ఎన్టీఆర్‌ ఏవైపు ఉన్నా.. టీడీపీలో వణుకే!

6 Sep, 2022 16:57 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు 'సోము వీర్రాజు చేసిన ఒక ప్రకటన రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి పెంచింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు మాత్రం భయపట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్‌ గా పేరొందిన ప్రముఖ సినీ నటుడు  సేవలను బీజేపీ వినియోగించుకుంటుందని వీర్రాజు వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కొద్ది రోజుల క్రితం ఎన్‌టీఆర్‌ భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. 

ప్రజలలో సినిమా నటుల పట్ల ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకోవడానికి బీజేపీ ఎన్టీఆర్‌ను ఆకర్షించే యత్నంలో పడిందన్న వార్తలు నిజమని తేలింది. అమిత్ షా ను ఎన్టీఆర్‌ కలిసినప్పుడు కేవలం ఆర్ఆ‌ర్‌ఆర్ సినిమా హిట్ అయిన సందర్భంలో , ఆ సినిమాలో ఎన్టీఆర్‌ నటనను మెచ్చుకోవడానికే ఆ భేటీ జరిగిందని కేంద్ర మంత్రి, తెలంగాణ నేత కిషన్ రెడ్డి చెప్పారు. దాంతో ఆ ఘట్టం ముగిసిందని అనుకున్నవారు లేకపోలేదు. కాని సడన్ గా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఆ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. 

వీర్రాజుకు నిర్దిష్ట సమాచారం లేకుండా అలా మాట్లాడతారా? పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా మాట్లాడి ఉంటే ఆయనకు చిక్కులు తెచ్చి పెడతాయి కదా? నిజంగానే ఎన్టీఆర్‌ తన సేవలను బీజేపీకి అందించడానికి ఒప్పుకున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నీ  సహజంగానే వస్తాయి. అయినప్పటికీ వీర్రాజు చెప్పారు కనుక దానిని నిజమే అని అనుకోవాలి. కనీసం ఎన్టీఆర్‌ ఏదైనా వివరణ ఇచ్చేవరకన్నా. ఎన్టీఆర్‌ అయితే దీనిని ఖండించలేదు. ధృవీకరించలేదు. భవిష్యత్తులో ఏమి చేస్తారో తెలియదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మద్యకాలంలో టీడీపీతో పొత్తు అంటూ బెదిరిస్తున్న సందర్భంలో ఆయనకు పోటీగా బీజేపీ  ఎన్టీఆర్‌ను రంగంలోకి దించుతోందా అన్న సందేహం కూడా లేకపోలేదు.  వీర్రాజు ప్రకటనతో తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీని భుజాన వేసుకుని మోస్తున్న మీడియా ఉలిక్కి పడినట్లుగా ఉంది. అంతే. ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్‌ను హెచ్చరిస్తూనో, లేక బెదిరిస్తూనో కథనాలు వచ్చాయి. ఇదంతా బీజేపీ ఎత్తుగడ అని , ఎన్టీఆర్‌ బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం కలిగించడానికి స్కెచ్ వేశారని టీడీపీ పత్రిక ఒకటి  వ్యాఖ్యానించింది. తెలంగాణలో సెటిలైన ఆంధ్రులను ఆకట్టుకోవడానికి బీజేపీ ఈ ట్రిక్ వాడి ఉండవచ్చని పేర్కొంది. బహుశా టీడీపీ మీడియా తొలుత అదే విషయాన్ని నమ్మి ఉండవచ్చు. 

కాని తెలంగాణ బీజేపీ నేతల బదులు ఏపీ బీజేపీ అద్యక్షుడు ఈ విషయం మాట్లాడడంతో ఆ మీడియా కలవరానికి గురైనట్లుగా భావించాలి. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ ను భయపెట్టడానికి గాను కొన్ని వాక్యాలు రాసినట్లు అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ ఇంతవరకు కుటుంబాన్ని కాదని ఎప్పుడూ ,ఎక్కడా మాట్లాడలేదని, టీడీపీని వ్యతిరేకించో, సామాజికవర్గాన్ని వ్యతిరేకించో తన కెరీర్ పాడుచేసుకునేంత తెలివితక్కువవాడు కాదని ఆ పత్రిక విశ్లేషకుల పేరుతో రాసింది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కెరీర్ లో దూసుకు వెళుతున్నారని, సుదీర్ఘకాలం ఉండే తన సినీ జీవితాన్ని రాజకీయాల కోసం వదలుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న అని ఆ పత్రిక కథనాన్ని ముగించింది. 

అంటే దీని అర్ధం ఏమిటి? జూనియర్ ఎన్టీఆర్‌ బీజేపీకి మద్దతు ఇస్తే ఆయన కెరీర్  పాడవుతుందని హెచ్చరిస్తున్నారా? టీడీపీని , తన సామాజికవర్గాన్ని వ్యతిరేకించే తెలివి తక్కువవాడు కాదని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి. కమ్మ వర్గం అంతా ఆయనను వ్యతిరేకిస్తుందని చెబుతున్నారా? ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేస్తామని బెదిరిస్తున్నారా? ఆ మద్య ఎన్టీఆర్‌ సినిమా ఒకటి విడుదల అయినప్పుడు తెలుగుదేశం కు చెందినవారు దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా? పోనీ టీడీపీవారు అలా చేసినప్పుడు కమ్మ సామాజికవర్గం వారంతా ఆయనకు అండగా నిలబడ్డారా? మరి అలాంటప్పుడు కొత్తగా టీడీపీ నుంచి, కమ్మ వర్గం నుంచి వచ్చే  నష్టం ఏమిటో తెలియదు. జూనియర్ రాజకీయాలలోకి రావచ్చు. రాకపోవచ్చు. 

వీరు ఇప్పుడే ఇంతగా ఉలిక్కి పడడానికి కారణం ఏమిటన్నదే ప్రశ్న. ఈయన బీజేపీకి మద్దతు ఇస్తే తెలుగుదేశం కు ఏపీలో తీవ్రనష్టం వాటిల్లుతుందన్న ఆందోళనకాక మరేమైనా ఉందా? ఎన్టీఆర్‌ తన కుటుంబాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదట. ఆ కుటుంబంలో పెళ్లిళ్లు జరిగితే కూడా ఆయనను పట్టించుకోని సంగతి మర్చిపోయారా? 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ను వాడుకుని , తదుపరి కరివేపాకు మాదిరి వదలివేసింది ఎవరు? మహానాడులో ఆయన ప్లెక్సీలు కూడా పెట్టనివ్వలేదన్న ప్రచారం జరిగింది కదా? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఎన్టీఆర్‌ పోటీ అవుతారని భయపడి దూరంగా పెట్టలేదా?ఈ నేపథ్యంలోనే తన సోదరి సుహాసిని కుకట్పల్లిలో పోటీచేసినప్పుడు ప్రచారానికి కూడా వెళ్లలేదు కదా? 

2009లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పాడుకాని సినీ జీవితం ఇప్పుడే బీజేపీకి మద్దతు ఇస్తే ఎందుకు పాడవుతుంది? అంటే సినీ పరిశ్రమలోని తమ వర్గం వారితో తొక్కేస్తామని చెప్పకనే చెబుతున్నారా? మరి అదే ధీరి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు వర్తించదా? ఆయన 2009లో యువరాజ్యం అద్యక్షుడుగా ఉన్నప్పుడు కాని, 2014లో జనసేన పార్టీని స్థాపించి చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేసినప్పుడు కాని ఇలా ఎందుకు హెచ్చరికలు చేయలేదు. 

అంటే టీడీపీకి మద్దతు ఇస్తే సినిమా జీవితానికి ఇబ్బంది ఉండదని చెప్పదలిచారా?2019లో ఆయన ఎన్నికలలో పోటీచేసినా, ఓడిపోయినా, పవన్  సినీ జీవితానికి తగిలిన దెబ్బ ఏమిటి? ఆయన గత ఎనిమిదేళ్లుగా సినిమాలలో కూడా నటిస్తున్నారు కదా? కొన్ని సినిమాలు బాగానే ఆడాయి కదా? మరి జూనియర్ ఎన్టీఆర్‌కే సినీ సమస్య వస్తుందా? జూనియర్ ఎన్టీఆర్‌ జీవితం ఏమి పట్టు పాన్పుకాదన్న సంగతి అందరికి తెలుసు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. కుటుంబం కాని, టీడీపీ అది నాయకత్వం కాని ఎన్టీఆర్‌పట్ల ఎందుకు అలా వ్యవహరించిందో కారణాలు అందరికి తెలుసుకదా? 

ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని జూనియర్ ఎన్టీఆర్‌ తన ప్రతిభతో నిలబడి ఈరోజు ఈ స్థాయికి రాగలిగారు. ఇక్కడ చర్చ జూనియర్ రాజకీయాలలోకి రావడం గురించి కాదు. ఆయన వస్తే ఏ పార్టీకి నష్టం? ఏ పార్టీకి లాభం అన్న అంచనాలపై ఉన్న విశ్లేషణలపైనే. ఎన్టీఆర్‌ నిజంగానే తెలుగుదేశంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, అసలే అష్టకష్టాలు పడుతూ కునారిల్లుతున్న తెలుగుదేశం పార్టీకి  ఇక లేవలేని పరిస్థితి ఏర్పడుతుందన్న భయంతోనే ఇలాంటి కధనాలు రాస్తున్నారు. ఆయన ఎటూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లకపోవ్చు. పైగా బీజేపీ పెద్ద నేతలే ఆయనను ఆహ్వానించారు.జూనియర్ ఎన్టీఆర్‌  ఎక్కడ రాజకీయాలలోకి వచ్చి తమ ఆశలకు గండికొడతారో అన్న భయంతో చివరికి టీడీపీ మీడియా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇంతకీ ఆయన ఏమి చేస్తారో వేచి చూడాల్సిందే. 


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు