టీడీపీతో బీజేపీ పొత్తు లేదన్నాక వారిలో మరింత అసహనం!

11 Oct, 2022 13:16 IST|Sakshi

ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియాను ఎల్లో అంటే పచ్చ మీడియాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాత్రమే అబివర్ణిస్తుంటుంది. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ పదాన్ని వాడడం విశేషమే. మూడు మీడియా సంస్థలు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నిత్యం కధలు తయారు చేసి జనం మీదకు వదలుతున్నాయి. ఈ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెంచడానికి విశ్వయంత్నం చేస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జగన్ వాటి ప్రయత్నాలకు ధీటుగా వారికి దుష్ట చతుష్టయం అని నామకరణం చేసి ప్రజలలోకి తీసుకు వెళ్లారు.

ఉమ్మడి ఏపీలో కూడా ఈనాడు, ఆంద్రజ్యోతి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ రెండు పత్రికలు అని సంభోదించేవారు. వాటిని తట్టుకోవడానికి తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఒక మీడియాను ఏర్పాటు చేయించారు. ఇదంతా తెలిసిన విషయమే. వైఎస్ ఆర్ దివంగతులు అయ్యాక ఈనాడు, జ్యోతి మీడియా సంస్థలు మరింతగా రెచ్చిపోయి వైఎస్ కుమారుడు, కడప ఎమ్.పి జగన్ పై పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక కధనాలు ఇచ్చేవి. అప్పటి నుంచి ఈ సంస్థలకు ఎల్లో మీడియా అని పేరు వచ్చింది. 

జగన్ అధికారంలోకి వచ్చాక కూడా ఈ పత్రికలు, టీవీలు అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కలిసి పలు కుట్రలలో భాగస్వాము అవుతున్నాయని అంతా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 లను కలిపి దుష్టచతుష్టయంగా జగన్ పిలవడం ఆరంభించారు. వారికి తోడు ఒక దత్తపుత్రుడు అంటూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శిస్తుంటారు. మొత్తం ఈ వ్యవహారం ఒక ఓపెన్ యుద్దంగా మారింది.

ఈ క్రమంలో కొంతకాలం బీజేపీని తమదారిలోకి తెచ్చుకునేందుకు  కొన్నిసార్లు వ్యతిరేక కధనాలు, మరికొన్నిసార్లు బ్లాక్ మెయిల్ కథనాలు రాస్తూ వస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. ఎబిఎన్ చానల్ లో అయితే బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డిని టీడీపీకి మద్దతు ఇచ్చే ఒక వ్యక్తి చెప్పుతో దారుణంగా అవమానించారు. తదుపరి పవన్ కళ్యాణ్ బీజేపీని, టీడీపీని కూడా కలపాలని ప్రయత్నాలు చేసినప్పుడు బీజేపీకి అనుకూలంగా కొన్ని స్టోరీలో రాసేవారు. కేంద్రం నుంచి ఏపీ ప్రజలకు ఏవైనా ఉపయోగమైన నిర్ణయాలు జరిగితే మాత్రం ఎల్లో మీడియా బీజేపీపై ఏదో ఒక విమర్శనాత్మక స్టోరీలు ఇస్తుంటాయి. ఈ మధ్య కాలంలో బీజేపీ వారు తెలుగుదేశంతో పొత్తు లేదని స్పష్టం చేయడంతో ఈ మీడియాలో అసహనం బాగా పెరిగిపోయింది. గత ఎన్నికల ముందు కూడా బీజేపీ , టీడీపీ విడిపోయాక ఈ మీడియా సంస్థలు బీజేపీపై దారుణమైన కధనాలు ఇచ్చేవి. 

ఇప్పుడు అంత ధైర్యం చేయకపోయినా, అవకాశం ఉందనుకున్నప్పుడల్లా తమ ధోరణి మారడం లేదు. ఉదాహరణకు విశాఖ రైల్వేజోన్ ఏపీకి రావడం లేదంటూ ఈ మీడియా సంస్థలు కూడబలుక్కుని రాసినట్లు రాశాయి. అందులో ఏపీకి నష్టం జరుగుతుందన్న భావన కన్నా, భలే అయిందిలే అన్న సంతోషమే వారిలో కన్పించిందన్న అభిప్రాయం  వ్యాప్తిలోకి వచ్చింది. నిజంగానే వారికి ఆ సమాచారం వచ్చి ఉంటే సంబంధిత అధికారులనో, మంత్రినో అడిగి దృవీకరించుకుని రాస్తే తప్పుకాదు. అలాకాకుండా తోచినట్లు రాసేయడంతో రైల్వే మంత్రితో సహా, బీజేపీ వైసీపీ నేతలు స్పందించారు. రైల్వేజోన్ విశాఖకు ఇస్తున్నామని మంత్రి చెబితే, జోన్ రాకుంటే రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్.పి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జోన్ వస్తే ఈ టీడీపీ మీడియా ఏమి చేస్తుందని ప్రశ్నించారు.

ఇక బీజేపీ నేరుగా ఈ మీడియాను పచ్చ మీడియాగా పేర్కొంటూ లేఖ రాసింది. ఆ పార్టీ అద్యక్షుడు సోము వీర్రాజు ఈ లేఖ రాస్తూ తమ పార్టీ నేతలపై జ్యోతి చేసిన ఆరోపణలకు ఆదారాలు ఇవ్వాలని కోరారు. ఎవరో బీజేపీ నేత నాలుగు రాష్ట్రాలలో ముప్పై కోట్ల దందాకు పాల్పడ్డారని, దీనిపై ఆరాకు డిల్లీనుంచి అదిష్టానం వేగులు వచ్చారని, కమలంలో కలెక్షన్ క్వీన్ అని మూడు కధనాలను ఆంద్రజ్యోతి రాసిందట. ఇవన్ని నైతిక విలువలు లేని ఎల్లో జర్నలిజంగా రాజకీయ ప్రేరితంగా కనిపిస్తోంది తప్ప జర్నలిజంగా అనిపించుకోదని వీర్రాజు వ్యాఖ్యానించారు.

నిజానికి ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్ గత పదేళ్లుగా ఎదుర్కుంటూనే ఉన్నారు. ఆయన అదికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎల్లో మీడియా మరింత రెచ్చిపోయి జగన్ పై దారుణమైన కధనాలు ఇస్తోంది. చివరికి కుల,మత విద్వేషాలు పెంచేవారికి విశేష ప్రాదాన్యం ఇస్తూ గంటల తరబడి తమ చానళ్లలో మాట్లాడిస్తున్నాయి. కాకపోతే వారికి ఒకటే ధైర్యం. తాము ఏమి చేసినా, తమను ఎవరు ఏమీ చేయలేరన్నదే వారి నమ్మకం.దానికి తగినట్లుగానే ఈ మీడియాకు మద్దతు గా ఉన్న టీడీపీ అధినాయకత్వం కోర్టులలో శక్తిమంతమైనవారిని పెడుతూ అనుకూలమైన నిర్ణయాలు పొందగలుగుతోందన్న అభిప్రాయం ప్రజలలో వ్యాపించింది.

న్యాయ వ్యవస్థ నుంచి స్టేలు పొందగలిగే సత్తా కారణంగా ఈ మీడియా మరింతగా పెట్రేగిపోతోంది. ఏపీ ప్రభుత్వం మరీ తీవ్రంగాఉన్న ఆరోపణల మీద కేసులు పెట్టినా వెంటనే స్టే నో,  లేక ఏదో ఒక రిలీఫ్ పొందగలుగుతున్నారు. దాంతో పరిస్థితి అర్ధం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం కన్నా, రాజకీయంగానే ఎదుర్కోవడం బెటర్ అనుకున్నారో ఏమో కాని, దుష్టచతుష్టం అని నామకరణం చేసి దానినే ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఇచ్చే అవాస్తవిక కధనాలపై ఎప్పటికప్పుడు ఖండనలు ఇస్తూ, మీడియా సమావేశాలు పెట్టి ఎదురుదాడి చేస్తూ కధ నడుపుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఈ మీడియాతో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

ఒక పక్క ఈనాడు అధినేత రామోజీరావును కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలుసుకోవడం, మరో రెండు మీడియా సంస్థల అధిపతులను కూడా డిల్లీ పిలిపించుకుని షా మాట్లాడడం వంటివి కూడా ఎల్లో మీడియాకు ఉపయోగపడ్డాయని అంటారు. అయినా వారి లక్ష్యం టీడీపీ అదినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం కనుక వారు అవసరమైతే బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడడం లేదు. టీడీపీ నుంచి బీజేపీలో తమ రక్షణ కోసం చేరిన నేతలు కొందరు ఇప్పటికీ టీడీపీకి కోవర్టులుగానే పనిచేస్తున్నారు. వారి విషయంలో బీజేపీ ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి ఉంది. ఎల్లో మీడియాపై దాడి చేయడానికి ముందుగా తమ పార్టీలో ఉన్న కోవర్టులను, టీడీపీ ఏజెంట్లను ముందుగా గుర్తించి , తగు చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. 


- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు