కాంగ్రెస్‌లో టీపీసీసీ రచ్చ 

27 Dec, 2020 01:39 IST|Sakshi

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొండా సురేఖ?

పార్టీ అధిష్టానం పరిశీలనలో మాజీ మంత్రి పేరు 

మహిళా నాయకత్వంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి 

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా సీతక్క 

డీకే అరుణ, విజయశాంతిలకు దీటుగా మహిళా నేతలకు పదవులు    

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీని కోసం వెనుకబడిన వర్గాలకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ పేరును అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాల్లో మంచి సంబంధాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, వాక్పటిమ లాంటివి సురేఖకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. పార్టీలో కీలక పదవులు చేపట్టి వెళ్లిపోయిన డీకే అరుణ, విజయశాంతిలకు దీటుగా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుత ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకురాలు సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడంతో పాటు కీలక కమిటీల్లో ఆమె పేరు చేరుస్తారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. మంచి పోరాట పటిమ ఉన్న నేతగా గుర్తింపు పొందిన సీతక్క.. రాష్ట్రంలోని మహిళల సమస్యలపై మరింత క్రియాశీలకంగా పని చేస్తారనే ఆలోచనతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. చదవండి: (శుభవార్త: రైతు బంధు ఇక ఇంటికే..!)

అయితే, మహిళా అధ్యక్షురాలి పదవి కోసం సునీతారావు, కాల్వ సుజాత పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిని కూడా పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా చేయాలని, ఆమెకు కూడా కీలక పదవి కట్టబెట్టాలనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. ఇక, మహిళా కాంగ్రెస్‌ ప్రస్తుత అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మరో నాయకురాలు ఇందిరా శోభన్‌లకు కమిటీల్లో సముచిత స్థానం లభిస్తుందని, మైనార్టీ వర్గానికి చెందిన నాయకురాలు ఉజ్మా షకీర్‌ మరికొందరు రాష్ట్ర, జిల్లా స్థాయి మహిళా నేతలకు ఈసారి మార్పుల్లో మంచి అవకాశాలు లభిస్తాయనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది.  

నాయకుల మధ్య మాటల యుద్ధం
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో రచ్చ కొనసాగుతూనేఉంది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ఓ రకంగా దుమారాన్ని లేపుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ప్యాకేజీలు మాట్లాడుకున్నారంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ కీలక నేతలపై మీడియాలో విమర్శలు చేశారన్న ఆరోపణలు అంతర్గతంగా వీహెచ్‌ను ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ విషయంపై వీహెచ్‌ మాట్లాడిన వీడియో క్లిప్పింగులు, పేపర్లలో వచ్చిన వార్తలను మాణిక్యం ఠాగూర్‌ ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో తెప్పించుకున్నారని, దీనిపై నివేదిక తయారు చేసి పార్టీ అధిష్టానానికి ఇస్తారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు తాను చెంచాగిరీ చేస్తున్నానంటూ వీహెచ్‌ మాట్లాడడాన్ని మాజీ ఎంపీ మల్లురవి కూడా తప్పుపట్టారు. తాను పీసీసీ అధ్యక్షుడి విషయంలో మొదటి నుంచీ ఒకే విధంగా ఉన్నానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసమే రేవంత్‌రెడ్డికి ఈ పదవి ఇవ్వాలన్న తన అభిప్రాయాన్ని అటు మీడియా ముందు ఇటు అధిష్టానం దూతలకు బహిరంగంగా చెప్పానని తెలిపారు. 

కమిటీలపై ఏం చేద్దాం?..: ఇక, టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు ఆరు కమిటీలను ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల అభిప్రాయాలను మరోమారు తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులతో రాహుల్‌ గాంధీ ఫోన్‌లో లేదంటే జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుతారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి.  

మరిన్ని వార్తలు