మోదీకి చంద్రబాబు సరెండర్ అయిపోయినట్లేనా?

8 Aug, 2022 17:05 IST|Sakshi

తెలుగుదేశం పార్టీకాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా బిల్డప్ కాని ఇలాగ, అలాగ ఉండవు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళితే ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ ఎదురేగి తీసుకు వెళ్లారేమో అన్నంతగా ప్రచారం చేశారు. ఎంత పెద్ద పిల్లి మొగ్గ చూడండి. అసలు మోదీ పిలుపు వస్తే చాలు, ఒక్క పలకరింపే చాలు అన్న చందంగా చంద్రబాబు యాత్ర తీరు ఉంటే, దానిని అదేదో మోదీనే చంద్రబాబు కోసం తహతహలాడుతున్నారేమో అన్న భ్రమ కలిగించేలా వార్తలు రాశారు. దీనివల్ల టీడీపీకి ,చంద్రబాబుకు ఏదైనా రాజకీయ ప్రయోజనం ఉంటుందని వారు ఆశిస్తుండవచ్చు. కాని మరో సారి చంద్రబాబు పిల్లి మొగ్గను, ఆయన బలహీనతను బట్టబయలు చేసినట్లు అర్ధం చేసుకోవచ్చు. 

అజాదీకా అమృతోత్సవం కార్యక్రమం నిర్వహణలో భాగంగా కమిటీ సమావేశం జరిగింది. దీనికి దేశంలోని పలు రాజకీయ పార్టీలు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. చంద్రబాబు  కూడా వారిలో ఒకరు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ సమావేశం తర్వాత తేనేటి విందు సందర్భంగా అందరిని పలుకరిస్తుంటారు. అది సహజం. ఈసారి కూడా అలాగే జరిగింది. అందరితో పాటు చంద్రబాబును కూడా కలిశారు. అలా ఇద్దరు నేతలు పరస్పరం పలకరించుకోవడం తప్పుకాదు. ఆక్షేపణీయం కాదు. కాకపోతే అదేదో పెద్ద రాజకీయ ఈవెంట్ మాదిరి ప్రచారం చేసుకోవడంలో వారి బాధ కనిపిస్తోంది. 

2019 ఎన్నికలకు ముందు విజయవాడ విమానాశ్రయానికి వచ్చిన మోదీకి నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబునాయుడు స్వాగతం పలకకపోగా, ఆయన రాకను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగురవేశారు. చివరికి గుంటూరులో జరిగిన అధికారిక సమావేశంలో  కూడా ప్రధాని మోదీతో పాల్గొనలేదు. అక్కడితే ఆగలేదు. మోదీ వల్ల దేశం నాశనం అవుతోందని ,ఇంతటి అవినీతి ఎప్పుడూ చూడలేదని ఆరోపించేవారు. మోదీ నుంచి దేశాన్ని రక్షించడానికి తాను కంకణం కట్టుకున్నానని ఆయన అనేవారు. మోదీకి అసలు కుటుంబం ఉందా? అంటూ కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారు. తనకు కుటుంబం ఉందని, తన కుమారుడు లోకేష్, మనుమడు దేవాన్ష్లను చూసి గర్వపడుతున్నానని చెప్పేవారు. అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్.. బీజేపీకి, మోదీకి భయపడిపోతున్నారని విమర్శలు చేశారు.

విజయవాడలో జరిగిన ఒక సభలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ  ప్రధానిని ఉద్దేశించి చాలా అసహ్యకర భాషను వాడి దూషించారు. మోదీ సైతం ఎన్నికల ప్రచార సభలలో చంద్రబాబును అవినీతిపరుడిగా ప్రచారం చేశారు. పోలవరం, అమరావతి లను చంద్రబాబు ఏటిఎమ్  మాదిరి వాడుకున్నారని ద్వజమెత్తారు. 

2019 ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మొత్తం ప్లేట్ ఫిరాయించేశారు. మళ్లీ బీజేపీతో ఎలా అంటకాగాలా అన్న ఆలోచనలోకి వెళ్లారు. తనపై ఎలాంటి కేసులు రాకుండా మేనేజ్ చేసుకోవడం వరకు సఫలం అయ్యారని చాలా మంది భావిస్తుంటారు. ఆయన పిఎస్పై ఐటి  అధికారులు దాడి చేసి 2వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు సిబిటిడి ప్రకటించింది. అది జరిగి మూడేళ్లయినా, తదుపరి చర్య లేకుండా పోవడంలో చంద్రబాబు మేనేజ్ మెంట్ నైపుణ్యం ఉందని చాలామంది భావిస్తారు. అలాంటి పెద్ద విషయాన్నే మేనేజ్ చేయగల చంద్రబాబు, రాజకీయంగా బీజేపీని మేనేజ్ చేయలేరా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది. దానికి ప్రాతిపదికగా, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను బీజేపీకి దగ్గర చేయడానికి ప్లాన్ చేయడం, అది కూడా సరిపోదని భావించి ఏకంగా నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి ఉదాహరణగా నిలుస్తాయి. 

2014లో మాదిరి బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీచేయాలన్నది చంద్రబాబు మనసులో మాట. కాని బీజేపీ అదినాయకత్వం అందుకు సిద్దపడడం లేదు. టీడీపీ నుంచి తాను పంపించిన నేతలతో ఆ దిశగా బీజేపీని ఒప్పించడానికి తంటాలు పడుతున్నారు. మోదీని అంతలా దూషించిన చంద్రబాబుతో పొత్తు లేదని ఒరిజినల్ బీజేపీ నేతలు చెబుతుంటారు. ఇలాంటి తరుణంలో ఢిల్లీలో ప్రధాని ఆద్వర్యంలో జరిగిన ఈ భేటీని మహదవకాశంగా భావించారు. మోదీతో మాట కలపడానికి ఇంతకన్నా చాన్స్ ఉండదని అనుకున్నారు. అనుకున్నట్లుగానే మోదీ అందరితో పాటు చంద్రబాబును కూడా పలకరించారు. కాకపోతే పాత పరిచయం కనుక ఒకటి, రెండు నిమిషాలు ఎక్కువ ఉండవచ్చు. కాని టిడిపి మీడియాగా పేరిందిన ఈనాడు తదితర మీడియాలలో వచ్చిన వార్తలు చూస్తే , అసలు చంద్రబాబు కోసం మోదీ ఎదురు చూస్తున్నారేమో  అన్న అభిప్రాయం కలుగుతుంది. ఢిల్లీ ఎందుకు రావడంలేదని మోదీ బాధపడ్డారన్నంతగా సీన్ వండారు. అయితే చంద్రబాబు ఈసారి ప్రత్యేకంగా కలుస్తానని అంటే, మోదీ అందుకు ఒప్పుకున్నారట. అంతవరకు రాస్తే పర్వాలేదు. తప్పకుండా రండి, ఇది మీ ఇల్లు  అనుకోండి. ముందుగా మా ఆఫీస్ కు చెప్పండి అని ఆయన అన్నారట. 

విశేషం ఏమిటంటే టీడీపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదిన్నరపాటు మోదీ అప్పాయింట్ మెంటే చంద్రబాబుకు దొరకలేదు. అలాంటిది ఇప్పుడు ప్రధాని ఆఫీస్ చంద్రబాబు సొంత ఇల్లు అనుకోవాలట. ఆ రోజుల్లో టీడీపీకాని, ఆ వర్గం మీడియా కాని బీజేపీని, మోదీని ఎంతలా తిట్టేవి. ఇప్పుడు ఎలా మారిపోయాయి.? ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు, ముచ్చట్లు చెప్పుకున్నప్పుడు వార్తలు ఇవ్వడం తప్పుకాదు. నిజంగానే ప్రధాని స్తాయిలో ఉన్న నేత ఎవరైనా పిలిస్తే ఎవరూ కాదనరు. కాని తానే వస్తానని ఎందుకు అడగవలసి వచ్చింది. ఇప్పుడు మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నట్లా? బాగు చేస్తున్నట్లా? 2019ఎన్నికల తర్వాత బీజేపీని, మోదీని ఒక్క మాట అనకుండా చంద్రబాబు ఎందుకు జాగ్రత్తపడ్డారు.? మళ్లీ బీజేపీకి దగ్గరవడానికి ఎందుకు తహతహలాడుతున్నారు? అంటే కేవలం ఏపీలో అధికారం కోసమే అన్నది బహిరంగ రహస్యం. ఇందుకు మోదీ అవకాశం ఇస్తారా? అన్నది చర్చనీయాంశం. అలా జరుగుతుందని ఇప్పటికైతే అనుకోలేం. 

కాగా పనిలో పని మీడియాతో మాట్లాడుతూ స్వర్ణభుజిని తన ఖాతాలో వేసేసుకున్నారు. వాజ్ పేయికి తానే చెప్పానని కూడా క్లెయిం చేసుకున్నారు. ఒక ప్రాంతానికి సైబరాబాద్ అని పేరు పెట్టి, మొత్తం తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటున్నారు. అది జరిగి అప్పుడే ఇరవై ఏళ్లు అవుతుంటే, తన తర్వాత ఏవరు ఏమీ చేయలేదేమో అన్నంతగా బిల్డప్ ఇచ్చుకోవడం, వాటిని టిడిపి మీడియా ప్రొజెక్టు చేయడం మాత్రం నిత్యకృత్యమే. ఇక విభజిత ఏపికి ఆయన పునాది వేశారట. సీఎం జగన్ పాడుచేశారట. ఈయన కట్టిందేమిటి? ముఖ్యమంత్రి జగన్ పాడు చేసిందేమిటి? శాసనసభ ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికలలో టిడిపి ఓడిపోయినా, చంద్రబాబు మాత్రం ప్రజలలోని అన్నివర్గాలలో వైసీపీపట్ల వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేస్తుంటారు. అదే ఆయన గొప్పతనం. 

ఇంతకీ మోదీ పట్ల ప్రజలలో అనుకూలత పెరిగిందా? వ్యతిరేకత పెరిగిందా? 2019 తర్వాత ఎందుకు చంద్రబాబులో మార్పు వచ్చింది? బీజేపీ అడగకపోయినా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్దులకు ఎందుకు టీడీపీ మద్దతు ఇవ్వవలసి వచ్చింది.? ఇలాంటివాటికి బదులు ఇవ్వకుండా చంద్రబాబు జనం చెవుల్లో పూలు పెట్టడానికి యత్నిస్తున్నారన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఏతా వాతా తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని గాలికి వదలివేసి చంద్రబాబు.. ప్రధాని మోదీకి సరెండర్ అయినట్లు భావించవచ్చా!

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు