ఈ పరిస్థితి చంద్రబాబు ఊహించి ఉండరు..!

27 Sep, 2022 13:42 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడం ఎలా అన్నదానిపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మదనపడుతుండాలి. ఏకంగా తన అడ్డా అయిన కుప్పంలోనే జగన్ ఇంతలా ప్రజలను ఆకట్టుకుంటారని ఆయన ఊహించి ఉండరు. జగన్ కుప్పం పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన స్వాగతం, స్పందన చూసిన తర్వాత సహజంగానే టీడీపీ వారికి ఎవరికైనా ఒక విధమైన భయం పట్టుకుంటుంది. తమ అధినేత చంద్రబాబుకు కుప్పంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, మిగిలిన నియోజకవర్గాల మాటేమిటని వారు చర్చించుకుంటుండవచ్చు. ఇది ఒకరకంగా మైండ్ గేమ్ అని, చంద్రబాబును భయపెట్టడానికి అని కొందరు భావించవచ్చు. కాని అల్టిమేట్ గా ప్రజా స్వామ్య రాజకీయాలలో ప్రజలు ఎటువైపు ఉంటే అటే అదికారం ఉంటుంది. ఆ విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. కాకపోతే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కుప్పంపై ఇంతగా దృష్టి పెట్టలేదు. దాంతో చంద్రబాబుకు కుప్పంలో ఇబ్బంది లేకుండా పోయింది. చివరికి దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుప్పంపై ఇంతలా కేంద్రీకరించలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డికి ఆ బాద్యత అప్పగించారు. 

కాని చంద్రబాబును రాజకీయంగా నియంత్రించడం ఆయన వల్లకాలేదు. కాని చిత్రంగా ఆ తర్వాత రోజుల్లో కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆయన ప్రభుత్వాన్ని రక్షించడానికి చంద్రబాబు పరోక్ష మద్దతు ఇస్తే, ఇప్పుడు కిరణ్ సోదరుడే ఏకంగా టీడీపీలో ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం బాద్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన తన సత్తా చూపించి కుప్పంలో స్థానిక ఎన్నికలలో వైసీపీకి క్లీన్ స్వీప్ చేయించారు.

ఇందుకు జగన్ ప్రభుత్వం చేపట్టిన  వివిధ స్కీములు కూడా బాగా ఉపయోగపడ్డాయి. దాంతో పెద్దిరెడ్డికి రాజకీయం సులువు అయింది. ఒక ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి వెళ్లి ఇంత భారీ సభ పెట్టిన నేతగా కూడా ముఖ్యమంత్రి జగన్ ఒక విధంగా రికార్డు నెలకొల్పారని చెప్పాలి.  కుప్పం రాష్ట్రానికి పూర్తిగా మారుమూల ఉన్న ప్రాంతం కావడంతో ఎవరు పట్టించుకోలేదు.తాజాగా జగన్ కుప్పం సభలో మాట్లాడిన తీరు సహజంగానే అక్కడి ప్రజలను బాగా ఆకర్షించింది. జగన్ హెలికాఫ్టర్ దిగిన తర్వాత ఊళ్లోకి వచ్చే క్రమంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్ల వెంబడి ఉండి ఆహ్వానం పలికిన తీరు చూసిన తర్వాత టీడీపీ శ్రేణులకు గుండె జారీపోయి ఉంటుంది. 

జనాన్ని తరలించారని, బస్‌లలో తెచ్చారని, వేరే ప్రాంతాల నుంచి వచ్చారని , ఈనాడు తదితర టీడీపీ మీడియాలు ప్రచారం చేసినా, వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసు. అంతేకాక వచ్చిన సభికులు ఎవరూ కదలకుండా కూర్చోవడం, జగన్ స్పీచ్‌కు మంచి స్పందన వ్యక్తం చేయడం వంటివి ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది.ఇక జగన్ స్పీచ్ విషయానికి వస్తే కుప్పంలో చంద్రబాబు ఏమి అబివృద్ది చేశారని నిలదీశారు. తాను అదికారంలోకి వచ్చాక చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించి, తమ పార్టీ ఎమ్మెల్సీ భరత్‌ను వచ్చే ఎన్నికలలో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని, మరిన్ని అబివృద్ది పనులు చేపడతామని తెలిపారు. చంద్రబాబు అంతకుముందు ఎన్ని వందల కోట్ల రూపాయలు వ్యయం చేశారో కాని, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కుప్పం ప్రజలకు జరిగిన లబ్ది చూస్తే ఎవరైనా ప్లాట్ కావల్సిందే. బీసీలు అదికంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో ప్రజలకు నేరుగా డబ్బు పంపిణీ ద్వారా 866 కోట్లు, ఇతరత్రా 283 కోట్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలను టీడీపీ తోసిపుచ్చలేని పరిస్థితి . ఎందుకంటే ఇవన్ని అదికారికంగా ఉండే లెక్కలే. చంద్రబాబు టైమ్ లో ఆయన నియోజకవర్గ ప్రజలకు ఇంత బెనిఫిట్ జరిగే అవకాశం లేదు. 

ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటి స్కీములు అంటే అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన మొదలైనవాటిని అమలు చేయలేదు. జగన్ పాలనలో ఈ స్కీమ్ ల వల్ల కుప్పంలో కూడా వేలాది కుటుంబాలు లాభపడ్డాయి. దానిని వారు కాదనలేరు. అదే సమయంలో వివిధ అబివృద్ది పనులకు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కొత్తగా కుప్పం ప్రాంతంలో రోడ్లు, హంద్రీ-నీవా నీటిని కుప్పానికి ఆరు నెలల్లో తెప్పించడం, రెండు కొత్త రిజర్వాయిర్ ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కుప్పం ను ఇప్పటికే మున్సిపాల్టీ చేయడం, చంద్రబాబు విజ్ఞప్తి మేరకు జగన్ ఆర్డిఓ కార్యాలయం ఏర్పాటు చేయడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. చంద్రబాబు తాను అదికారంలో ఉండగా ఎందుకు వీటిని చేయలేకపోయారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అప్పట్లో  కొందరు ఆయన అనుచరులు బాగుపడడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న భావన ఉంది. సాద్యం కాని విమానాశ్రయం నిర్మాణం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు కాని,అది జరగలేదు. 

అంతకుముందు ఇజ్రాయిల్ టెక్నాలజీ పేరుతో వ్యవసాయంలో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించారు. కాని అది పెద్ద విఫల ప్రయోగంగా మిగిలింది. కుప్పంకు అవసరమైన సాగునీరు, తాగునీరు సదుపాయాలను చంద్రబాబు కల్పించలేకపోయారు. అంతేకాదు. అసలు కుప్పంలో చంద్రబాబు ఈ మూడున్నర దశాబ్దాల లో ఓటు కూడా నమోదు చేసుకోలేదు. సొంతంగా ఇల్లు కట్టుకోలేదు. కాని ఈ మధ్య స్థానిక ఎన్నికల పరాజయం తర్వాత ఇల్లు కట్టుకుంటానని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కాని ఇప్పటికే లేట్ అయింది.జగన్ వీటన్నిటిని గుర్తుచేసి మరీ ఎద్దేవ చేశారు. చంద్రబాబు హైదరాబాద్ లో పాలస్ నిర్మించుకుని ఉంటున్నారని, హైదరాబాద్ కు ఆయన లోకల్, కుప్పానికి నాన్ లోకల్ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద వీటికి జవాబులు లేవు. నిజానికి చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. 1983లో ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా కుప్పంకు మారి , అక్కడ నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు. 

తెలుగుదేశంపైన, ఎన్.టి.ఆర్.పైన బీసీ వర్గాలలో ఉన్న ఆదరణకు తోడు , ఆయన పెద్ద ఎత్తున తమిళనాడుకు చెందిన సరిహద్దు గ్రామాలవారితో దొంగ ఓట్లు వేయించుకునే వారన్న భావన ఉంది. మాజీ ఐఎఎస్ అదికారి , దివంగత వైసీపీ నేత చంద్రమౌళి కుప్పం స్థానికుడు.ఆయన చంద్రబాబుపై ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. తదుపరి ఆయన ఈ దొంగ ఓట్లను గుర్తించి పూర్తిగా పరిశీలన చేసి, చాలా కష్టపడి పదిహేడువేల దొంగ ఓట్లను తొలగింపచేశారు. అయినా, ఇంకా ముప్పవేల దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన అంటుండేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ ఈ దొంగ ఓట్లను తొలగించే పనిలో ఉన్నారు. ఇది చంద్రబాబుకుపెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అంతేకాక చిత్తూరు జిల్లాలో బలమైన నేతగా పేరొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ తన బలగాన్ని కేంద్రీకరిస్తున్నారు.దీంతో చంద్రబాబు కుప్పంలో వచ్చేసారి గెలుస్తారా?లేదా ? అన్న సంశయం ఏర్పడింది. దాంతో ఆయన ఇక్కడ ఈసారి పోటీచేస్తారా?లేదా?

లేక దీనితో  పాటు మరో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఇదంతా చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద సెట్ బాక్ గానే మారింది.ముఖ్యమంత్రి జగన్ ఈ నియోజకవర్గాన్ని కూడా ప్రస్టేజ్ గా తీసుకోవడంతో చంద్రబాబు ఇక్కడ ఎక్కువ గా దృష్టి పెట్టవలసి ఉంటుంది. తన రాజకీయ జీవితానికి అత్యంత కీలకం కాబోతున్న వచ్చే ఎన్నికల సమయంలో ఆయన కుప్పంలో ఎక్కువ ప్రచారం చేయవలసి వస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీపై పడుతుంది.

ఇతర ప్రాంతాలలో ప్రచారం  కష్టం అవుతుంది. ఇది ఒక కోణం అయితే, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎలాంటి పనులు చేసేవారు కారు. కర్నూలులో జరిగిన ఒక సభలో ఆయన ఈ విషయం బహిరంగంగానే చెప్పారు. పాణ్యం నుంచి వైసీపీ పక్షాన గెలిచిన ఎమ్మెల్యే ఒకరు పార్టీ పిరాయించి టీడీపీలోకి మారినప్పుడు ఆయన ఈ సంగతి చెప్పారు. కాని జగన్ మాత్రం అలాకాకుండా ప్రతిపక్ష నియోజకవర్గం అని చూడకుండా, కులం, ప్రాంతం, వర్గం వంటివాటిని చూడకుండా అందరికి తన స్కీములు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నియోజకవర్గానికే జగన్ వరాల జల్లు కురిపించారు. మరి వేరే పార్టీవారికి ఏమీ చేయనని చెప్పిన చంద్రబాబు గొప్పవారు అవుతారా? ప్రతిపక్షనేత అయినా తాను అన్ని పనులు చేస్తానని చెప్పిన జగన్ గొప్పవారు అవుతారా..


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు