అసలు విషయం విస్మరించి.. విద్వేషాగ్ని చిమ్ముతున్నారు

30 Jul, 2022 13:12 IST|Sakshi

పోలవరం ప్రాజెక్టు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఐఐటి ఇచ్చిన ఒక నివేదిక ఆధారంగా ఈనాడు తదితర తెలుగుదేశం అనుబంధ మీడియా సంస్థలు దారుణమైన అక్షర విధ్వంసానికి పాల్పడినట్లు అనిపిస్తుంది. ఈ నివేదికలోని అంశాలు ఇవ్వడాన్ని ఎవరూ కాదనరు. అయితే ఆ నివేదికలో ఉన్న అంశాలన్నీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న భావన కల్పించడానికి ఈ మీడియా చేసిన ప్రయత్నం సమర్ధనీయం కాదు. ఐఐటి నివేదికలో 2020లో వచ్చిన వరదల తీరు, నదిలో ఇసుక కోత పడిన తీరు వివరిస్తూ , మానవ నియంత్రణలో లేని అంశంగా చెప్పలేం అని పేర్కొందని కథనం. 

అంటే దీని అర్దం ప్రకృతి వైపరీత్యం కూడా ప్రభావం చూపిందనే కదా. ఈనాడు మాత్రం ఈ సమస్యను ప్రకృతి శాపంగా చూడలేం అని హెడ్డింగ్‌ పెట్టేసింది. పోనీ అది కూడా నిజమే అనుకుందాం. మరి ఎవరి అసమర్ధత అన్నదానిపై కూడా స్పష్టత ఇవ్వాలి కదా? పైగా పోలవరంలో విధ్వంసం అని హెడ్డింగ్‌ పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఈనాడు పత్రికకు ఉన్న ద్రోహచింతన ఇలా ఉందా అన్న భావన ఏర్పడదా!ఒక ప్రాజెక్టు గురించి రాసేటప్పుడు ఎవరమైనా విద్వంసం అన్న పదం వాడతామా? అలా వాడామంటే మన కుత్సిత బుధ్ది బయటపడినట్లు కాదా! కాపర్ డామ్ గ్యాప్‌లు పూడ్చకపోవడమే భారీగా నదిలో కోతకు కారణమని రాసిన వారికి ఎందువల్ల కాపర్ డామ్ ల గ్యాప్ లు పూడ్చలేదో తెలియదా? లేక నిపుణుల కమిటీకి తెలియదా? కాపర్ డామ్ ద్వారానే గ్రావిటీలో నీటిని అందించి పోలవరం ప్రాజెక్టు నీటిని ఇచ్చినట్లు చెప్పాలని గత టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? 

అది అత్యంత ప్రమాదకరమని అనేక మంది హెచ్చరించడంతో ఆ ఆలోచనను విరమించుకున్న సంగతి తెలియదా?నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. కాపర్ డామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టవచ్చా? గత ప్రభుత్వం కాపర్ డామ్‌లో గ్యాప్ లు ఎందుకు ఉంచిది? ఒక వేళ కాపర్ డామ్ ను పూర్తిగా నిర్మిస్తే , నీరు అధికంగా వచ్చినప్పుడు అవి వెనక్కి తన్ని అనేక గ్రామాలు ముంపునకు గురి కావా? ఆ గ్రామాల నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుండా,వారికి వేరేచోట కొత్త ఇళ్ల నిర్మాణం చేయకుండా కాపర్ డామ్ పూర్తి చేయలేని పరిస్థితి వల్ల ఈ సమస్య తలెత్తలేదా? అంబటి ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేదు. 

ఏదో హడావుడి గా చేసి, తాము రికార్డు సృష్టించామన్న తాపత్రయంలో గత ప్రభుత్వం పలు తప్పిదాలు చేసిందని, వాటి ఫలితమే ఇప్పుడు డయాప్రమ్ వాల్ సమస్య అని ఆయన వివరిస్తున్నారు. ఐఐటి నివేదికలో నిర్వాసితుల సమస్య గురించి కూడా ఉంటే దానిని ఎందుకు ఈనాడు తదితర టీడీపీ మీడియాలో హైలైట్ చేయలేకపోతున్నాయి. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అంశాలను ఈ మీడియా దాచిపెట్టి ప్రస్తుత ప్రభుత్వంపైనే విషం చిమ్మే యత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోలేరన్న నమ్మకమా? నిజంగానే ఈ ప్రభుత్వం వచ్చాక ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని చెప్పవచ్చు.దానికి ప్రభుత్వం కూడా వివరణ ఇస్తుంది. నివేదికలో ప్రభుత్వం అన్న పదం వాడినప్పుడు అది గత ప్రభుత్వమా? ప్రస్తుత ప్రభుత్వమా అన్నదానితో నిమిత్తం ఉండదన్న సంగతి తెలియదా? 

కోవిడ్ పరిస్థితి వల్ల కూడా ప్రాజెక్టు జాప్యం అయిన విషయాన్ని కమిటీ తెలిపింది. 2020 లో కరోనా సంభవించిన సంగతి మర్చిపోయారా? కాంట్రాక్టర్ ల  మార్పిడి వల్ల పోలవరానికి శాపం అని మళ్లీ సొంతకధ కధాలను ఇస్తున్నారు. తమకు సంబంధించిన వారి కాంట్రాక్టు మార్చారన్న దుగ్ద తప్పితే ఇందులో లాజిక్ ఉందా? అది ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టాల్ స్ట్రాయ్ కంపెనీ నుంచి బలవంతంగా కాంట్రాక్టును తప్పించి నవయుగకు ఎందుకు అప్పగించారు? అది కాంట్రాక్టర్ మార్పిడి  కాదా? పోనీ టాల్ స్ట్రాయి అని అయినా పూర్తిగా తొలగించారా? 

అలా చేయకుండా రకరకాల విన్యాసాలు చేసి, టీడీపీ నేతలకు కొందరికి ఆ తర్వాత సబ్ కాంట్రాక్టులు ఇచ్చింది నిజం కాదా? అసలు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లపాటు ఈ ప్రాజెక్టు పనులు ఎందుకు చేపట్టలేదు? తదుపరి కేంద్రం నిర్మించవలసిన ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? అలా తీసుకునేటప్పుడు ఆర్ అండ్ ఆర్. ప్యాకేజీపై కేంద్రం నుంచి ఎందుకు స్పష్టత తీసుకోలేదు.పైగా 2014 నాటికి వ్యయ అంచనాలకే ఎందుకు ఒప్పుకున్నారు? ఇవన్ని ఒక ఎత్తు అయితే  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్‌ మాదిరి అయిందని ఎందుకు విమర్శించారు? అంటే అవినీతి జరిగినట్లా? కాదా? ఇక వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన మాట నిజం. 

అలాగే ప్రాజెక్టు కాంట్రాక్టర్ ను మార్చవలసిన అవసరం ఉందని భావించి ఆ నిర్ణయం అమలు చేయడంలో కొంత టైమ్ పట్టి ఉండవచ్చు. కాని కొత్త కాంట్రాక్టర్ మెఘా సంస్థ వచ్చాక స్పిల్ వే తో పాటు ప్రాజెక్టుకు 48 గేట్లను పూర్తి చేసిన మాట నిజం కాదా? పవర్ హౌస్ పనులు సాగుతున్నాయా?లేదా? పోనీ ఈ ప్రభుత్వంవల్ల జాప్యం అయిందని అనుకుంటే , 2018లోనే ప్రాజెక్టునే చంద్రబాబు పూర్తి చేసి చూపుతారు. సాక్షి పత్రికలో రాసుకో జగన్‌మోహన్‌రెడ్డి.. అంటూ బీరాలు పలికిన ఆనాటి దేవినేని ఉమామహేశ్వరరావు కానీ, చంద్రబాబు కానీ  ఆ మాటను ఎందుకు నిలబట్టుకోలేకపోయారు? అప్పుడు ఎవరి అసమర్ధత? ఎవరి వల్ల జాప్యం అయింది? ఇవన్ని జనానికి తెలియదని, ఇష్టం వచ్చినట్లు ప్రజలపై విద్వేషాగ్ని చిమ్మాలన్న తపనలో అసలు విషయం విస్మరిస్తున్నారు. 

ఎంతసేపు 2020లో ఈ ప్రభుత్వం కాపర్ డామ్ గ్యాప్‌లు పూడ్చలేదని రాస్తున్నారేకాని, గత ప్రభుత్వం అసలు గ్యాప్ లు ఎందుకు పెట్టింది?అది పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం, వరదల వల్ల వాల్ దెబ్బతినడంతో ఏర్పడిన ఈ సమస్యకు ఎవరిని బాద్యులను చేయాలి?కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించి, పునరావాస ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, నిర్వాసితులకు పూర్తి న్యాయం చేశాకే ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంచుతామని భరోసా ఇచ్చారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారం అంతా కేంద్రం పరిదిలోకి వెళ్లింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఎంత నిర్దారిస్తుందన్నదానిపై భవిష్యత్తులో ఏ స్థాయిలో నీరు నిల్వ ఉంచవచ్చన్నది తేలుతుంది.

గత ప్రభుత్వం ఏ తప్పు చేసినా, ఈ ప్రభుత్వం సాద్యమైనంత త్వరాగా వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్లి తొలిదశ కింద నీటిని విడుదల చేయగలగాలి. లేకుంటే ఇదే రకమైన విష ప్రచారాన్ని టీడీపీ మీడియా చేసే అవకాశం ఉంటుంది. దానిని గమనించి సత్వరమే ఈ ప్రాజెక్టు ఒక కొలిక్కి వస్తుందని ఆశిద్దాం. 


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు