ఏపీకి పెట్టుబడులు రావడం పవన్‌కు ఇష్టం లేనట్లే ఉంది!

1 Sep, 2022 16:06 IST|Sakshi
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( ఫైల్‌ ఫోటో )

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారన్న విషయాన్ని చర్చించలేము కాని, ఆయన ఆంద్రప్రదేశ్ పై మాత్రం పగపట్టినట్లు మాట్లాడుతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రత్యేకించి తాను ఓడిపోయిన విశాఖపై ఆయన ద్వేషం అనే విషాన్ని చిమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ బీచ్ లను పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టడమే కాక, రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్దాల నివారణ నిమిత్తం పార్లె సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీనివల్ల వచ్చే సంవత్సరాలలో సుమారు 16 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

విశాఖలో వేలాది పౌరులు, అధికారులు, విద్యార్దులు అంతా కలిసి బీచ్ లలో ఉన్న 72 టన్నుల ప్లాస్టిక్, ఇతర వ్యర్దాలను తొలగించారు. ఇందుకు ఎవరైనా సంతోషపడాలి. కాని పవన్ కళ్యాణ్ మాత్రం బాధ పడుతున్నట్లుగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ తో జగన్ ప్రజలను ఆకట్టుకుంటున్నారేమోనన్న దుగ్ద ఏర్పడినట్లు ఉంది. అంతే. వెంటనే ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశంను మించి పిచ్చి ఆరోపణలు, మోకాలికి, బోడిగుండుకు లింకు పెడుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేశారు. రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఒక్కసారిగా పర్యావరణంపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని  ప్రశ్నించారు. 

అంటే దీని అర్దం విశాఖ బీచ్లను క్లీన్ చేస్తారా , ప్రజలకు సదుపాయం కల్పిస్తారా అన్నట్లుగా ఉంది తప్ప, ఇంకేమైనా అర్దం ఉందా? పర్యావరణ సమస్యలు నిరంతరం ఉండేవి. అవి దేశ వ్యాప్త అంశాలు. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవి ఉంటాయి. తెలుగుదేశం హయాలో పర్యావరణం అంతా సజావుగా సాగిపోయినట్లు, ఇప్పుడు ఏదో పాడైపోయినట్లు ఆయన స్టేట్ మెంట్లు ఉన్నాయి. ఇంత పర్యావరణ ప్రేమికుడు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడైనా మాట్లాడారా? విశాఖ బీచ్ లో ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టాలని చంద్రబాబును ఏనాడైనా కోరారా? విశాఖలో పారిశ్రామిక కాలుష్యం, గ్యాస్ లీకేజీ వంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం లేదట. 

నిజమే..ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకు రావడం తప్పు కాదు. కాని ప్రభుత్వం ఏమి చేసినా, చెవుల్లో సీసం పోసుకున్న చందంగా, కళ్లు మూసుకున్న విధంగా ప్రకటనలు ఇవ్వడమే ఆయనలో అపరిపక్వతను తెలియచేస్తుంది. ప్రభుత్వంపై అక్కసుతో మాట్లాడడమే తప్పు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పర్యావరణహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తామని స్పష్టంగా చెప్పారు. అలా చెప్పిన ముఖ్యమంత్రి ఈయన ఒక్కరే. ఆ విషయం పవన్ కు తెలియకపోవచ్చు. అసలు కోపం ఏమిటంటే జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు రావడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. 

దానివల్ల ప్రభుత్వం మరింత ఆదరణ పొందుతుందన్నది వారి బాధ. పరిశ్రమలు రాకపోతే, రాలేదని అనవచ్చు. ఏదైనా పరిశ్రమ తన సొంత కారణాలతో మూతపడితే, ఆ బాధ్యత అంతా జగన్ ప్రభుత్వంపై తోసి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేయవచ్చు. అందుకు భిన్నంగా భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తుంటే, అప్పుడు కాలుష్యం అంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు ఉద్దేశం అర్దం అవుతూనే ఉంది  కదా? ఇటీవలే అనకాపల్లి జిల్లాలో ఒక భారీ పరిశ్రమతో పాటు ఆరు మద్యతరహా పరిశ్రమలకు జగన్ శ్రీకారం చుట్టారు. వచ్చే నెలలో విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపన ఉంటుందని ప్రకటించారు. 

