ఈనాడుకు మళ్లీ మద్యనిషేధం గుర్తుకు వచ్చిందా?

15 Aug, 2022 13:27 IST|Sakshi

ఈనాడు పత్రికవారికి సడన్ గా మద్య నిషేధం అంశం గుర్తుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇంకా మద్య నిషేదం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.నిజంగానే ఈ పత్రిక చిత్తశుద్దితో ఈ ప్రశ్న వేస్తే తప్పు కాదు. కాని జగన్ ప్రభుత్వంపై ద్వేషంతో రాస్తున్నందునే ఈనాడు అప్రతిష్టపాలు అవుతోంది.

గత మూడు దశాబ్దాలలో ఈ పత్రిక మద్య నిషేధంపై అనుసరించిన విదానాలు అందరికి గుర్తుకు వచ్చి నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ సమయంలోనే నెల్లూరు జిల్లా దూబగుంట అనే గ్రామంలో సారా విచ్చలవిడిగా పోరుతుంటే, దానికి వ్యతిరేకంగా రోశమ్మ అనే ఆమె ఆందోళన చేపట్టారు. ఆనాటి జిల్లా కలెక్టర్ కూడా అందుకు ప్రోత్సాహం ఇచ్చారు. తద్వారా దానికి మంచి ప్రచారం వచ్చింది. ఇదేదో అంది వచ్చిన అవకాశంగా భావించి ఈనాడు అదినేత రామోజీరావు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధ ఉద్యమానికి నడుం కట్టారు. 

తన పత్రికలో రెండు పేజీలు మద్య నిషేధ ఉద్యమ వార్తలకే కేటాయించేవారు. పుంఖానుపుంఖాలుగా సంపాదకీయాలు రాసేవారు. మా బోటి వాళ్లం కూడా ఇది చూసి సంతోషించేవాళ్లం. ఆ సందర్భంలో ఈనాడు విలేకరులే ఆయా చోట్ల కొన్ని సన్నివేశాలు సృష్టించి కధనాలుగా ఇచ్చిన ఘట్టాలు  లేకపోలేదు. ఆ తరుణంలో అప్పటి మంత్రి రోశయ్య ఆద్వర్యంలో ఒక కమిటీ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించి అక్కడ మద్య నిషేధం అమలు జరుగుతున్న తీరును పరిశీలించి వచ్చింది. 

అక్కడ పేరుకే మద్య నిషేధం తప్ప, ఆచరణలో జరగడం లేదని అభిప్రాయపడింది. దానికి తగినట్లుగానే ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా గుజరాత్ కల్తీ సారా కారణంగా అనేక మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కల్తీసారా  తాగి నలభై మంది ఆ రాష్ట్రంలో మరణించిన వార్త వచ్చింది. బీహారులో ముఖ్యమంత్రి  నితిష్ కుమార్ మధ్య నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించినా, అక్రమ మద్యం ఏరులై పారుతోందన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. 

మద్యాన్ని నియంత్రించడం వేరు. నిషేధించడం వేరు. కారణం ఏమైనా వైఎస్సార్‌సీపీ కూడా దశలవారీగా మద్య నిషేధం హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అందుకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినా చేయగలుగుతుందా?లేదా? విధానం మార్చుకుంటుందా? ఏమి చేస్తుందన్నది తేలడానికి మరికొంత సమయం ఉంది.

కానీ ఈలోగానే ఈనాడు పత్రిక హడావుడి పడిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పేశారట. బార్లకు కొంచెం ఎక్కువ సంఖ్యలో లైసెన్సులు ఇచ్చేశారట.ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందట. అసలు ఏడుపు ఇదన్నమాట.మద్యం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినిపోతున్నాయని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అన్న మాటను ఈ పత్రిక గుర్తు చేసింది. కాని మధ్య నిషేధం అంశంలో  గతంలో  ఈనాడు మీడియా  ఏమి చేసింది. తదుపరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఎలా ఫిరాయించింది గుర్తు లేదా! ఆ రోజులలో మహిళ ఉద్యమనేతలు కొందరి ప్రభావం , ఈనాడు పత్రిక సపోర్టు వంటి కారణాలతో కోట్ల విజయభాస్కరరెడ్డి సారా ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

దాంతో ఈనాడు శాంతిస్తుందని ఆయన అనుకున్నారు. కానీ అలా చేయలేదు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాల్సిందే అంటూ పేజీలను ప్రత్యేకంగా కేటాయించి వార్తలు ఇచ్చేది. నిజానికి జనంలో సంపూర్ణ మద్య నిషేధంపై నమ్మకం లేదని ఎవరైనా చెప్పినా రామోజీరావు ఒప్పుకునేవారు కారు. ఆయన సభలు సదస్సులు కూడా పెట్టారు. 

మద్యం వ్యాపారం వ్యభిచారం కన్నా ఘోరమని ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ వ్యాఖ్యానించారు. సరిగ్గా ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత ఎన్.టి.రామారావు సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని తన రాజకీయ అవసరాల కోసం భుజానవేసుకున్నారు. 

ఒకప్పుడు వారుణి వాహిని పేరుతో పెద్ద ఎత్తున టీడీపీ ప్రభుత్వంలోనే సారా విక్రయాలు విపరీతంగా పెరిగాయన్న విమర్శ ఉంది. అయినా ఎన్.టి.ఆర్. మద్య నిషేధ ఉద్యమం పేరుతో రైలు యాత్ర చేస్తే విశేష స్పందన వచ్చింది. అదంతా ఒక చరిత్ర. అప్పట్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత ,ఇతర కారణాలతో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఎన్.టి.ఆర్. మధ్యనిషేధాన్ని ప్రకటించారు. 

దీనిని అమలు చేయడం కష్టంగానే ఉన్నా, ఆయన వదలిపెట్టలేదు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే అక్రమ మద్యం వ్యాపారం చేస్తుంటే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్.టి.ఆర్. చెబుతుండేవారు. ఇంతలో ఆయనను కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్.టి.ఆర్.కన్నా స్ట్రిక్ట్ గా  మద్య నిషేధం అమలు చేస్తానని తొలుత చెప్పారు. ఎన్.టి.ఆర్.హెల్త్ పర్మిట్లు ఇస్తే తాను తీసేస్తున్నానని చెప్పారు. నిజంగానే చంద్రబాబు చిత్తశుద్దితో ఈ పనిచేస్తున్నారని నమ్మినవారు కూడా ఉన్నారు. కాని ఆ తర్వాత కొద్ది నెలలకే మద్య నిషేధం వల్ల వస్తున్న సమస్యలు, అక్రమ మద్యం వంటివాటిపై ప్రచారం ఆరంభించారు.

అక్రమ మద్యాన్ని నిలవరించడం కష్టసాధ్యంగా ఉందని చెప్పసాగారు. తదుపరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నిర్వహించారు. చివరికి ప్రజలంతా మద్య నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారంతగా బిల్డప్ ఇచ్చి దానిని ఎత్తివేశారు. ఆ తరుణంలో ఈనాడు పత్రిక యాధాలాపంగా వార్తలు రాసిందేకాని , చంద్రబాబు చేస్తున్నది తప్పు అని, అసమర్ధత వల్లే మధ్య నిషేధం అమలు చేయలేకపోతున్నారని రాయలేదు. దీంతో ఈనాడు రంగు చాలా మందికి తెలిసిపోయింది. అప్పట్లో ప్రముఖ మద్యం వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డి ఉదయం పత్రికను నడపడానికి ముందుకు వచ్చారు.

ఆయన ఆర్దికంగా శక్తిమంతుడు కావడంతో , ఆయనను దెబ్బకొట్టడానికిగాను రామోజీరావు మద్య నిషేధ ఉద్యమాన్ని నడిపారన్న సంగతి చాలామందికి అప్పటికి బోధపడింది. మరో వైపు ఎన్.టి.ఆర్. తాను ఆడమన్నట్లు ఆడరు కనుక ఆయనకు వ్యతిరేకంగా కార్టూన్లు, సంపాదకీయాలు, వార్తా కథనాలు వెలువరించేది. ఎన్.టి.ఆర్. ప్రభుత్వం పడిపోవడం, కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి తప్పనిసరిగా రామోజీరావు వద్దకు వెళ్లి ట్యూషన్ తీసుకోవడం వంటివి అందరికి తెలిసిన విషయాలే. కాకపోతే ఆ రోజుల్లో మీడియా ఇంత బలంగా లేదు. అందువల్ల రామోజీరావును రాజ్యాంగేతర శక్తిగా ప్రొజెక్టు చేయలేకపోయాయి. ఈ రకంగా రామోజీరావు అటు వ్యాపార, ఆర్దిక ప్రయోజనాలు, ఇటు రాజకీయ ప్రయోజనాలు ఆశించి, వాటికి తగినట్లుగా వ్యూహాలు అమలు చేసి అప్పట్లో సఫలం అయ్యారని చెప్పాలి. 

ఉదయం పత్రిక కూడా ఆర్దికంగా నిలదొక్కుకోలేకపోయి మూతపడిపోయింది. దాంతో రామోజీకి ఎదురు లేకుండా పోయింది. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన ఆయన తన డాల్పిన్ హోటల్ లో మాత్రం మద్యం సరఫరాను ఆపలేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తే ,రాష్ట్రం అంతటా నిషేదిస్తే తాను విక్రయించబోనని బదులు చెప్పేవారు. ఇక్కడే మద్యంపై ఆయన చిత్తశుద్ది అర్ధం చేసుకోవచ్చు.

ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీని స్తాపించి అక్కడ కూడా యధా ప్రకారం మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ విషయాలపై కోట్ల విజయభాస్కరరెడ్డి చాలా బాదపడేవారు. తాను రామోజీని గౌరవించి సారాను నిషేధించినా, రామోజీ కోరినట్లు ఆయన పిలిం సిటీకి సంఘీ నుంచి భూమిని వెనక్కి తీసుకుని అప్పగించినా , ఇలా సంపూర్ణ మధ్య నిషేధం అంటూ తనను ఇబ్బంది పెట్టారని ఆయన అనేవారు. ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే తన వ్యాపార ప్రయోజనాల కోసం ఆయన ఎంతకైనా వెళ్లడానికి వెనుకాడలేదని తెలుసుకోవడానికే. ఆ తర్వాత రామోజీని ఎదుర్కోవడానికి సాక్షి దినపత్రిక, టీవీ చానల్ వచ్చాయి. వీటిని దెబ్బతీయడానికి కూడా చంద్రబాబు,రామోజీలు చేయని ప్రయత్నం లేదు.అందులో భాగంగా పెట్టుబడులలో అక్రమాలు అంటూ ప్రచారం చేసేవారు. కాంగ్రెస్ లోని ఒక వర్గంతో కలిసి సోనియాగాంధీకి పితూరిలు పంపడం, కేంద్ర స్థాయిలో ఫిర్యాదులు చేసేవారు. అయినా ఆనాడు వైఎస్ వెనక్కి తగ్గలేదు. 

ఆయన కుమారుడు జగన్ ధైర్యంగా మీడియా సంస్థలను ఏర్పాటు చేసి డీ అంటే ఢీ అనే పరిస్థితి తెచ్చారు. దానిని రామోజీ సహించలేకపోవడం ఆశ్చర్యం కాదు. అంతలో వైఎస్ అనూహ్య మరణంతో వారు మళ్లీ విజృంభించారు. వారికి అంతగా విషయాలపై అవగాహన లేని సోనియాగాంధీ వ్యవహార శైలి కలిసి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ లు కలిసి ఆయనపై కేసులు పెట్టాయి. జగన్ ను పదహారు నెలలు జైలులో నిర్భందించేలా చేశాయి. అంతవరకు సఫలం అయినా, మీడియాను దెబ్బతీయలేకపోయాయి. అదే వారి అసహనానికి కారణం అని చెప్పాలి. జగన్ జనంలోకి వెళుతున్న తీరు వారికి జీర్ణం కాలేదు. జగన్ పై సిబిఐ కేసుల నేపధ్యంలో ఎన్నెన్నో కల్పిత గాథలను రాసేవారు. 2014 ఎన్నికలలో కొంతమేర అవి ప్రభావితం చేశాయి. తత్పలితంగా వైసిపి అధికారంలోకి రాలేకపోయింది. దాంతో సాక్షిని ఇంకా తొక్కేయవచ్చని అనుకున్నా, జగన్ పట్టుదలతో నిర్వహించారు. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబును,ఈనాడును ఆయన ఎదుర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలను బయటపెట్టగలిగారు. రుణమాఫీ వంటి వాటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాన్ని తెలియచేయగలిగారు. నిత్యం ప్రజలలోకి వెళ్లి జగన్ అదికారంలోకి రాగలిగారు. అది రామోజీ ఎన్నడూ ఊహించలేదు. 

అంతే..తనకు సంబంధం లేకుండా జగన్ అధికారంలోకి వస్తారా?అన్న ద్వేషాన్ని ఆయన పెంచుకున్నారు. జగన్ సి.ఎమ్. అయినప్పటి నుంచి ఒకటే వ్యతిరేక కధనాలు రాయడం ఆరంభించారు. జగన్ తన ఎన్నికల మానిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చినా వాటి గురించి ఒక్క ముక్క రాయరు. మిగిలిన ఐదు శాతం వాటి గురించి పదే,పదే రాసి, ప్రజలలో అదేదో ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదేమో అన్న భావన కలిగించే యత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న సుమారు 45 వేల బెల్టు షాపులను జగన్ ప్రభుత్వం నిర్మూలించినా, ఎన్నడూ రామోజీ మెచ్చుకుని సంపాదకీయం రాయలేదు. ప్రైవేటు మద్యం వ్యాపారాలు ఇష్టారాజ్యంగా చేస్తుంటే వారిని తొలగించి ప్రభుత్వం షాపులు పెట్టినా, గతంలో ఉన్న షాపుల సంఖ్యను తగ్గించినా ఈమీడియా స్పందించలేదు.

అదే సమయంలో బ్రాండ్ల గురించి , రేట్ల గురించి చంద్రబాబుతో పాటు ఈ మీడియా కూడా తెగ బాదపడిపోయింది. ఇప్పుడు బార్ల వేలం ద్వారా సుమారు 600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నది వీరి దుగ్ద. ప్రభుత్వాన్ని ఆర్దికంగా అన్ని వైపుల నుంచి దిగ్బందనం చేయడానికి వీరు చేయని ప్రయత్నం ఉండడం లేదు. అప్పులు పుట్టకుండా ఉండడానికి ఎన్ని అడ్డు పుల్లలు వేయాలో అన్ని వేస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని పక్కన పెట్టి, వాటిపై బురదవేసే పనిలోనే పూర్తిగా నిమగ్నమైపోతోంది. ఈ క్రమంలోనే మద్య నిషేధం అంశంలో జగన్ మడమ తిప్పేశారని ప్రచారం ఆరంభించారు.

మరి ఇంకా రెండేళ్లు గడువు ఉంది కదా అని ఎ వరైనా ప్రశ్నించినా వారికి జవాబు ఇవ్వరు. మరి చంద్రబాబు టైమ్ లో నిషేధం ఎత్తివేసినా, ఆ తర్వాత వేలాది బెల్టు షాపులను ప్రోత్సహించినా, ఈనాడు ఎందుకు వార్తలు ఇచ్చి ఉద్యమాలు నడపలేదని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిది అమాయకత్వం అనుకోవడం తప్ప చేయగలిగింది లేదు. ఎందుకంటే ఈనాడు లక్షం మద్య నిషేధం కాదు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలన్నదే. ఈ సందర్భంలోనే జగన్ ప్రబుత్వం కూడా వాస్తవిక దోరణిలోకి వచ్చి, అవసరమైతే విధానపరంగా ఏమైనా మార్పులు చేసుకుంటే బెటరేమో ఆలోచించుకోవాలి.ఎందుకంటే సురాపానం అన్నది మానవ బలహీనతగా ఎన్నో తరాల నుంచి ఉంది. దానిని నిషేధించడం సాధ్యం కావడం లేదని చరిత్ర చెబుతోంది. అందువల్ల నిషేదం కన్నా, నియంత్రణ ద్వారానే కాస్త మేలు చేయవచ్చేమో యోచించుకోవల్సిన సమయం వచ్చింది. అయితే రాజకీయంగా ఆనుపానులు చూసుకుని కాని ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి వాటిలో నిర్ణయాలు తీసుకోలేదు.

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు