డబ్బున్నవాళ్లే పేదలను ఆదుకోవాలా?.. ఆవిర్భావం నాడూ అలాంటి మాటలే!

30 Mar, 2023 13:16 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ అధినేత , ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటలను ఒక్కోసారి ఆయనకు తెలియకుండా బయట పెట్టేస్తుంటారు. టీడీపీ ఆవిర్భావ దినం.. సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ధనికులకు ఆయన సంపద సృష్టిస్తే, తదుపరి  ఆ ఫలాలను వారు పేదలకు అందించాలన్నారు. తెలుగుదేశం పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిన కథనాలను పరిశీలిస్తే.. ఆయన ఎక్కడా ఏపీలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించలేదు. అంటే వాటిని కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పలేదు. కాకపోతే ముఖ్యమంత్రి జగన్ ను ఎప్పటిమాదిరే దూషించారు.  

అంటే.. ఎప్పటికి ఎయ్యది ప్రస్తుతమో అదే మాట్లాడతారని అనుకోవాలి. అంతకుముందురోజు పాలిట్ బ్యూరో సమావేశంలో ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను టిడిపి అధికారంలోకి వస్తే రద్దు చేస్తారని వైఎస్సార్‌సీపీ ప్రచారం చేస్తోందని, తాము అలా చేయబోమని, ఇంకా అధికంగా ఇస్తామని ఆయన అన్నట్లు మీడియాలో వచ్చింది. మరి అదే విషయాన్ని చంద్రబాబు ఆవిర్భావ సభలో చెప్పకపోవడం విశేషం. అంతేకాదు.. పేరుకు తెలంగాణలో సభ పెట్టారుగానీ తెలంగాణ ప్రభుత్వంపై ఒక్క విమర్శ చేయలేదు. పైగా ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పొగిడారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. అలాగే.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం రోశయ్యలను కూడా ఆయన ప్రశంసించారు. పీవీ మాదిరే తాను కూడా సంస్కరణలను చేపట్టానని చెప్పారు. మరి ఇప్పుడు ఆ సంస్కరణలకు ఎందుకు  కట్టుబడి ఉండడం లేదో మాత్రం చెప్పలేదు. 

అది బాబే చెప్పాలి
రైతులకు అసలు ఉచిత విద్యుత్ ఇవ్వరాదని 2001లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పేవారు. అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని అనేవారు. కానీ, ఆ తర్వాత కాలంలో ఆయన తన మాటపై నిలబడలేదు. పైగా ఇటీవలికాలంలో కేంద్రం తీసుకు వచ్చిన సంస్కరణలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎపిలో అమలు చేస్తుంటే,వాటిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడితే రైతులకు ఉరితాళ్లే అంటూ పచ్చి అబద్దం ప్రచారం చేస్తున్నారు. ప్రతిదానికి యూజర్ చార్జీలు ఉండాలని అధికారంలో ఉన్నప్పుడు గట్టిగా వాదించిన ఆయన ఇప్పుడు చెత్త పన్ను వేస్తారా అంటూ ఉన్నవి,లేనివి కలిపి విమర్శిస్తుంటారు. దీనిని బట్టి ఆయన సంస్కరణలు అబద్దమా? లేక ఇప్పటి ఉరితాళ్లు మాట అబద్దమా?అన్నది ఆయనే చెప్పాలి. 

ఆ స్టేట్‌మెంట్‌ పరిశీలిస్తే..
చంద్రబాబు తన ప్రసంగంలో ఇలా అన్నారని ఆ కధనాలలో ఉంది. ‘‘సంస్కరణల ఫలాన్ని అందిపుచ్చుకుని జీవితంలో స్థిరపడినవారు కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకుని, వారి అభివృద్దికి పాటుపడాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దీనిని ఒక ఉద్యమంలా చేపడతామ’’న్నారు. దీని అర్ధం ఏమిటి? పేదలను ఆర్ధికంగా అభివృద్ది చేయవలసిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని.. ధనికుల దయాదాక్షిణ్యాల మీదకు వదలిపెడతామని చెప్పడమేనా? ఒకసారేమో జగన్ స్కీములన్నీ మావే.. పేర్లు మార్చారు.. మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ చేస్తామని అంటారు. ఇప్పుడేమో డబ్బులున్నవాళ్లు పేదలకు సాయపడే స్కీమ్ తెస్తామని అంటున్నారు. 

ఆ ధైర్యం ఉందా?
ఏది నిజం?ఏది అబద్దం? ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకాని, చంద్రబాబు నాయుడుకాని పూర్తి గందరగోళంలో ఉన్నారనే చెప్పాలి. ఆయన సీఎం జగన్ అమలు చేస్తున్నవాటిని అవుననక తప్పడం లేదు. మనసులోనేమో వాటిని ఇష్టపడడం లేదు. జగన్ వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. వలంటీర్లు వృద్దుల ఇళ్లకే వెళ్లి పెన్షన్ లు ఇస్తున్నారు. రేషన్ సరుకులను కూడా ఇళ్లకే చేర్చుతున్నారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఎంత ఫీజు అయితే అంత జగన్ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆసరా కింద మహిళలకు ఆర్ధిక సాయం చేస్తున్నారు.చేనేత, కాపు, వాహనమిత్ర నేస్తాల పేరుతో పధకాలు అమలు చేస్తున్నారు. వీటన్నిటిని తొలగిస్తామని చంద్రబాబు నేరుగా చెప్పగలరా? అసలు ఈ స్కీములను ఒక్కోదానిని విశ్లేషించి వాటిని అమలు చేస్తామనో, చేయబోమనో ఎందుకు చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో కొత్తగా డబ్బున్నవారే పేదలను ఆదుకోవాలని అంటున్నారు. అది అయ్యేపనేనా! ఈ విషయాన్ని ఎన్నికల మానిఫెస్టోలో కూడా పెట్టగలరా?  

అభివృద్ధి అంటే.. 
గతంలో విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని చంద్రబాబు చెబుతున్నారు?. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ,వార్డు సచివాలయ భవనాలు, విలేజీ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు మొదలైనవాటిని తొలగించి మళ్లీ నిర్మిస్తారా?. పాలనా సంస్కరణలను రద్దు చేసి వార్డు, గ్రామ సచివాలయాలను ఎత్తివేస్తారా? జగన్ తీసుకువచ్చిన కొత్త పారిశ్రామికవాడ కొప్పర్తి , రామాయంపట్నం పోర్టు వంటివాటిని నిలుపుదల చేస్తారా? అవన్ని అభివృద్ది కిందకు రావా?విశాఖపట్నం నగరాన్ని మరింతగా అభివృద్ది చేయడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తారా? కేవలం అమరావతి గ్రామాలలో నాలుగు భవనాలు కడితేనే అభివృద్ది అవుతుందా? లేక విశాఖతో సహా పలు ప్రాంతాలలో వికేంద్రీకరించడం అభివృద్ది అవుతుందా? కొన్ని పడికట్టు పదాలను వాడి, తెలుగుదేశం మీడియాలో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచన ప్రతి మాటలోను కనిపిస్తుంది. 

గతం ఇంకెన్నాళ్లు?
ఇరవై ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో అది నేనే చేశా.. ఇది నేనే చేశా.. అని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు  విభజిత ఎపిలో గత ఐదేళ్లలోకాని, అంతకుముందు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు  ఫలానాది చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారు?. హైదరాబాద్ ను తానే నిర్మించానని, సెల్‌ఫోన్‌ తానే కనిపెట్టానని, జాతీయ రహదారులు తానే వేయించానని, చివరికి అవుటర్ రింగ్ రోడ్డు కూడా తన ఆలోచనే అని అన్నిటిని తన ఖాతాలోనే వేసుకుంటూ.. ఏవేవో చెప్పుకుంటూ పోవడం అంటే వినేవారిని వెర్రివాళ్లను  చేయడమే అవుతుంది. 

పునర్మిర్మాణం అంటే.. 
పోగా.. హైదరాబాద్‌లో ఆయన  ప్రస్తుతం నివసిస్తున్నారు. ఐదేళ్లు విభజిత ఏపీలో అధికారంలో ఉండి ,కరకట్ట మీద ఉన్న అక్రమ ఇంటిలోనే నివసించారు తప్ప సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? అధికారం పోయిన తర్వాత హైదరాబాద్‌లో తన ఇంటిని పునర్నిర్నించుకున్నారు తప్ప, ఏపీలో మాత్రం ఇల్లు నిర్మించుకోలేదు. కుప్పంలో స్థానిక ఎన్నికలలో పూర్తి పరాజయంతో  భయపడి , ముప్పైనాలుగేళ్ల తర్వాత ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇదేనా  పునర్నిర్మాణం అంటే!. ప్రజలలో తిరుగుబాటు వస్తోందని పడికట్టు డైలాగు మళ్లీ వాడారు. అంటే ఈ స్కీములు ఏవీ వద్దని ప్రజలు తిరుగుబాటు చేస్తామని అంటున్నారా?. కేవలం మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిస్తేనే తిరుగుబాటు వచ్చేటట్లయితే, నాలుగేళ్లుగా ఒక్క ఎన్నికలోను గెలవలేకపోయిన టిడిపిపై ప్రజలలో ఎంత ఏహ్య భావం ఉండి ఉండాలి?  

కొత్త స్కెచ్‌?
రాజకీయంగా పరిశీలిస్తే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అంటూ ఖమ్మంలో జరిగిన సభలో  చెప్పుకున్నారు కదా! మరి ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన సభలో ఆ ఊసే ఎత్తినట్లు కనిపించలేదు. పూర్వ వైభవం వస్తుందని మాట వరసకు అన్నారు. అంతే తప్ప అక్కడి నాయకులకు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చినట్లు కనిపించలేదు. కేసిఆర్ ప్రభుత్వం పై అక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్ధిస్తున్నారా?వ్యతిరేకిస్తున్నారా? తెలంగాణ టిడిపి నేతలకు ఇచ్చిన సందేశం ఏమిటి? ప్రభుత్వంపై పోరాడమనా? సమర్దించమనా? ఒకవైపు కేసిఆర్ ను పొగుడుతూ మాట్లాడిన తర్వాత తెలంగాణ టిడిపి నేతలు ఏమని ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తారు? ఇదంతా చూస్తే చంద్రబాబు నాయుడు కొత్త రాజకీయ సమీకరణల కోసం ఏమైనా వ్యూహరచన చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. 

మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు అందరిని ఆశ్చర్యపరుస్తూ చంద్రబాబును మెచ్చుకున్నారు. చంద్రబాబు జూలువిదిల్చి మోడీపై పోరాటానికి రావాలని, రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు.దాని గురించి ఈయన స్పందించినట్లు లేదు. మొత్తం మీద చూస్తే ఎపిలో అధికారం రాదేమోనన్న ఆందోళన, తెలంగాణలో కేసీఆర్ ప్రాపకం, వీలైతే కేంద్రంలో బీజేపీ అండ సాధించాలన్న తాపత్రయంలో చంద్రబాబు ఉన్నారు. బీజేపీతో కుదరకపోతే.. మళ్లీ కాంగ్రెస్ తో ఏమైనా జట్టుకడతారేమో చెప్పలేం. ఏది ఏమైనా ఆవిర్భావదినం నాడు అయినా చంద్రబాబు ఆయా విషయాలపై పార్టీపరంగా, తన పరంగా విధానాలను చెప్పి ఉంటే కార్యకర్తలకు స్పష్టత వచ్చి ఉండేదేమో!అప్పుడు పేద, మధ్య తరగతివారి  వైపు ఎవరు ఉన్నారు? ధనికుల వైపు ఎవరు ఉన్నారన్నది వారికి బాగా అర్థం అయి ఉండేది!.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌

మరిన్ని వార్తలు