మరో వైపు గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఓడరేవులు వంటి వాటికి జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఇవన్ని తెలుగుదేశం నేతలతో పాటు, పవన్ కళ్యాణ్ వంటివారికి కూడా మింగుడుపడని విషయాలే. అందుకే ప్రతి దానిని తప్పుపడుతూ ఏదో రకంగా జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికి పూనుకుంటున్నారు. రాష్ట్రంలో కాలుష్య పరిశ్రమల గురించి కార్యకర్తలు వివరాలు సేకరించి ప్రచారం చేయాలట. రాజకీయాలలో విమర్శలు చేయడం తప్పుకాదు. కాని పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రమన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రతిదానిపై విషం చిమ్మితే అది ఆయనకే నష్టం అన్న సంగతి తెలుసుకోవాలి. ఆ సంగతి తెలిసినా, తనకు ఇంతకన్నా పోయేదేముందిలే అని టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా మాదిరి అన్ని వదలిస్తే ఎవరు మాత్రం ఏమి చేస్తారు?

మరో విషయం ఏపీలో  పోలీస్ మార్కు అరాచకం అంటూ ఈనాడు పత్రిక మరోసారి విషం వెళ్లగక్కింది. ఉన్నవి, లేనివి అన్నీ కలిపి వండి వార్చి పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. సోషల్ మీడియాలో కొందరు టిడిపి కార్యకర్తలు మరీ అరాచకంగా బూతులతో పోస్టింగ్ లు పెడుతుంటే ,అవి ఈనాడుకు ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్ లుగా కనిపిస్తున్నాయి. వైసిపి వారు ఎవరైనా అలా చేసినా తప్పే . వైసిపివారు ఎవరైనా చేస్తే ఇదే ఈనాడు ఎంత ఘోరంగా వార్తలు ఇచ్చింది గుర్తు చేసుకోండి. కాని అదే టీడీపీ సోషల్ మీడియావారు దారుణమైన వక్రీకరణలు, బూతులు, ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఎంత నీచమైన అనుచిత వ్యాఖ్యలు చేసినా, వారి జోలికి ప్రభుత్వం వెళ్లకూడదట. అలా వెళితే అరాచకమట. టీడీపీ సోషల్ మీడియా అరాచకాన్ని అడ్డుకోగూడదట.

ఈనాడు వంటి మీడియా సంస్థలు అడ్డగోలుగా ఇలాంటి నీచ సంస్కృతిని ప్రోత్సహించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.  న్యాయ వ్యవస్థ ద్వారా ఎలాగైనా బెయిల్ పొందగలమన్న ఏకైక ధైర్యంతో టిడిపి సోషల్ మీడియాలోని కొందరు  ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు.ఎపిలో తప్ప, మిగిలిన ఏ రాష్ట్రంలోను ఇంత నీచంగా పోస్టింగ్ లు పెట్టినవారికి బెయిళ్లు రావడం లేదన్న అభిప్రాయం ఉంది. ప్రదానితో సహా, ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నవారు జైళ్లకు వెళుతున్న ఘట్టాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాని ఎపిలో మాత్రం అది పోలీసుల వైఫల్యమో , లేక న్యాయ వ్యవస్థలోని లోపమో తెలియదు కాని, అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి సోషల్ మీడియా వారు వెంటనే బెయిల్ పొంది ,స్వేచ్చగా తిరుగుతున్నారన్న భావన ఉంది. న్యాయ వ్యవస్థలోని వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సీరియస్ అయ్యే ఆ వ్యవస్థ, ప్రభుత్వంపై, సి.ఎమ్.పై చేస్తే ఎందుకు విభిన్నంగా చూస్తుందన్న అభిప్రాయం ప్రజలలో ప్రబలడం మంచిదికాదు. ఎవరు ఎవరిపై తప్పుడు  వ్యాఖ్యలు చేసినా సహించరాదు. ఇలాంటి వాటిలో వివక్షతో వ్యవహరిస్తే ఆ వ్యవస్థలకే కాకుండా, మొత్తం సమాజానికి చేటు తెస్తుందని చెప్పకతప్పదు.


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు