ఒక్క సీటుకు టీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురి పోటీ? కానీ, టికెట్‌ ఆయనికిస్తే మాత్రం జంప్‌!

11 Nov, 2022 18:45 IST|Sakshi

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అక్కడున్న జనరల్ సీట్లు కేవలం మూడే కావడంతో పోటీపడేవారు ఎక్కువయ్యారు. పార్టీలోని పోటీ తట్టకోవడమే కష్టంగా ఉంటే... ఇప్పుడు సీపీఐ నుంచి మరో ప్రమాదం ముంచుకొస్తోందని ఆందోళన పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇంటా, బయటా జరిగే పోటీలో తమకు సీటు దక్కుతుందా లేదా అనే లెక్కలు వేసుకుంటున్నారు. 

ఆ సీటులో నేనే పోటీ చేస్తా.!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెరో ఐదు సీట్లు వచ్చాయి. వీటిలో కేవలం మూడే జనరల్ సీట్లు ఉండగా... కొత్తగూడెం జిల్లాలో అయితే ఒక్క కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు గిరిజనులకు రిజర్వ్ అయ్యాయి. దీంతో కొత్తగూడెం సీటు కోసం టీఆర్ఎస్‌లో సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే... ఇతర నాయకుల మధ్య పోటీ మొదలైంది.

గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జలగం వెంకట్రావు పరాజయం చెందారు. గెలిచిన కొంతకాలానికే వనమా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారులో ప్రయాణం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే కొత్తగూడెం సీటు ఇస్తారని వనమా వెంకటేశ్వరరావు చెప్పుకుంటున్నారు. 
(చదవండి: తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే: మధుయాష్కీ గౌడ్‌)

సర్వేల్లో నా పేరే చెబుతున్నారు
గత ఎన్నికల్లో వనమా మీద ఓడిన, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం టిఆర్ఎస్ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉండటంతో గులాబీ బాస్ టికెట్ తనకే ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. వీరిద్దరితోపాటు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్న గడల శ్రీనివాసరావు టీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీనిలో భాగంగానే ఇటీవల ఆయన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో జీఎస్‌ఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. వారానికి రెండు రోజులు కొత్తగూడానికి కేటాయిస్తున్నారు. మరో రెండు నెలల తర్వాత కొత్తగూడెంలో ఇంకొన్ని కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. గడల శ్రీనివాసరావుకు సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందని ఆయన వర్గీయులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారట. దీంతో కొత్తగూడెం టిఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోందన్న గందరగోళంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి.

పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తుందా?
ఇదిలా ఉంటే అసలు కొత్తగూడెం టికెట్ పొత్తుల్లో భాగంగా సిపిఐ కి వెళ్తుందన్న ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించేశారట. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తో సిపిఐ పొత్తు దాదాపు ఖరారు అయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఖచ్చితంగా కొత్తగూడెం టికెట్ సిపిఐకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు పరిస్థితి ఏంటన్న చర్చ సైతం ఆసక్తికరంగా సాగుతోంది. 

టికెట్ ఇవ్వకపోతే జంప్
జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న కొత్తగూడెం గులాబీ నేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ముగ్గురు నాయకులు కాంగ్రెస్, బిజేపి పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న  గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ సమయంలోనైనా లెక్కలు తేడా కొట్టినట్లు తెలిస్తే గోడ దూకడానికి సిద్దంగా ఉన్నారట. ఒకవైపు గులాబీ పార్టీలో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తూనే... రాకపోతే అన్న అనుమానంతో పక్క పార్టీలవైపు చూస్తున్నారు.
(చదవండి: ED Raids Telangana: గ్రానైట్‌ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు