జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ‘అధర్మ యుద్ధం’

21 Apr, 2022 14:05 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ప్రధాన ప్రతిపక్షంతో పాటు, వారికి సపోర్టు ఇచ్చే మీడియా కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. గతంలో అసలు ఎన్నడూ చార్జీలు పెరగనట్లు, ఇప్పుడే ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ చార్జీలు పెంచారేమోనన్న అనుమానం వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజమే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇలా చార్జీలు పెరిగినప్పుడు విమర్శించలేదా అని అంటే కాదనలేం. దానికి ప్రతిగా ప్రతిపక్ష  టీడీపీ విమర్శలు చేస్తే ఆక్షేపించనవసరం లేదు. కాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్ కాని మరీ అసహ్యకరమైన విమర్శలు చేయడం బాగోలేదు. జగన్‌ను ఎంతైనా విమర్శించండి కాని సవ్యమైన భాషలో వ్యాఖ్యానిస్తే బాగుంటుందని చెప్పాలి. ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచవలసి వచ్చిందో అందరికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు గత కొన్నాళ్లుగా డీజీల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచాయి. వారి కారణాలు వారికి ఉండవచ్చు. కాని డీజిల్, పెట్రోల్ ధరలు పంపుదల పేద, మధ్య తరగతి వారిపై అధికంగా ఉంటుంది.

అదే సమయంలో డీజిల్ వాడే ఆర్టీసీ బస్సులపైన, ఇతర రవాణా రంగంపైన పెను భారం పడుతోంది. గతంలో లీటర్ వంద రూపాయలు దాటుతుందేమో అని అంతా భయపడేవాళ్లం. అది దాటిపోయి కూడా చానాళ్లయింది. ఇప్పుడు ఏకంగా 115-120 రూపాయల మధ్య ధర ఉంటోంది. అలాగే డీజిల్ ధర కూడా వంద రూపాయలు దాటేసింది. ఇలాంటి పరిస్థితిలో డీజిల్‌పై ఆధారపడి బస్సులు నడిపే ఆర్టీసీ ఏమి చేయాలి. చార్జీలు పెంచకపోతే సంస్థ మరింత దారుణమైన నష్టాలలో కూరుకుపోతుంది. అప్పుడే ఇదే ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే మీడియా మరింత గగ్గోలు పెడుతూ ఆర్టీసీని ముంచేశారని వ్యాఖ్యానిస్తారు. ప్రజలలోకి ఆ విషయాన్ని బలంగా తీసుకు వెళ్లే యత్నం చేస్తారు. అంటే చార్జీలు పెంచినా గొడవే. పెంచకపోయినా గగ్గోలే అని అర్ధం అవుతుంది. అలాంటప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్షం విమర్శలతో సంబంధం లేకుండా ఆర్టీసీని రక్షించుకోవడానికి చార్జీలు పెంచక తప్పదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా తప్పదు.

గతంలో చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండేవారు. 1989 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ మెయిన్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ కూడా పలుమార్లు టిక్కెట్ల ధరలు పెంచింది. అలాగే టీడీపీ నేతలు కూడా వ్యవహరించేవారు. అధికారంలో ఉంటే బాద్యత ఎక్కువ ఉంటుందన్నది వాస్తవం. అందువల్ల సంస్థ మునిగిపోతుంటే చూస్తూ కూర్చోలేరు కదా. అక్కడికి జగన్ ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రభుత్వంలోకి తీసుకుని వారికి జీతాలు ఇస్తున్నారు. కరోనా సంక్షోభంలో కూడా వారికి ఇబ్బంది ఎదురుకాలేదు. అదే ఆర్టీసీలోనే వారు ఉండి ఉంటే జీతాల సమస్య కూడా వచ్చి ఉండేది. తెలంగాణ ఆర్టీసీలో ఎలాంటి చికాకులు వచ్చాయో అంతా గమనించాలి. అలాంటి స్థితి లేకుండా చేసిన జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోతే పోనీ, ఏ అవకాశం వచ్చినా రాళ్లు.. కాదు.. బండరాళ్లు వేస్తున్నారు. తాజాగా డీజిల్ సెస్ పేరుతో టిక్కెట్ కు పది రూపాయలు అదనంగా వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

అదే కిలోమీటర్ల లెక్కన చార్జీ పెడితే చాలా మొత్తం అవుతుంది. అలా కాకుండా టిక్కెట్‌కు పది రూపాయలే కనుక కొంత అసంతృప్తి ఉన్నా ప్రయాణికుడు భరించడానికి పెద్దగా ఇబ్బంది పడరు. అయినా టీడీపీ మీడియా సెస్సుల కస్సు బుస్సు, బాదుడే బాదుడు అన్న హెడ్గింగ్‌లు పెట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేయాలని యత్నించింది. పోనీ ఇదే మీడియా తెలంగాణలో ఇప్పటికే వేసిన డీజిల్ సెస్ పైన కూడా ఇలాంగే హెడింగ్‌లు పెట్టిందా అంటే అలా చేయలేదు. చాలా సాదాసీదాగా ప్రయాణికులపై డీజిల్ సెస్ అంటూ వార్త వరకే ఇచ్చింది. తప్పులేదు. ఇదే వార్తలు ఇచ్చే పద్దతి. కాని ఏపిలో ఏమి చేశారు? ఏకంగా బస్  ప్రయాణికుడు నలిగిపోతున్నట్లు బొమ్మవేసి బ్యానర్‌గా ఇచ్చారు. రకరకాల విశ్లేషణలు ఇచ్చారు.

తెలంగాణలో గత కొద్దికాలంలో మూడు సార్లు రకరకాల రూపాలలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. అయినా ఈ మీడియా దానిని సీరియస్‌గా తీసుకుని విశ్లేషణలు ఇవ్వలేదు. అదే ఏపీలో అయితే మాత్రం ఇష్టారీతిన వార్తలు ఇచ్చారు. ఇదే అధర్మ యుద్దం అంటే. జగన్ విజయం సాధించినప్పటి నుంచి ఈనాడు అధినేత రామోజీరావు మరికొందరు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. దాంతో ఇలా అధర్మ యుద్దం చేసి అయినా జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని తంటాలు పడుతున్నారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా వ్యవహరించి క్రెడిబిలిటిని దెబ్బతీసుకుంటున్నాయి. అయినా వారికి ఏదో అంశం కావాలి కాబట్టి విమర్శలు చేస్తారు. కాని మీడియాకు ఏమైంది. వారే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్రం డీజిల్ ధరలు పెంచినా ఆ విషయం దాచి పెట్టి, అదేదో ఏపీలో పనిలేక ధరలు పెంచారన్న చందంగా కథనాలు ఇస్తున్నారు. దానిని బట్టే వారు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.

కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు 

మరిన్ని వార్తలు