సీఎం జగన్‌ స్పీచ్‌ ముందు ఆ నిరసనలకు విలువే లేకుండా పోయింది

26 Sep, 2022 14:59 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభ జరిగిన  ప్రతి రోజూ సస్పెండ్ అయ్యారు. వారు వ్యూహాత్మకంగా సభకు హాజరై, ప్రభుత్వపరంగా జరిగే ముఖ్యమైన చర్చలలో పాల్గొనకుండా, ఏదో ఒక గొడవ చేసి సస్పెండ్ అవుతూ వచ్చారు. ఒక రోజు సంక్షేమం సంక్షోభం , మరో రోజు నిరుద్యోగ సమస్య, ఇంకో రోజు అమరావతి ఇన్ సైడింగ్ వ్యవహారం, చివరి రోజు ఆరోగ్య యూనివర్శిటీ పేరు మార్పు అంశంలో టీడీపీ సభ్యులు తగాదా పెట్టుకున్నారు. నిజానికి వీటిలో ఏ ఒక్క అంశంలోను తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ది లేదన్న విమర్శ సహజంగానే వస్తుంది. చిత్తశుద్ది ఉండి ఉంటే సభలో చర్చలో పాల్గొని వారి వాదన వినిపించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు.  పోలవరం అంశంపై మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన సమాదానాలు వారిని ఆత్మరక్షణలో పడేశాయి. పోలవరం నిర్వాసితుల పరిహారం గురించి ప్రశ్న వేసి ప్రభుత్వానికి వారు సాయం చేసినట్లయింది. 

ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో నిర్వాసిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వడానికిగాను జి. ఓ విడుదల చేసింది. అంతేకాక గత కొన్ని రోజులుగా ఈనాడు పత్రిక పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వంపై పనికట్టుకుని కల్పిత వార్తలు ఇస్తోందన్న అబిప్రాయం ఉంది. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కొట్టుకుపోయిందని, అసలు ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదన్న పిక్చర్ ఇచ్చి ప్రజలను మోసం చేయాలని గట్టి ప్రయత్నం చేసింది. వాటికి చెక్ పెడుతూ జగన్ ఇచ్చిన విజువల్ ప్రజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది. 2019నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనుల పోటోలు, ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పోటోలను సభలో ప్రదర్శించి విడమరిచి విషయాలు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం కాపర్ డామ్ ల నిర్మాణం, స్పిల్ వే  వంటివాటిని పూర్తి చేయకుండా హడావుడిగా డయాఫ్రమ్ వాల్ నిర్మించిందని, కాపర్ డామ్ ల రెండు ఖాళీలను పెట్టడంతో వరద నీరు ఉదృతంగా వచ్చి డయాప్రమ్ వాల్ దెబ్బతిన్నదన్న విషయాన్ని జగన్ వివరించారు. 

అలాగే గత ప్రభుత్వ టైమ్లో స్పిల్ వే పియర్స్ ఇరవైరెండు అడుగుల ఎత్తు వరకే నిర్మితం అవగా, ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయడమే కాకుండా గేట్లను కూడా విజయవంతంగా అమర్చింది. రాజధాని అమరావతి విషయంలో వికేంద్రీకరణకు సంబంధించి, అలాగే ఆర్దిక స్థితిగతులపైన జగన్ సూటిగా , స్పష్టంగా తనదైన శైలిలో సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ5ల దుష్టచతుష్టయానికి ఏపీలో ఏ మంచి జరిగినా ఏడుస్తున్నాయని చెప్పిన వైనం అందరిని నవ్వించింది. ఏపీ ప్రభుత్వం పారిశ్రామికంగా, ఇతరత్రా ఉపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలను జగన్ తెలియచేస్తూ ఆరు లక్షల మందికి పైగా తమ ప్రభుత్వం ఉపాది కల్పించిందని, కొన్ని లక్షలమందికి చేయూత ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంచామని ఆయన తెలిపారు. కాని ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఏవీ అంటూ తెలుగుదేశం పార్టీ నిరసనకు దిగింది.

జగన్ స్పీచ్ ముందు ఆ నిరసనకు విలువ లేకుండా పోయిందని చెప్పాలి. సంక్షేమం సంక్షోభంలో పడిందంటూ తెలుగుదేశం ప్లకార్డులతో ఆందోళనకు దిగడం అందరిని నివ్వెర పరచింది. సంక్షేమం ద్వారా డబ్బులు పంచేస్తున్నారని ప్రచారం చేసిన టీడీపీ, తాను దెబ్బతింటున్నానని భయపడిందో ఏమో కాని, తన వైఖరి మార్చుకుని సంక్షేమం సరిగా జరగడం లేదని ప్రచారం ఆరంభించింది. దాంతో  ఇంతకాలం ఏపీ శ్రీలంక అవుతోందన్న తమ ప్రచారం అబద్దం అన్న సంగతిని వారే చెప్పేసినట్లయింది. సభ చివరి రోజున ఎన్.టి.ఆర్. ఆరోగ్య యూనివర్శిటీ పేరును వైఎస్ ఆర్ ఆరోగ్య యూనివర్శిటీగా మార్చుతూ ప్రభుత్వం బిల్లు పెట్టింది. బిల్లు పెట్టకముందే టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో రచ్చ చేశారు. స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి నానా రభస సృష్టించారు. 

వారికి ఈ విషయంలో అభ్యంతరం ఉంటే బిల్లు సభలో పెట్టేవరకు వేచి ఉండి, తదుపరి చర్చలో పాల్గొని తమ అబిప్రాయాలు చెప్పి, అనంతరం నిరసన తెలిపి ఉంటే బాగుండేది.అలా చేయకుండా గందరగోళం  సృష్టించడం, స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఇబ్బంది కలిగించడం, పేపర్లు చించి ఆయనపై విసరడం మొదలైనవాటికి పాల్పడ్డారు. అదికారంలో ఉన్న ప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ ప్రతిపక్ష సభ్యుడైనా ఇలా వ్యవహరిస్తే తీవ్ర స్థాయిలో విమర్శించేది. కాని ఇప్పుడు తాను ప్రతిపక్షంలోకి రాగానే ఇలాంటి దుశ్చర్యలకు వెనుకాడడం లేదు. గత స్పీకర్ కోడెల శివప్రసాద్ టైమ్ లో ప్రతిపక్షంపై ఆయన ఎప్పుడైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే మొదటి పేజీలో వార్తలు ఇచ్చిన ఈనాడు, ఇప్పుడు స్పీకర్ పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించినా, ఆయన ఎన్నిసార్లు మందలించినా ఆ వార్తలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనించవలసిన అంశమే. ఎన్.టి.ఆర్.పేరు మార్పుపై కొందరు వ్యతిరేకించవచ్చు.

మరికొందరు సమర్దించవచ్చు.కాని దీనివల్ల ప్రభుత్త పక్షానికి నష్టం కలుగుతుందేమోనని సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరిని ఈ అంశం ప్రభావితం చేయజాలదు. ఇరవైఎనిమిది సంవత్సరాల కింద ఎన్.టి.ఆర్.మరణించారు. అది కూడా  అల్లుళ్లు, కొడుకులు అంతా కలిసి ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేయడం వల్లే కుమిలి,కుమిలి తుది శ్వాస విడిచారన్నది సర్వత్రా ఉన్న ఫీలింగ్. ఆయనపై చంద్రబాబు వర్గం టీడీపీ వారు వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయడం, చంద్రబాబే తన మామ అని కూడా గమనంలోకి తీసుకోకుండా ఆయనను ఉద్దేశించి నైతిక విలువలు లేని వ్యక్తి అని ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేశారు. ఎన్.టి.ఆర్.కూడా చంద్రబాబును తీవ్రంగా దూషిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చారు.కాని ఎన్.టి.ఆర్. మరణం తర్వాత ఆయన వారసత్వం తమదే అంటూ ప్రజలను కొంతమేర మాయచేయగలగడం ఒక ప్రత్యేకత. ఆ రోజుల్లో ఈనాడు పత్రిక ఎన్.టి.ఆర్ కు వ్యతిరేకంగా పలు అవమానకర కార్టూన్లు ప్రచురించింది. కాని ఇప్పుడు ఎన్.టి.ఆర్ .పేరు మార్చితే చాలా అవమానం జరిగిపోయినట్లు కధనాలు ఇస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ, ఆయన అనవరంగా దీనిని చేస్తున్నారేమో అన్న భావన వ్యక్తం చేసినవారు కూడా ఉన్నారు. కృష్టా జిల్లాకు ఎన్.టి.ఆర్. పేరు పెట్టిన జగన్‌కు అప్పట్లో క్రెడిట్ బాగా వచ్చింది. కాని దీనివల్ల కొంత డామేజీ అవుతుందేమోనని ఆయన అభిమానులు ఫీల్ అయ్యారు. కాని ఇది తాత్కాలికం. ప్రజలకు వారి సమస్యల ముందు ఇలాంటివి చిన్న విషయాలు. మరీ భావోద్వేగం ఎక్కువ ఉంటే తప్ప ప్రజలు దీనికి ప్రభావితంకారు. అందువల్లే టీడీపీ వారు దీనిపై ఎంత హడావుడి చేసినా ప్రజలలో పెద్దగా నిరసనలు రాలేదు.దానికి జగన్ కాని, మంత్రి విడదల రజనీకాని తమ ప్రసంగాలలో ఎన్.టి.ఆర్.పట్ల తమకు గౌరవం ఉందని చెబుతూ, చంద్రబాబు అండ్ కో ఎన్.టి.ఆర్.ను ఎన్ని రకాలుగా అవమానించింది ఫోటోలతో సహా వివరించడం ద్వారా టీడీపీని కొంత డిఫెన్స్‌లోకి నెట్టారు. కాకపోతే అంతకుముందు నాలుగు రోజులపాటు జగన్ స్పీచ్‌లకు వచ్చిన విశేష స్పందన ఈ బిల్లు రచ్చతో కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఏర్పడింది.

అయినా జగన్‌కు రాజకీయంగా దీనివల్ల నష్టం ఉండకపోవచ్చు. ఆ రకమైన సెంటిమెంట్ నిజమైనదే అయితే, ఈ ముప్పైఏళ్లుగా అంటే ఎన్.టి.ఆర్.కుర్చీని లాగేసుకున్న చంద్రబాబుకు , ఆయన ఆధ్వర్యంలోని టీడీపీకి అసలు ఇంతకాలం రాజకీయ భవిష్యత్తే ఉండకూడదు కదా? ఈ సందర్భంగా శాసనసభలో అల్లరి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై తదుపరి క్రమశిక్షణ చర్యలకు సిఫారస్ చేయాలని స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారు. దాని పరిణామం టీడీపీపై ఎలా ఉండబోతున్నది చూడాల్సి ఉంది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, 
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు