రాష్ట్రపతి ఎన్నిక; టీడీపీ డబుల్‌ గేమ్‌

23 Jul, 2022 12:45 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్‌డీఏ అభ్యర్ది ద్రౌపదీ ముర్ముకి మద్దతు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో తన స్నేహ సంబంధాలను మరోసారి ఉద్ఘాటించింది. మొత్తం 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు విజయవంతంగా ఓటు వేశారు. ముర్ముకు మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్, వామపక్షాలు విమర్శలు చేయవచ్చు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా బీజేపీతో అంటకాగాలని ప్రయత్నిస్తున్న తరుణంలో స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్ వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఈ అంశంపై చర్చించి మద్దతు కోరడం వారికి జీర్ణం కాని విషయమే. 

ఈ అంశంలో కూడా టీడీపీ డబుల్ గేమ్ ఆడిందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్దికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదాతో ముడిపెట్టాలని కొద్ది కాలం క్రితం డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం కూడా చేశారు. అయినా రాజకీయ పరిస్థితులు, వివిధ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కారణం ఏమైనా ఇటీవలి కాలంలో బీజేపీని వ్యతిరేకిస్తూ, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలు రెండూ ఈ విడత రెండు దారులు కావడం గమనించదగ్గ పరిస్థితే. దీని ప్రభావం మున్ముందు రెండు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నదానిపై ఊహాగానాలు చేయవచ్చు. అయితే వైసీపీ.. ఎన్డీఏలో భాగస్వామి కాదు. 

కానీ గిరిజన అభ్యర్ధిని నిలబెట్టిన ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిశ్చయించుకుంది. విశేషం ఏమిటంటే ఒకప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఈసారి ఎవరూ అడగకుండానే ద్రౌపదీ ముర్ముకి మద్దతు ఇవ్వడం. అంతేకాక శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని తీవ్రంగా దూషిస్తూ సభలలో ప్రసంగించిన చంద్రబాబు ఓటమి తర్వాత యుటర్న్ తీసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్ ను కలిసి హడావుడి చేసిన ఆయన వారందరిని వదలివేసి తనదైన రాజకీయం కొనసాగించారు. 

కాకపోతే ఈసారి బీజేపీ వారు కనీసం అడగకపోవడం ఒక అవమానం అయితే, ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్‌ స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పోన్ చేసి, తమను కూడా ముర్ముని కలవడానికి పిలవాలని అభ్యర్ధించారన్న వార్త మరింత పరువు తక్కువగా ఉంది.

మరోవైపు బీజేపీలో ఒక చోటా నాయకుడు అసలు వైసీపీ తమ పార్టీ మద్దతు అడగలేదంటూ అవాకులు, చవాకులు పేలితే దానిని మహదవకాశంగా భావించిన టీడీపీకి మద్దతు ఇచ్చే ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తమ అధిష్టానం పెద్దలు వైసీపీ అధినేత జగన్‌తో చర్చించారని, మద్దతు కోరారని అనడమే కాకుండా, ఆ చోట నాయకుడిపై సీరియస్ అయ్యారు. దాంతో ఆ మీడియా ఉత్సాహం నీరుకారిపోయిందని చెప్పాలి. 

అందుకే ఈ వార్తను మాత్రం మొదటి పేజీలో ప్రాముఖ్యత ఇచ్చి ప్రచురించలేదు. ఆ తర్వాత స్వయంగా మర్ము విజయవాడ రావడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఆమెతో పాటు వచ్చి జగన్ ను కలవడం, తదుపరి వైసిపి ఎమ్.పిలు, ఎమ్మెల్యేలతో భేటీ అవడం జరిగిపోయాయి.అయితే కాంగ్రెస్, వామపక్షాలు వంటివి ప్రత్యేక హోదాతో ముడిపెట్టి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి. ఆ పక్షాలు కాని, టిడిపి గాని ఎలాగొలా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చెడితే బాగుండని అనుకుంటాయి. అయినా ఎక్కడ, ఏ వేదిక మీద ఇలాంటివి మాట్లాడాలో జగన్ అలాగే చేస్తున్నారని అనుకోవాలి. లేకుంటే రాష్ట్రానికి వచ్చే సమస్యలు ఆయనకు తెలియనివి కావు. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పాలి. దేశంలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఎప్పుడూ ఒకే విధానానికి కట్టుబడి లేవు. 

ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, వామపక్షాలు కొన్నిసార్లు కలిసి పోటీచేస్తే, అసలు బీజేపీ పొడే గిట్టదని చెప్పే వామపక్షాలు బిజెపితో పాటు కొన్ని ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చాయి. 1971లో సీపీఐ ఆనాటి ప్రధాని ఇందిరాగాందీ ఆధ్వర్యంలోని కొత్త కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. సీపీఐ తరపున కడప నుంచి ఎద్దుల ఈశ్వరరెడ్డి కాంగ్రెస్ సపోర్టుతోనే ఎంపీగా గెలిచారు. అలాగే ఆరుగురు సీపీఐ ఎమ్మెల్యేలు కూడా నెగ్గారు. అప్పట్లో సీపీఎం ఒంటరిగా పోటీచేసి కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితం అయింది.

1971లో కాంగ్రెస్ పక్షాన రాష్ట్రపతి పదవికి పోటీచేసిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్దిగా మరో కాంగ్రెస్ నేత వివిగిరిని రంగంలో దించి ఇందిరా గెలిపించారు. 1978లో జనసంఘ్ తో కలిసి ఏర్పడిన జనతా పార్టీతో సిపిఎం ఎన్నికలలో పోటీ చేసింది. అప్పుడేమీ సిద్దాంత రాద్దాంతాలు జరగలేదు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వీరంతా ఒకటయ్యారు. 1985లో ఉమ్మడి ఎపిలో బీజేపీ, వామపక్షాలు టిడిపితో పొత్తు పెట్టుకుని పోటీచేశాయి. 1990 లో కేంద్రంలో విపిసింగ్ నేషనల్ ప్రంట్ ప్రభుత్వానికి ఒకవైపు వామపక్షాలు, మరోవైపు బీజేపీ మద్దతు ఇచ్చి కొంతకాలం రాజకీయం చేశాయి. 1996లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన యునైటెడ్ ప్రంట్  ప్రభుత్వానికి కాంగ్రెస్ సపోర్టు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకుంది. 

అంతేకాదు ఇందిరాగాంధీని అరెస్టు చేయించిన ఆనాటి కేంద్ర హోంమంత్రి చరణ్ సింగ్ తాను ప్రధాని అవడానికి జనతా పార్టీని చీల్చి ఇందిర మద్దతు తీసుకున్నారు. అదే తరహాలో చంద్రశేఖర్ ప్రధాని అయినప్పుడు రాజీవ్ గాంధీ కూడా బలపరిచారు. చంద్రబాబు  టీడీపీని తన అధీనంలోకి లాక్కున్న తర్వాత పలుమార్లు రకరకాల పిల్లిమొగ్గలు వేశారు. వామపక్షాలతో కలిసి స్నేహం చేసి వారికి చెప్పాపెట్టకుండా గుడ్ బై చెప్పి వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏలో చేరిపోయారు. తదుపరి మళ్లీ బీజేపీని చీకొట్టి టీఆర్‌ఎస్‌, వామపక్షాలతో మహాకూటమి కట్టారు. తదుపరి తిరిగి బీజేపీ గూటిలో చేరారు. 

2018 తెలంగాణ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌తో జతకట్టారు. 2004లో వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు చేపట్టిన ఆర్ధిక సంస్కరణలను ఇవే వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించేవి. ఇలా చెప్పుకుంటూ చాట భారతం అంతా కథ అవుతుంది.అందువల్ల జగన్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంతో నష్టపోయేది ఏమీ లేదు. 

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పరిస్థితుల ఆధారంగా ఇక్కడ రాజకీయాలు సాగుతాయి కానీ, రాష్ట్రపతి ఎన్నిక విషయం పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. గతంలో యుపిఎ రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీని నిలబెట్టినప్పుడు వైసీపీ కూడా మద్దతు ఇచ్చిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇలాంటి పదవులను వివాదాలకు దూరంగా చూడాలని అప్పట్లో జగన్ అనేవారు. అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్ కు, తాజాగా గిరిజన మహిళ మర్ముకు మద్దతు ఇవ్వడం ద్వారా తమ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని రుజవు చేసుకున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏకి మద్దతు ఇచ్చిన నేపధ్యంలో ఏపీకి కేంద్రం మరింత ఇతోధికంగా సాయం చేస్తే అదే పదివేలు. 

- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు