ఇది నిప్పుతో చెలగాటమాడటమే.. ప్రతిపక్షాలకు మంత్రి కొట్టు హెచ్చరిక

29 Aug, 2022 12:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వినాయకచవితి పండుగను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని ప్రతిపక్షాలపై మంత్రి కొట్టు సత్యనారాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ట ఆలోచనలతో దేవుడితో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఇది నిప్పుతో చెలగాటమాడటమేనని హెచ్చరించారు. రాష్ట్రంలో వినాయకచవితి వేడుకలపై ఎలాంటి ప్రత్యేకమైన ఆంక్షలు లేవని మరోసారి స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. కొత్తగా ఎటువంటి నిబంధనలు అమలు చేయడం లేదని చెప్పారు. రాజకీయాల కోసం టీడీపీ, బీజేపీ పండుగలను వాడుకోవడం దుర్మార్గమని అన్నారు.

ఎలాంటి రుసుం వసూలు చేయడం లేదు
వినాయక చవితి వేడుకల కోసం ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదన్నారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్లు ఎక్కడా ఉత్సవాలు సరిగా జరగలేదన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా చేసుకోవాలని జనం ఆశపడుతున్నారన్నారు. ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. పదేపదే రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వినాయక చవితి వేడుకలపై తప్పుడు ప్రచారాన్ని దేవాదాయశాఖ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని ఇప్పుడే ఎండోమెంట్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 

చదవండి: (తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు