TS: బీజేపీ ఇంతగా ఎలా పుంజుకుందనేదే ప్రశ్న?

15 Jul, 2022 17:46 IST|Sakshi

తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు వస్తాయా? రావా?, తెలంగాణలో రాజకీయ వాతావరణంపై జరుగుతున్నా సర్వేలు కూడా ఉత్కంఠ కలిగిస్తున్నాయి.తాజాగా వచ్చిన సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌ కొంత లీడ్‌లో ఉన్నప్పటికీ, బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంటున్నట్లు వచ్చిన వివరాలు కాస్త సంచలనంగానే ఉన్నాయి. తాజాగా వచ్చిన ఆరా మస్తాన్ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌‌కు 39 శాతం , బీజేపీకి 30 శాతం, కాంగ్రెస్‌కు 23 శాతం ఓట్లు వస్తాయన్న అంచనా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో బాగా బలహీనంగా ఉందని భావిస్తున్న బీజేపీ ఇంతగా ఎలా పుంజుకుందన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. 

అదే సమయంలో కాంగ్రెస్ బాగా వెనుకబడి ఉన్నట్లు సర్వే చెప్పడం ఆ పార్టీకి తీవ్ర నిరుత్సాహం కలిగించే అంశమే అవుతుంది.గత లోక్ సభ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ను ఉత్తర తెలంగాణలో బీజేపీ దెబ్బకొట్టింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఆ ప్రాంతంలో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఖమ్మం,వరంగల్ నల్గొండ జిల్లాలలోనే కాంగ్రెస్ మెరుగ్గా ఉంది. కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ కు షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్‌టీపీ నష్టం చేయవచ్చు. అలాగే ప్రవీణ్ కుమార్ ఆద్వర్యంలోని బిఎస్పి కొన్ని జిల్లాలలో టీఆర్‌ఎస్‌ కు నష్టం కలిగించవచ్చు.   ఈ సందర్భంగా ఒకటి మాత్రం చెప్పక తప్పదు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఏ ర్పడింది. ఎందుకంటే ఇంకా ఏడాదిన్నర సమయం ఎన్నికలకు ఉన్నందున, బీజేపీ రకరకాల వ్యూహాలు అమలు చేసి, తన ఓట్ల శాతం మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు ప్రస్తావన చేయడం కూడా సంచలనమే అయింది.    

ఆయన నిజంగానే ముందస్తుకు వెళ్లే ఉద్దేశంతో ఈ మాట అన్నారో లేదో కాని, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆ సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించాయి.  కేసీఆర్‌ రెండు గంటలకు పైగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో  అనేక అంశాలను ప్రస్తావించారు. వాటిలో అసెంబ్లీ రద్దు సవాల్ కూడా ఒకటి. నిజానికి ప్రతిపక్ష కాంగ్రెస్, లేదా బీజేపీ ఏదో మాట వరసకు అలాంటి డిమాండ్ చేస్తుంటాయే కాని, అసెంబ్లీ రద్దు అవుతుందని వారెవ్వరూ ఇప్పటికైతే అనుకోవడం లేదు. నిజానికి కేసీఆర్‌ అసలు దీని గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు. 

దీనిపై మాట్లాడిన తీరులో కొంత కన్ప్యూజన్ కూడా ఉంది. ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎన్నికల తేదీని ఖరారు చేస్తే అసెంబ్లీ రద్దుకు సిద్దం అని అన్నారు.ప్రతిపక్షాలు డేట్ ఖరారు చేయడం ఏమిటో అర్ధం క ఆదు.  ఆ తర్వాత రోజు టీఆర్‌ఎస్‌ మంత్రులు మాట్లాడుతూ బీజేపీ లోక్ సభ ను రద్దు చేస్తే, కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేస్తారని చాలెంజ్ విసిరారు. కేసీఆర్‌ మొదట లోక్ సభ రద్దుకు , అసెంబ్లీ రద్దుకు లింక్ పెట్టినట్లు అనిపించలేదు. కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు అనగానే  బీజేపీ నేతలు ఎన్నికలకు సిద్దమని అంటే, కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి  దీనిపై స్పందిస్తూ కేసీఆర్‌ కు నిబద్దత ఉంటే నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేయాలని అన్నారు. 

అవేమీ ఎటూ జరగవన్న సంగతి ప్రస్తుతానికి  అందరికి తెలుసు.కాకపోతే కేసీఆర్‌ వ్యూహాత్మకంగా దీనిని ప్రస్తావించడం ద్వారా రాజకీయ పక్షాల మూడ్  కాని, ప్రజల మూడ్ కాని కొంత మార్చడానికి ముందస్తు ఎన్నికల గురించి అన్నారా అన్న చర్చ వస్తుంది.లేదా బీజేపీ మరీ ఎదిగే లోపల ఎన్నికలు నిర్వహించి విజయతీరాలకు ఇబ్బంది లేకుండా చేరాలని అనుకుంటున్నారా అన్న భావన కూడా ఏర్పడుతుంది.దానికి తగినట్లుగానే సర్వేల అంచనాలు ఉండడం గమనార్హం.  గత టరమ్ లో కేసీఆర్‌ ఆరు నెలలు ముందుగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత ఘన విజయం సాధించారు. బహుశా ఆ సెంటిమెంట్ ను మళ్లీ ప్రయోగించడానికి కేసీఆర్‌ ఆలోచిస్తున్నారా అన్న సంశయం వస్తుంది. ఇప్పటికే ఆయా మీడియాలలో  కేసీఆర్‌ వచ్చే ఏడాది మార్చిలో కర్నాటక శాసనసభ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలకు కూడా సిద్దం అవుతారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తూ కధనాలు వచ్చాయి.

ఇందుకు ప్రాతిపదికగా వచ్చే దసరా నాటికి సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంబించాలని కేసీఆర్‌ భావిస్తున్నారట. అలాగే ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం, యాదాద్రి ఆలయ అభివృద్ది వంటి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరో వైపు పెండింగ్ లో ఉన్న రైతు బంధు నిధులను విడుదల చేశారు. కేంద్రంతో సత్సంబందాలు దెబ్బతిన్న నేపద్యంలో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే బీజేపీ ఆద్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మరింత ఇబ్బంది పెడితే , ప్రజలలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందా అన్న డౌటుతోనే ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చు. 

అంతేకాక గత ఎన్నికలలో బీజేపీ ఈ స్థాయిలో ఎన్నికల గోదాలో దిగలేదు. బీజేపీ అదిష్టానం తెలంగాణ రాజకీయాలను సీరియస్ గా తీసుకుంది. ప్రదాని మోడీని కేసీఆర్‌ తీవ్ర స్తాయిలో విమర్శిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రయత్నాలు సాగిస్తున్నారు. జాతీయ స్తాయిలో మోడీపై కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని మోడీ నాశనం చేస్తున్నారని, ఇంత అసమర్ద ప్రధాని మరొకరు లేరని కేసీఆర్‌ ద్వజమెత్తుతున్నారు. ఇవన్ని బీజేపీకి సహజంగానే చికాకు తెప్పిస్తాయి. తెలంగాణలో బీజేపీ ఎదిగితే కాంగ్రెస్ నష్టపోతుందని ,తద్వారా టీఆర్‌ఎస్‌ విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని కేసీఆర్‌ భావిస్తుండవచ్చు.ఇటీవలి కాలంలో జరిగిన వివిధ సర్వేలలో టీఆర్‌ఎస్‌ ముందంజలోనే ఉన్నా, పూర్తి మెజార్టీకి కొంత తగ్గవచ్చని తెలస్తోందని కదనాలు వస్తున్నాయి. ఇప్పటికైతే టీఆర్‌ఎస్‌ కు నలభైఐదు నుంచి ఏబై సీట్ల వరకు రావచ్చని, కాంగ్రెస్ కు ముప్పై సీట్లు, బీజేపీకి పది పైగా సీట్లు రావచ్చని ఒక సర్వే అంచనా వేసింది.

ఆరా మస్తాన్ సర్వే లో టీఆర్‌ఎస్‌ తర్వాత స్థానం బీజేపీకి దక్కింది. టీఆర్‌ఎస్‌  తన పరిస్థితిని మెరుగుపరచుకుంటే  మెరుగుపడితే బొటాబొటి మెజార్టీతో  బయటపడవచ్చు. లేకుంటే తెలంగాణలో హంగ్ రావచ్చన్నది ఒక అంచనాగా ఉంది. దీనికి కారణం తొమ్మిదేళ్లుగా టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో సహజంగా వచ్చే వ్యతిరేకత కావచ్చు. ముఖ్యంగా పల్లెల్లో ప్రభుత్వంపై అసంతృఫ్తి ఉందని అంటున్నారు. దనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నా ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం కష్టంగా ఉంటోంది. ఆర్బిఐ ద్వారా అప్పులు సేకరించడంలో కూడా ప్రభుత్వం అవస్థలు పడుతోంది. అందువల్ల ఈ పరిణామాలు టీఆర్‌ఎస్‌ కు చికాకు కలిగించే దశ రావడానికి ముందే  ఎన్నికలకు వెళితే బాగుంటుందన్నది ఒక అబిప్రాయం కావచ్చు. కాగా టిఆర్ ఎస్ నుంచి కొంతమంది ప్రముఖులను ఆకర్షించడానికి బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ పడుతున్నాయి. అందువల్లే కేసీఆర్‌ ఎవరైనా కొద్ది మంది పార్టీ వదలివెళ్లినా సమస్యే కాదని అన్నారు. అయినా కేసీఆర్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. 

టీఆర్‌ఎస్‌ లో అక్కడక్కడా అసంతృప్తి ఉన్నట్లయితే, దానిని విపక్షాలు అడ్వాంటేజ్ గా మార్చుకోకుడా ఉండడానికి గాను వారికి తగు సమయం ఇవ్వకూడదని బావిస్తుండవచ్చు. ఎన్నికలు ముందుకు వచ్చినా, రాకపోయినా, కాంగ్రెస్,బీజేపీల దృష్టిని అటు వైపు మళ్లిస్తే, రాష్ట్రానికి సంబందించిన సమస్యలపై కన్నా, తమ అంతర్గత రాజకీయాలకు విపక్షాలు ప్రాదాన్యం ఇవ్వవలసిన పరిస్తితి ఏర్పడుతుంది. అలా అని అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లరని కాని, లేదా వెళతారని కాని చెప్పజాలం. ఇందుకు మరింత సమయం అవసరం అవుతుంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్‌ వ్యాఖ్యలు ఒక షాక్ లేదా ఒక టానిక్ గా ఉపయోగపడతాయి. వారు తమ నియోజకవర్గాలలో పటిష్టమవడానికి కృషి చేయవచ్చు. నిజానికి కేసీఆర్‌   ఇప్పటికైతే ఎన్నికల మూడ్ కు వచ్చి ఉండకపోవచ్చు. అలాగని ఎన్నికలపై  దృష్టి పెట్టలేదని కాదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీమ్ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. పార్టీలో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు? మొదలైన అంశాలపై ఆలోచన సాగిస్తున్నారని వార్తలు వచ్చాయి. 

అయితే కేసీఆర్‌ చేసిన ప్రకటన కేవలం రాజకీయంగానే చూడాలి తప్ప ,కచ్చితమైన నిర్ణయంగా కాకపోవచ్చనిపిస్తుంది. నిజంగానే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారా అంటే , మరో నాలుగైదు,నెలల తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడినదానికి, ఆ తర్వాత రోజు మంత్రులు మాట్లాడినదానికి ఉన్న తేడాను పరిగణనలోకి తీసుకుంటే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లరన్న భావన కలుగుతుంది. నిజంగానే అసెంబ్లీని రద్దు చేయాలని అనుకుంటే లోక్ సభను రద్దు చేయాలని టిఆర్ఆర్ ఎస్  కండిషన్ పెట్టేది కాదు. 

ఒకవేళ ఆరు నెలలు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళితే, రెండు టరమ్‌లలో కలిసి ఏడాది కాలాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వదలుకున్నట్లవుతుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. తీరా మంత్రివర్గం అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఎక్కువకాలం గవర్నర్ పెండింగ్‌లో పెడితే ఒక రకమైన అనిశ్చతి  ఏర్పడుతుంది. అలాగే  వెంటనే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించకపోయినా సమస్యే అవుతుంది.

2003లో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీని రద్దు చేసినా, సకాలంలో ఎన్నికలు జరగలేదు. ఓటర్ల జాబితా సవరణ తదితర కారణాలతో దాదాపు పది నెలలు ఎన్నికలు జరగలేదు ఎన్నికల సంఘం ఇప్పుడు కూడా అలా జాప్యం చేస్తే టీఆర్‌ఎస్‌ పార్టీకి తలనొప్పి గా మారవచ్చు. గతంలో ముందుగానే కేంద్రంతో కేసీఆర్‌ మాట్లాడుకుని అసెంబ్లీని రద్దు చేశారు. ఈసారి అలాంటి సహకారం ఉండదు.  అసెంబ్లీ రద్దు కన్నా, ప్రభుత్వపరంగా లోటుపాట్లను సరిచేసుకుని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే ఎన్నికలకు సిద్దం అయితే బెటర్‌గా ఉండవచ్చు. ఇవన్ని వారి వ్యూహకర్తలు నిర్వహించే సర్వేలు, ఇతర అంశాలపై ఆధారపడి ఉండవచ్చు.

-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు