా ఉన్న ఖలీదా అవినీతి కేసులో జైలుశిక్షకు గురయ్యారు. శ్రీలంకలో  మాజీ ప్రధాని రాజపక్స విదేశాలకు వెళ్లరాదని కోర్టు ఆంక్షలు విధించింది. రష్యాలో ప్రతిపక్ష నేత ను ఆయా కేసులలో జైలులో ఉంచారు.చైనాలో తమకు పోటీ వస్తారనుకునే నేతలు కొందరిని జైలులో పెట్టించారన్న వార్తలు వస్తుంటాయి. అధికారం కోసం సాగే పెనుగులాటలో ఇలాంటివి తప్పవని అనేక దేశాల చరిత్రలు చెబుతున్నాయి. భారత్ విషయం వచ్చేసరికి ప్రజాస్వామ్య వ్యవస్థే అయినా, అధికారంలో ఉన్నప్పడు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందులు పడక తప్పడం లేదు.వీటిలో కొన్ని కేసులు నిజంగానే అవినీతికి పాల్పడినవికాగా ,మరికొన్ని కేసులు కక్షతో పెట్టినవే అన్న భావన ఉంటోంది. దానికి కారణం న్యాయ వ్యవస్థ కూడా వీటికి అతీతంగా లేదన్న భావన రావడం అని చెప్పాలి. ఇది దురదృష్టకరం. ప్రజా స్వామ్య వ్యవస్థకు అంత మంచిదికాదని చెప్పాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

మరిన్ని వార్తలు