KSR Article On KTR: మాట జారిన కేటీఆర్‌.. తదుపరి సర్దుకున్నా తప్పని డ్యామేజీ

9 May, 2022 15:51 IST|Sakshi

ఎంతో తెలివైన వాడు, వివిధ భాషలలో బాగా మాట్లాడగలరు, అర్దవంతంగా సంభాషించగలరు అని భావించే తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నోరు జారి దొరికిపోయారనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన కాస్త సర్దుకుని వివరణ ఇచ్చినా రెండువైపులా కొంత డామేజీ జరిగింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ల మధ్య గతంలో మాదిరి మరీ అధికంగా తగాదాలు లేవు.. విద్వేషాలు లేవు.ఎంతో కొంత స్నేహపూరిత వాతావరణమే ఉంది. అయినా సడన్‌గా కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చగా మారాయి. 

పక్క రాష్ట్రం అంటూ , ఎవరో స్నేహితుడు సంక్రాంత్రికి వెళ్లి వచ్చి తనకు చెప్పాడంటూ , అక్కడ కరెంటు లేదు..రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. తెలంగాణ కు వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నట్లయిందని అన్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. పక్క రాష్ట్రం, సంక్రాంతి అనగానే అది ఆంధ్రప్రదేశ్ గురించి ఉద్దేశించిన మాటలే అన్న భావం స్ఫురిస్తుంది. వెంటనే ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం కాని, ఆ పార్టీ మీడియాకాని అంది పుచ్చుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించాయి. 

ఆయన చేసిన వ్యాఖ్యలలో వాస్తవాలను విశ్లషించకుండా ఆ వర్గం మీడియా కాని, ప్రతిపక్షం కాని సహజంగానే ఇలా చేస్తుంది. కాని కేటీఆర్‌ ఆ వ్యాఖ్యలు యాధాలాపంగా చేసినా, కావాలని చేసినా, అవి ఏపీలో జగన్ ప్రభుత్వానికన్నా, తెలంగాణలో టిఆర్ఎస్ కే ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరగవలసి ఉంది. ఆ ఎన్నికలలో ఓట్లు వేసేవారిలో ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో , ముఖ్యంగా హైదరాబాద్ లో  సెటిల్ అయినవారు  లక్షల మంది ఉంటారు. 

వారిలో వైసీపీ మద్దతుదారులు కూడా గణనీయంగానే ఉంటారు. వారంతా టిఆర్ఎస్ కు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల  ఎవరికి నష్టం అన్నది ఆలోచించుకోవాలి. కేటీఆర్‌ వ్యాఖ్యలను విమర్శిస్తూ, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టింగులు వచ్చాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ లోని పలు రోడ్లు తటాకాలు గా మారిన ఫోటోలు, పాతబస్తీలో రోడ్లపై బోట్లు వేసుకుని తిరుగుతున్న ఫోటోలను పలువురు నెటిజన్లు పోస్టు చేశారు.  

కేటీఆర్‌కు మద్దతుగా మంత్రి ప్రశాంతరెడ్డి వంటి కొద్ది మంది అతిగా మాట్లాడేవారు ఏపీపై విమర్శలు చేసినా, చివరికి కేటీఆర్‌ వెనక్కి తగ్గడంలో వీరికే పరువు తక్కువ అయినట్లు అవుతుంది. హైదరాబాద్ నగరం ఈ ఎనిమిదేళ్లలోనే నిర్మితమైనది కాదు. శతాబ్దాల తరబడి ఇక్కడ ఉన్న వనరులు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా అభివృద్ది చెందుతూ వచ్చింది. ఈ అభివృద్దిలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఎంతో కొంత భాగస్వామ్యం  ఉంది. ఇది కాదనలేని సత్యం. రియల్ ఎస్టేట్ , ఫార్మా, తదితర రంగాలలో ఇప్పటికీ ఇలాంటివారి పాత్రే అధికంగా ఉంది. ఇక ఐటి రంగానికి సంబందించి నేదురుమల్లి జనార్ధనరెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారు చేసిన కొన్ని కార్యక్రమాలు బాగా ఉపకరించాయి. 

ప్రత్యేకించి వైఎస్ హయాంలో నిర్మించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం ఐటి రంగానికే తలమానికంగా ఉంది. వైఎస్ హయాంలోనే  శివారులోని నల్లగండ్ల , వట్టినాగులపల్లి తదితర ప్రాంతాలలో  అభివృద్ది ప్రణాళికలకు దారులు పడ్డాయి. అవుటర్ రింగ్ రోడ్డు, కొత్త విమానాశ్రయం, మెట్రో రైల్ మొదలైనవి వచ్చాయి. అలాంటి లాండ్ మార్క్ అభివృద్ది ఈ ఎనిమిదేళ్లలో ఏమి చేశారంటే ఏమీ ఉండదు. అలా అని అసలేమీ చేయలేదని కాదు. ఆయా ప్రాంతాలలో అవసరమైన రోడ్లు, వంతెనల నిర్మాణం బాగానే జరిగింది. కాని అవే సరిపోతాయా? అన్నది ఆలోచించాలి. ఇక రాజకీయంగా చూస్తే నిజంగానే హైదరాబాద్ ను టిఆర్ఎస్ అంతగా అభివృద్ది చేస్తే ఇక్కడ బీజేపీకి అనూహ్యంగా నలభై ఎనిమిది డివిజన్ లు ఎలా వచ్చాయి? తెలంగాణ మొత్తం  అభివృద్ది పదంలో  ఉంటే హుజూరాబాద్ లో పాతికవేల ఓట్ల తేడాతో టిఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది. 

దుబ్బాకలో వెయ్యి ఓట్లతో ఎలా పరాజయం చెందింది? హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తే నీరు వరదలా ఎందుకు మారుతోంది?సరూర్ నగర్ చెరువు ,మరికొన్ని ఎందుకు పొంగి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి? గత వరదలలో కార్లు సైతం కొట్టుకుపోయాయే? ఇళ్లు అనేకం ధ్వంసం అయ్యాయే? అంత మాత్రాన హైదరాబాద్ పాడైపోయిందని కాదు. కాని ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఇక్కడి పరిస్థితిని మర్చిపోకూడదు. వరదలలో ఇబ్బంది పడ్డవారికి ఐదువేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి,కొంతమందికి ఇచ్చి, మిగిలినవారికి ఎన్నికల తర్వాత ఇస్తామని వాగ్దానం చేసి ఎందుకు విస్మరించారు? తెలంగాణలో అనేక రోడ్లపై రైతులు తాము పండించిన వరి దాన్యాన్ని ఆరబోసుకుని , వాటిని ఎవరు కొంటారా అని ఎదురు చూస్తూ వర్షం వస్తే అవి తడిసిపోతుంటే గుండెలు అవిసేలా రోధిస్తున్నారే.? దానిని కదా నరకం అనేది.

రోడ్లపై  హైదరాబాద్ లో ఆ మధ్య ఎన్ని విమర్శలు వచ్చింది తెలియదా? ఆ తర్వాత వాటిని కొంతమేర బాగు చేశారు. అయినా పలు  కాలనీలలో ఉన్న రోడ్లు అనేక చోట్ల దారుణంగా ఉన్నాయని, పారిశుద్ద్యం క్షీణించిందని కొన్ని ఆంగ్ల పత్రికలలో ఫోటోలతో సహా కధనాలు వస్తుంటాయే. జిల్లాలలో కూడా కొన్ని రోడ్లు ఇలాగే ఉంటాయి. బిజెపి నేత, మాజీ మంత్రి డి.కె. అరుణ గద్వాల ప్రాంతానికి వస్తే అద్వాన్నపు రోడ్లను చూపిస్తామని సవాల్ చేశారే.పాదయాత్ర చేస్తుంటే గోతులను చూడాలో, ప్రజలను చూడాలో తెలియడం లేదని ఆమె ఎద్దేవ చేశారే? అంటే దీని అర్దం ఇలాంటి సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి.

అంతమాత్రాన మరో రాష్ట్రాన్ని చులకనగా మాట్లాడడం ద్వారా ఏమి సాధించినట్లు. ఆ రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ పోటీలో ఉంటే , అప్పుడు ఇలా మాట్లాడితే అది వేరే విషయం. కాని ఆ పరిస్థితి లేదు కదా?ప్రస్తుతం ఎపిలో రోడ్లను యుద్ద ప్రాతిపదికన రిపేరు చేయడం, కొత్త రోడ్లను వేయడం చేస్తున్నారు కదా.విద్యుత్ సరఫరా గురించి మాట్లాడారు. తెలంగాణలో బాగుంది అని చెప్పదలిస్తే అంతవరకు ఓకే. హైదరాబాద్ వరకు కరెంటు పరంగా  ఇబ్బంది రాని మాట నిజమే. కాని జిల్లాలలో ,పల్లెలలో అనధికార కోతలు బాగానే ఉంటున్నాయని పలువురు చెబుతున్నారు.కెసిఆర్ తెలంగాణకు సంబందించి అనేక వాగ్దానాలు చేశారు. వాటన్నిటిని నెరవేర్చారా? వాటి గురించి ఎప్పుడైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కానీ , వైసీపీ నేతలు కాని ప్రశ్నించారా? ఏపీలో అమ్మ ఒడి, చేయూత, ఆసరా, బడులు నాడు-నేడు, గ్రామ,వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ మొదలైనవి ఎన్నో వచ్చాయి. 

వాటిని అభివృద్ది అనజాలరా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా పోల్చవచ్చు.కాని భావి ముఖ్యమంత్రిగా అందరి దృష్టిలో ఉన్న కెటిఆర్ అనవసరంగా వేరే  రాష్ట్ర రాజకీయాలలో వేలు పెట్టినట్లు మాట్లాడితే ఆయనకే నష్టం. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఒక యువనేత స్థాయికి దిగజారి ఆయన మాట్లాడితే ఎవరికి విలువ తగ్గుతుందన్నది ఆలోచించుకోవాలి. కెటిఆర్ వ్యాఖ్యలు చేసిన వెంటనే ప్రతిపక్ష టిడిపి, వారి నేత లోకేష్  ఎపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిజమే.వారికి ఇది ఒక అవకాశం.కాకపోతే వారు ఒక విషయం మర్చిపోతున్నారు.గతంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు తీరుపై ఇదే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు కూడా వర్తిస్తుందన్న సంగతి మర్చిపోతున్నారు. ఉదాహరణకు హరికృష్ణ శవం పక్కనే ఉండి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి రాయబేరం చేశారని కేటీఆర్‌ అప్పట్లో వెల్లడించారు. 

చంద్రబాబు  ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం అధ్వానం అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కానీ ఇతర నేతలు కాని పలు విమర్శలు చేశారు. వాటన్నిటిని కూడా టిడిపి నేతలు అంగీకరిస్తారా అన్నది చెప్పగలగాలి. అసలు సంక్రాంతికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గోదావరి జిల్లాలకు కోడి పందాలు చూడడానికి వెళ్లి వస్తుంటారు కదా. ఏపీ పరిస్థితి గురించి ఆయనను అడిగి ఉంటే సరిపోయేది కదా. ఎవరో స్నేహితుడు చెప్పారంటూ  తోచీ,తోయని విధంగా మాట్లాడి అప్రతిష్టకు గురి కావడం ఎందుకు? ఏది ఏమైనా వ్యాఖ్యలు చేసిన తర్వాత తిరిగి అర్దరాత్రి సమయంలో  కేటీఆర్‌ వివరణ ఇచ్చి, జగన్‌ను సోదర సమానంగా చూస్తానని చెప్పడం హర్షణీయమే. ఎదుటివాడి కంటిలో నలుసు ఉందని చెప్పేముందు తన కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవాలని సామెత. కేటీఆర్‌  భవిష్యత్తులో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా ఉంటే ఆయనకు , ఆయన పార్టీకి మంచిదని మాత్రం చెప్పకతప్పదు. 

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు