ఈ మూడేళ్లలో ఎన్నడైనా ఆ విషయాలను పవన్ చెప్పారా?

26 Sep, 2022 16:19 IST|Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ జోస్యాలు కూడా చెబుతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికలలో వైసీపీకి 45 నుంచి అరవైఏడు స్థానాలు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. ఆయన ఏ సర్వే ఆధారంగా ఈ విషయం చెబుతున్నారో తెలియదు.కాని పవన్ జోస్యానికి మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని ఇచ్చిన కౌంటర్ మాత్రం పేలింది. వైసీపీకి ఎన్నిసీట్లు వస్తాయో చిలక జోస్యం చెబుతున్న పవన్ ,ముందుగా తన జనసేన ఎన్నిసీట్లలో పోటీచేస్తున్నది జోస్యం చెప్పాలని నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే సీట్లే తీసుకుంటారా?అంటూ ప్రశ్నించారు.నిజంగానే పవన్ కళ్యాణ్ రాజకీయం పైన పటారం, లోన లొటారం అన్న సామెతను గుర్తు చేసేలా ఉంటోంది. తాను జనసేన పార్టీ పెట్టిన ఎనిమిదేళ్లకు కూడా అసలు ఎన్ని నియోజకవర్గాలలో పార్టీ కమిటీలు ఉన్నది ఆయనకే తెలియకపోవచ్చు. ఎన్ని నియోజకవర్గాలలో పోటీచేసే సత్తా ఉందన్న అంచనా అసలు లేకపోవచ్చు. తడవకో మాట చెబుతుంటారు. దసరా నుంచి పాదయాత్ర అని చెప్పారు. 

కాని ఇప్పుడు పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టినందున పాదయాత్రను వాయిదా వేసుకుంటున్నారట. ఏమైనా అర్ధం ఉందా? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్నట్లుగా లేదూ!జనంలో తిరిగితే కదా ఆయనకు తన బలం ఏమిటో తెలిసేది. ఆయా వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడితే కదా.. ప్రభుత్వ పనితీరు, తన పార్టీ ఫెరఫార్మెన్స్ గురించి ఒక అభిప్రాయానికి రాగలిగేది.2014లో వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. అదే అంకెను ఇప్పుడు పవన్ చెబుతున్నట్లుగా ఉంది. గత ఎన్నికలలో 151 సీట్లు సాధించిన వైసీపీ తిరిగి అదికారంలోకి వస్తుందని జాతీయ టీవీ చానళ్ల సర్వేలు చెబుతుంటే,పవన్ సర్వే మాత్రం భిన్నంగా ఉందట. ఆయన సర్వేని ఎవరైనా నమ్ముతారా? పోనీ వైసీపీకి ఎన్ని వస్తాయో చెప్పిన ఆయన జనసేనకు ఎన్ని వస్తాయి? ప్రతిపక్షంగా ఉన్న టిడిపికి ఎన్ని వస్తాయో ఎందుకు చెప్పలేకపోయారు?ఎవరు అదికారంలోకి వస్తారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయాలు ఎందుకు చెప్పలేకపోయారు.

వీకెండ్ విజిటర్‌గా మారి, కేవలం సెలవు రోజుల్లోనే ఏపీకి వెళ్లి రాజకీయాలు చేస్తున్నట్లు కనిపించే... కాదు.. రాజకీయాలు మాట్లాడే నేత బహుశా ఈయన ఒక్కరే కావచ్చు. కాకపోతే సినీ నటుడు కనుక కొంతమంది అభిమానులు సినీ క్రేజ్‌తో తన చుట్టూ చేరి నినాదాలు ఇస్తే అదే తన బలం అని పొంగిపోతే ఎవరు ఏమి చేయగలరు. గతంలో వారిపైనే నమ్మకం పెట్టుకుని రెండు నియోజకవర్గాలలో పోటీచేసి పరాజయానికి గురైన ఈయన ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అసెంబ్లీలో జనసేన ఉంటే ఏమిటో చేసి చూపించేవారట. మరో సందర్భంలో తాను అదికారం కోసం రాలేదని అంటారు.  ప్రజల సమస్యలపై ఆయనకు స్పష్టమైన అవగాహనే లేదు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు.కానీ అవి అర్దవంతంగా లేకపోతే ఎవరు మాత్రం వాటిని రిసీవ్ చేసుకుంటారు. 

ఏదో నాలుగు సినిమా డైలాగులు చెప్పినట్లు ప్రసంగం చేస్తే, ఆ కాసేపు అభిమానులు చప్పట్లు కొట్టవచ్చు.కాని జనం మాత్రం సీరియస్ గా తీసుకోరన్న సంగతి ఆయనకు ఇప్పటికీ అర్దం కాకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు ఎలా ఉంటుంది?ఏదైనా పార్టీతో పొత్తును ఆశించదలిచినా, ముందుగా తనకు బలం ఉందని రుజువు చేసుకోవాలి. అలాకాకపోతే పొత్తులో ఉండే పార్టీ దయతో ఇచ్చిన సీట్లకే పరిమితం అయితే అదే రాజకీయం అవుతుందా? కులం గురించి రకరకాల మాటలు మాట్లాడుతూ, చివరికి అదే కులంపైన ఆధారపడి రాజకీయం చేయవలసిన పరిస్థితి ఏర్పడడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పట్టదా?ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించడంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. సరే..మంచిదే..మరి తన సంగతేమిటి? ఏ ఊరు వెళితే ఆ ఊరునే రాజధానిగా చూసిన ఆయన , అసలు అమరావతి కేవలం ఒక పార్టీకి, ఒక కులానికే పరిమితంగా ఉందని చెప్పిన ఆయన ఇప్పుడు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం, లక్షల కోట్లు అక్కడే పెట్టాలని డిమాండ్ చేయడాన్ని ఏమని అంటాం.

రాష్ట్రం రాజధాని లేనిదైందని ఆయన అంటున్నారు. ఈ మధ్య ఇదో ఫాషన్ అయింది. అంటే ప్రస్తుతం ఉన్న అమరావతిని రాజధాని అని పవన్ కళ్యాణ్ కాని, అలా మాట్లాడేవారు కాని ఒప్పుకోవడం లేదా? ఒకవేళ విశాఖకు కార్యనిర్వాహక రాజధాని వస్తే, దానిని కూడా రాజధాని అని ఘనంగా చెప్పుకోవచ్చుకదా? దేశపటంలో లేదా,ప్రపంచ పటంలో విశాఖ రాజధాని అంటే ఎక్కువ గౌరవం వస్తుందా? లేక నాలుగు పల్లెటూళ్లు ఉన్న అమరావతి రాజధాని అంటే గౌరవం వస్తుందా? ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఏమి చెబుతాం.అసెంబ్లీలో జనసేన జెండా రెపరెపలాడాలనే లక్ష్యంతో ముందుకువెళుతున్నామని ఆయన చెప్పారు. తప్పు లేదు. కాకపోతే అందుకు ఆయన అనుసరిస్తున్న పద్దతే ఎవరికి అర్దం కావడం లేదు. ఎంతసేపు ప్రతిపక్ష టిడిపి బాటలోనే నడవాలని తాపత్రయపడడం, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడడం, తనకంటూ ప్రత్యేక ఎజెండా లేకపోవడం, ఎన్నిసీట్లలో పోటీచేయాలో తెలియని అయోమయ స్థితి ఉండడం వంటివి చూశాక ఆ పార్టీ బలోపేతం అవుతుందని ఎవరూ విశ్వసించడం లేదు. మరో సంగతి చెప్పారు.

జగన్ కు ,ఆయన సోదరికి ఆస్తి తగాదాలు ఉంటే ఇద్దరూ పరిష్కరించుకుంటారు. రాష్ట్ర ఆస్తులపైనా శ్రద్ద చూపాలి కదా? అని ఆయన అంటున్నారు. కప్పు కాఫీకో, పెసరట్టు ముక్కకో రాష్ట్ర ఆస్తులను తెలంగాణకు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తులను దారాదత్తం చేశారట. పవన్ ఈ విషయంలో ఎవరిని ప్రశ్నించాలి?ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఓటుకు నోటు కేసు కారణంగా వదలుకుని, రాత్రికి రాత్రి పలాయనం చిత్తగించి విజయవాడ వెళ్లిపోయిన చంద్రబాబును అంటారా? లేక ఆస్తుల విభజన చేయాలని పదే,పదే కేంద్రాన్ని కోరుతున్న జగన్ ను అంటారా? చంద్రబాబు ఈ పదేళ్లు ఇక్కడ ఉంటామని ఉద్దేశంతోనే కదా?కోట్ల రూపాయలు వ్యయం చేసి హైదరాబాద్ లో ప్రభుత్వ భవనాలకు రిపేర్లు చేయించారు. 

ఆ తర్వాత వాటినన్నిటిని పాడుపెట్టింది ఎవరు? చంద్రబాబే కనుక ఉమ్మడి రాజధానిని కొనసాగించి ఉంటే, ఇప్పుడు తమ ఆస్తుల పంపిణీ పూర్తి అయ్యేవరకు ఉమ్మడి రాజధాని గా తమ హక్కు వదలుకోబోమని చెప్పే అవకాశం ఉండేది కదా? అలాగే తన మిత్రపక్షమైన బిజెపిని కదా ఆయన ప్రశ్నించాలి. రెండు రాష్ట్రాల మద్య ఆస్తుల విభజనను కేంద్రం ఎందుకు చేయలేకపోతోందని అడగాలి కదా? అది చేతకాని పవన్ ముఖ్యమంత్రి జగన్ పై నెపం నెడుతున్నారు. జగన్ కృషి వల్లే కదా, తెలంగాణ ప్రభుత్వం చెల్లించవలసిన ఆరువేల కోట్ల కరెంటు బకాయిలను ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్రానికి కేంద్రంఆదేశాలు ఇచ్చింది.దీనిని కాదనగలరా?ఎన్నికలు సక్రమంగా నిర్వహించపోతే అధికారులతో గొడవ పడతారట. అవసరమైతే మిలిటెంట్ పోరాటాలు చేస్తారట. ఎందుకు ఈ డాంబిక వ్యాఖ్యాలు. జనసేన బాగా బలం పుంజుకుంటోందని చెప్పే పవన్ ,ఎన్నికలు సరిగా జరగవని అంటున్నారంటే..తన గెలుపుపై తనకే అనుమానం ఉందని అనుకోవాలి. 

దోపిడీలు, దొమ్మీలు చేసేవారిని ఎన్నుకుంటే ఎలా అని అంటున్నారు. నిజమే అలాంటివారిని ఎవరూ ఎన్నుకోకూడదు. కాని తన పుట్టిన రోజున అభిమానుల పేరుతో ఏపీలో సినిమా ధియేటర్లపై పడి విధ్వంసం సృష్టించిన జనసేన కార్యకర్తలు ఏ కోవలోకి వస్తారో పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా..ముందుగా ఆ విధ్వంసాన్ని ఖండించాలి కదా?పైకి కబుర్లు ఒకటి, చేసేది ఒకటి అంటే ఇదే.ఓడిపోయిన తర్వాత పార్టీని వదిలివేస్తారని ఎవరో అనుకున్నారట. తాను వదలబోనని చెబుతున్నారు. తప్పకుండా రాజకీయాలలో ఉండాల్సిందే.కాకపోతే తనకంటూ ఒక ఎజెండా ఉండాలి. తనకంటూ ఒక సిద్దాంతం ఉండాలి. తాను అదికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు సేవ చేసేదానిపై అవగాహన ఉండాలి.  ఆ విషయాలను ప్రజలకు చెప్పగలగాలి. ఈ మూడేళ్లలో ఎన్నడైనా ఆ విషయాలను పవన్ చెప్పారా? జగన్ అమలు చేస్తున్న స్కీములపై విశ్లేషణ చేశారా? ఎంతసేపు ద్వేషాన్ని వెళ్లగక్కడం తప్ప? దానివల్ల ఏమి ప్రయోజనం వస్తుంది. కాకపోతే వీకెండ్ వచ్చి కాలక్షేపం చేయడానికి ఉపయోగపడవచ్చు. అంబేద్కర్‌ను స్పూర్తిగా తీసుకున్న వ్యక్తిని అని చెప్పినంత మాత్రాన పవన్ గొప్పవారైపోరు. ఆయన మాదిరి స్వతంత్రంగా ఆలోచించే పరిస్థితి రావాలి? ప్రజల జీవితాలలో మార్పు రావడానికి ఏమి చేయాలో చెప్పగలగాలి. అలా చేయగలిగే వ్యక్తినా ఈయన? ఎంతసేపు టిడిపితో కలుస్తా,బిజెపి, టిడిపిలతో కలుస్తా...ఓట్లు చీలనివ్వను..అంటూ అవకాశవాద రాజకీయాలు చేస్తే అంబేద్కర్ అయిపోతారా?


-కొమ్మినేని శ్రీనివాసరావు, 
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు