టీపీసీసీ ఎ‍గ్జిక్యూటివ్‌ కమిటీకి కొండా సురేఖ రాజీనామా

11 Dec, 2022 16:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ఎ‍గ్జిక్యూటివ్‌ కమిటీకి మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు. టీపీసీసీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొండా సురేఖ రాజీనామా చేశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో తనపేరు లేదని, అలాగే వరంగల్‌కు చెందిన ఏ ఒక్క లీడర్‌ పేరు కూడా లేకపోవడం మనస్థాపాన్ని కలిగించిందన్నారు. తనకంటే జూనియర్లకు పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో స్థానం కల్పించారని.. ఇది తనను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 
చదవండి: టీపీసీసీ ‘జంబో జట్టు’

‘ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో నన్ను వేయడం బాధించింది. ఇందులో రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోపాటు కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని వారిని నామినేట్‌ చేసిన కమిటీలో నన్ను వేయడం అవమానపర్చినట్లుగా భావిస్తున్నాను. మాకు పదవులు ముఖ్యం కాదు. ఆత్మాభిమానం ముఖ్యం. నమ్ముకున్న వారి కోసం ఒకానొక సమయంలో మంత్రి పదవినే వద్దు అనుకున్నదాన్ని.

‘35 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఏ రోజు కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించలేదు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధి కోసమే సొంత ఖర్చులతో పనిచేశాము. నమ్మిన పార్టీ కోసం ఏ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను ఈ కమిటీలో కంటిన్యూ కాలేను. అందుకే తెలంగాణ ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా రాజీనామా చేస్తున్నాను. వరంగల్‌ ఈస్ట్‌, పరకాల నియోజకవర్గాల్లో  ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృష్టిచేస్తూ ఒక సామాన్య కార్యకర్తలా కాంగ్రెస్‌లో కొనసాగుతా’ అని  కొండా సురేఖ వెల్లడించారు. 
చదవండి: పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


మరిన్ని వార్తలు