వీరికి సడన్‌గా ఏపీపై ఎందుకంత ప్రేమ?

19 Jun, 2022 15:17 IST|Sakshi

కొద్ది రోజుల క్రితం విజయవాడలో రాజధాని అమరావతిపై ఒక సమావేశం జరిగింది. రాజధాని ఉద్యమం 900 రోజుకు చేరిందంటూ ఆ సమావేశం పెట్టారు. అందులో మాట్లాడిన కొందరు వక్తలు చాలా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. 

అందులోను  రిటైర్డ్ న్యాయమూర్తి గోపాలగౌడ, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, పౌరహక్కుల నేత ఫ్రొఫెసర్ హరగోపాల్ ప్రభృతులు ఉన్నారు. సీపీఐ నారాయణ వంటివారు ఈ సమావేశంలో పాల్గొన్నా, వారు ఎప్పుడూ చెప్పే విషయాలు చెబుతుంటారు కాబట్టి, వారు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న అబిప్రాయం ఉంది కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా ఏమీ అననవసరం లేదు. 

కాకపోతే గోపాలగౌడ గతంలో రాజధాని భూముల సమీకరణకు వ్యతిరేకంగా కూడా వచ్చి మాట్లాడి వెళ్లినట్లు గుర్తు. అప్పట్లో ఆ రకమైన సమీకరణ రైతులకుఅన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పారు. కాని ఇప్పుడే అదే గౌడ వచ్చి రాజధానిలో మార్పులు ఉండరాదని, మొత్తం లక్షన్నర కోట్లు అయినా అక్కడే వ్యయం చేయాలని చెప్పి అందరిని విస్తుపరిచారు. వీరు సామాజిక బాధ్యతతోనే మాట్లాడారా?లేక అమరావతి రైతుల ముసుగులో ఉన్న కొందరు వ్యాపారులు తీసుకు వచ్చారు కనుక వారికి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో మాట్లాడారో అర్ధం కాదు. రాజధాని పై హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా తీర్పు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి, మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన అన్నారు. 

ఒక న్యాయ కోవిదుడు ఇలా మాట్లాడడమా? అసలు శాసనసభకు చట్టం చేసే హక్కే లేదని గౌరవ హైకోర్టు తీర్పు ఇస్తే దానిని ఇలాంటి మాజీ న్యాయమూర్తులు సమర్దించడమా? పైగా అమలు చేయకపోతే కేసులు పెట్టాలని అనడమా? ఎంత దారుణం. హైకోర్టు తీర్పుపై ఏపీ శాసనసభలో క్షుణ్ణంగా చర్చించి, హైకోర్టు కాని, శాసన వ్యవస్థ కాని ఎవరి పరిధులలో వారు ఉండాలని పేర్కొనడం గురించి గౌడ మాట్లాడరా? కాకపోతే జడ్జిలకు బంగ్లాలు నిర్మించలేదని బాదపడ్డారు. మరి ఇదే సమయంలో రాజధాని భూ స్కామ్ కేసులు, వాటిని న్యాయ వ్యవస్థ హాండిల్ చేసిన తీరు గురించి కూడా గౌరవ న్యాయమూర్తి చర్చించి తన అబిప్రాయాలు చెబితే బాగుండేది కదా? గౌరవ న్యాయమూర్తులు కొందరికి అమరావతిలో భూ ప్రయోజనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబితే ,దానిని న్యాయ వ్యవస్థ ఎలా స్వీకరించాలో కూడా ఈయన వివరించి ఉండాల్సికదా.

రాజధానిలో ఇప్పటివరకు చేసిన నిర్మాణాల గురించి, వాటిని అబివృద్ది చేయండని చెప్పడం తప్పుకాదు. కానీ ఇప్పటికే ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అప్పు చేసింది కనుక మరో లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అమరావతి ప్రాంతంలోనే వ్యయం చేయాలని అనడం మాత్రం గౌడ ది పూర్తిగా బాద్యతారాహిత్యం. కేవలం కొందరికి మేలు చేసేందుకే ఆయన అలా మాట్లాడారేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. వేరే రాష్ట్రానికి చెందిన ఈయనకు శ్రీ బాగ్ ఒడంబడిక, వికేంద్రీకరణ,తదితర అంశాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. 

అలాగే శివరామకృష్ణన్ కమిటీ మూడు పంటలు పండే భూములలో రాజధాని పెట్టవద్దని చెప్పిన సంగతిని ఆయనకు ఎవరూ చెప్పకపోయి ఉండవచ్చు. ఆయన మేధావి కావచ్చు. న్యాయ కోవిదుడు కావచ్చు.కాని ప్రజల మనిషి కాదని మాత్రం తనకు తాను రుజువు చేసుకున్నారేమో అని పిస్తుంది. ఇక మరో ప్రముఖుడు హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుచితంగా ఉన్నాయనిపిస్తుంది. రాజధాని మార్చరాదని అభిప్రాయం ఉంటే ఆక్షేపణీయం కాదు. కానీ ఆయన విజయవాడ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సరసన కూర్చుని ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించలేం. ఆయనను ఎవరు మాయ చేసి తీసుకు వచ్చారో తెలియదు కానీ, ఎవరి ట్రాప్ లో పడి వచ్చారో తెలియదు కానీ ,పూర్తిగా పేదల ప్రయోజనాలను ఆయన విస్మరించడం విస్తుపరుస్తుంది. రాజధాని ప్రాంతంలో పేదలైన ఎస్.సి,ఎస్టి, బిసి వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని డిమాండ్ చేసేవారికి ఆయన మద్దతు ఇవ్వడమా? ఇలాగేనా పౌరహక్కులు కాపాడడం అంటే?ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదట. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో  ఏమి ప్రచారం చేశారు. 

ఆంద్ర పెట్టుబడిదారులు దోచుకుపోతున్నారని కదా? అలాంటి ఉద్యమానికి హరగోపాల్ కూడా మద్దతు ఇచ్చారు కదా? అంటే తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులు దోపిడీ చేయకూడదు. ఏపీలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఇష్టారీతిన భూముల రేట్లు పెంచి దోపిడీ చేయవచ్చని హరగోపాల్ వంటివారు చెబుతున్నారా? రాజధానిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చితే దానికి ఆయన మద్దతు ఇవ్వడమా? హవ్వ! ఇదేనేమో కాలమహిమ! హరగోపాల్ వంటివారిని కూడా అప్రతిష్టపాలు చేయగల తెలివైన రాజకీయనేతలు ఎపిలో ఉండడం విశేషమే. హైకోర్టు తీర్పు ఇచ్చింది కనుక దానిని అమలు చేయకపోతే వ్యవస్థపై నమ్మకం పోతుందట. 

మరి ఇదే హరగోపాల్ ఎన్ని కోర్టు తీర్పులను విమర్శించలేదూ. అంతదాక ఎందుకు విప్లవకవి వరవరరావుకు బెయిల్ ఇవ్వరాదని ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సమర్ధిస్తారా? కోర్టులను విమర్శించకూడదు. న్యాయమూర్తులకు ఆపాదించకూడదు అన్నది వాస్తవమే అయినా, తీర్పులపై విశ్లేషించుకోవచ్చు.. విమర్శించవచ్చన్న సంగతి మేధావి అయిన హరగోపాల్ కు తెలియకుండా ఉంటుందా? న్యాయ వ్యవస్థ లో ఏమి జరుగుతోందో తెలియనంత అమాయకంగా హరగోపాల్ ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో హైకోర్టు జడ్జిలనే నేరుగా కోర్టులలోనే దూషించిన  ఘట్టాలు జరిగినప్పుడు , వారిపై దాడి చేసినంత పని చేసినప్పుడు హరగోపాల్ ఖండించారో ,లేదో గుర్తు లేదో కానీ, ఇప్పుడు ఆయనకు సడన్ గా న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం కలగడం మంచిదే అనుకోవాలా? మరో మేధావి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రవారిని ఉద్యమకారులు కొందరు దూషిస్తున్న సమయంలో ఎన్నడైనా వారించారా? ఆంధ్రులపై కొన్ని చోట్ల దాడులు జరిగినప్పుడు ఖండించారా? ఇప్పుడు సడన్ గా ఏపీపై అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది. దానికి కారణం టిడిపి అదినేత చంద్రబాబుతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలేనేనా? గత ఎన్నికల సమయంలో టిడిపి,కాంగ్రెస్, సిపిఐలతో కలిసి పోటీచేసిన కోదండరామ్ పార్టీకి మెజార్టీ చోట్ల డిపాజిట్ లు దక్కకపోయి ఉండవచ్చు. 

అయినా ఆనాడు కోదండరామ్ పార్టీకి అవసరమైన వనరులు అన్నీ టీడీపీ నాయకత్వం సమకూర్చిందన్న కృతజ్ఞతతోనే వారు విజయవాడ వరకు వెళ్లి ,అమరావతికి మద్దతు ఇచ్చి వచ్చారా? ఒక టెంట్ కింద కూర్చుని, టీడీపీ మీడియాతో మాట్లాడి వెళ్లిపోయేవారు మహోద్యమం చేసినట్లుగా వీరంతా గుర్తించారన్నమాట. వీరంతా అమరావతి రాజధాని ఒకే చోట ఉండాలని కోరదలిస్తే ,దానికి నిలదీయాల్సింది కేంద్రాన్ని కదా? లక్ష కోట్లా.?ఇంకా ఎక్కువ కోట్లా అన్నదానితో నిమిత్తం లేకుండా కేంద్రం నిధులు ఇవ్వాలని వీరు ఎందుకు డిమాండ్ చేయలేదో తెలియదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారరాదట. అలాగైతే 1956లొ సమైక్య రాష్ట్రానికి నాటి హైదరాబాద్ అసెంబ్లీ కూడా మద్దతు ఇచ్చింది కదా? మరి ఆ నిర్ణయం మారే వరకు ఎందుకు తెలంగాణవాదులు ఆందోళనలు చేశారు. 

పలు ప్రభుత్వాలు తెలంగాణ ఇవ్వడం కుదరదని, హైదరాబాద్ చుట్టూరానే అనేక సంస్థలు ఏర్పాటు చేసినా, ఎందుకు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు? ఇప్పుడు కూడా ఏపీలో అయినా, మరెక్కడైనా ప్రభుత్వ అబిప్రాయాలను అంతా ఆమోదించనవసరం లేదు. నచ్చకపోతే నిరసనలకు దిగవచ్చు. తప్పు లేదు. కాకపోతే అవి హేతుబద్దమా?కాదా? ప్రజలంతా ఆమోదిస్తారా?లేదా అన్నది ఎన్నికలలో తేలుతుంది. అంతవరకు ఎందుకు ఆగడం లేదు? ఏది ఏమైనా అసలు ఆంధ్రకు ఈ దుస్థితి ఏర్పడడానికి కారణమైనవారితో సుద్దులు చెప్పించడం వారికే చెల్లిందని అనుకోవాలి.

తెలంగాణ వాదులుగా పచ్చి ఆంద్ర వ్యతిరేకులుగా ముద్ర పడ్డ  నేతలను విజయవాడ తీసుకు వచ్చి అమరావతి గురించి మాట్లాడించడమే ఆశ్చర్యంగా ఉంటుంది. నిర్వాహకుల చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుంది. ఆంద్రా బాగుపడాలని కోరుకునేవారిని పిలవాలి కాని, ఆంద్ర అంటే గిట్టనివారిని తీసుకు రావడం ద్వారా వారు ఏమి చెప్పదలిచారు? రాజదాని రైతుల భూములు పోయాయట .మరి వారు తీసుకుంటున్న పరిహారం మాటేమిటి. వారు భూములు అమ్ముకోవడం ద్వారా కోట్లు సంపాదించిన మాటేమిటి. 

రైతులు ఎవరికైనా అన్యాయం జరిగితే దాని గురించి ఎవరైనా అడగవచ్చు.కాని ఆ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల లక్ష్యాల కోసం పనిచేయడం సరికాదు .నిజాయితీ ఉంటే రియల్ ఎస్టేట్ వారికి నష్టం కలుగుతుంటే ఆ విషయాన్ని ధైర్యంగా చప్పి ప్రభుత్వాన్ని పరిష్కారం కోరవచ్చు.కాని వారు అలా చేయడం లేదు. రైతుల పేరుతో డ్రామాలు నడుపుతున్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ గురించి అందరికి తెలిసినా, అసలు ఏమి జరగనట్లు నటిస్తున్నారు.వేల ఎకరాల భూములు ఎలా చేతులు మారాయో తెలియదా?

ఇలాంటి వాటికి హరగోపాల్, కోదండరామ్, గోపాలగౌడ వంటివారు మద్దతు ఇవ్వడమా?, ఇది ఒక విషాదం. ఇదే సమయంలో వీరు మరో మాట చెప్పారు. తీర్పు తర్వాత రాజధాని మారదన్న నమ్మకం రైతులలో వచ్చిందని, హైకోర్టు అన్ని కోణాలలో పరిశీలించి తీర్పు ఇచ్చిందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇది మారదన్న భావన ఉన్నప్పుడు ఇక ఉద్యమం అవసరం ఏమి ఉంటుంది? తెలంగాణ నేతలను పిలుచుకు రావల్సిన అవసరం ఏమి ఉంటుంది?అయినా ఏపీ ప్రభుత్వం అమరావతి గ్రామాలలో అభివృద్ది చేయబోమని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే మొత్తం ఏపీ ప్రజల డబ్బు అంతా తెచ్చి కేవలం కొన్ని గ్రామాలలో వ్యయం చేయలేమని చెబుతోంది.అ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా పెట్టుబడిదారుల కోసమే తెలంగాణ నేతలు వచ్చి ప్రసంగాలు చేస్తే ఆంధ్ర ప్రజలు సమ్మతిస్తారా? 

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

మరిన్ని వార్తలు