పాలకుర్తి నుంచి మంత్రి దయాకర్‌రావుపై పోటీకి సిద్ధం: కొండా సురేఖ

22 Feb, 2023 11:59 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: కాంగ్రెస్ పార్టీ అవకాశమిస్తే పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై పోటే చేసేందుకు సిద్ధమని కొండా సురేఖ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఈ విషయాన్ని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కొండా సురేఖ ఈమేరకు మాట్లాడారు.

'వరంగల్‌లో రేవంత్‌ సభ అనగానే మంత్రి దయాకర్‌రావుకు నిద్ర పట్టడం లేదు. పాలకుర్తిలో మీరన్నా పోటీ చేయాలి. లేదా మేమైనా పోటీ చేస్తాం. మీ లేదా మా చేతిలో దయాకర్‌రావు ఓడిపోవాలి అని చెబుతున్నాం’ అని రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు.  

‘నేను ఒక్క తల్లి, తండ్రికి పుడితే టీడీపీని వీడను అని దయాకర్‌రావు.. అన్నడు. బీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరాడో అప్పుడే సచ్చిపోయిండు. చంపిన పామును చంపాల్సిన అవసరం మాకు లేదు. ఇక వరంగల్‌ ఈస్ట్‌ విషయానికొస్తే.. మా హయాంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం’ అని సురేఖ చెప్పుకొచ్చారు. 

మరోవైపు రేవంత్ ప్రసంగిస్తూ.. వైఎస్‌ హయాంలో ఎంత గుర్తింపు ఉందో.. రాబోయే ప్రభుత్వంలోనూ కొండా దంపతులకు అదే గుర్తింపు ఉంటుందని, ఇక్కడ సురేఖ గెలుపుతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో వరంగల్‌ ఇన్‌చార్జ్‌ అంజనీకుమార్‌ యాదవ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కొండా సుస్మితా పటేల్, నమిండ్ల శ్రీనివాస్, ఎర్రబెల్లి స్వర్ణ, రవళిరెడ్డి, బట్టి శ్రీనివాస్, సుధాకర్‌గౌడ్, అయూబ్‌ఖాన్, మీసాల ప్రకాశ్, కూరతోట సదానందం, మడిపెల్లి కృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రాకతో జోష్..
హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో జోష్‌ నింపింది. నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో రేవంత్‌రెడ్డితో కలిసి ముందుకు సాగారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. స్థానిక నేతల పాలన తీరును విమర్శిస్తూ.. చురకలు అంటిస్తూ చేసిన ప్రసంగం కార్యకర్తలను ఉత్సాహపరిచేలా చేసింది. మంగళవారం సాయంత్రం 6.28 గంటలకు ఎంజీఎం చౌరస్తాకు చేరుకున్న రేవంత్‌రెడ్డి.. రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నాయకులతో కలిసి పాదయాత్రను ప్రారంభించారు.
చదవండి: భగ్గుమన్న కాంగ్రెస్‌ శ్రేణులు.. యువజన నేతపై దాడితో ఉద్రిక్తతలు

మరిన్ని వార్తలు