కులాలకు కేసులకు సంబంధమేంటి? 

23 Jun, 2021 03:36 IST|Sakshi
మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, కె.కె రాజు తదితరులు

తప్పు చేస్తే ఎవరిపైనయినా చర్యలుంటాయి

ఇలాంటి కుల రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లు

మాన్సాస్‌ భూముల్ని వేలం వేయించింది అశోక్‌ గజపతేగా?

సోదరుడి కుమార్తెను అవమానించటం క్షత్రియ ధర్మమా?

ఆమె కూడా క్షత్రియ మహిళేనన్న విషయం గుర్తు లేదా?

20 ఏళ్లుగా ట్రస్టు ఖాతాలను ఎందుకు ఆడిట్‌ చేయించలేదు?

అశోక్‌ గజపతి, బాబు తీరుపై క్షత్రియ నేతల మండిపాటు  

సాక్షి, అమరావతి, విశాఖపట్నం: టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తుంటే.. ఆయన కులం చాటున దాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని క్షత్రియ నేతలు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కె.కె.రాజు మండిపడ్డారు. కులాలకు– కేసులకు సంబంధం లేదని, తప్పు చేసిన వారు ఏ కులంవారైనా శిక్ష పడుతుందని వారు స్పష్టంచేశారు. ‘‘రాజకీయ, న్యాయ వివాదాల్లో... ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాల్లో కులసంఘాల జోక్యం సబబు కాదు. అశోక్‌గ జపతిరాజు మాన్సాస్‌ ట్రస్ట్‌ పేరిట చేసిన మోసాలు, అవినీతి వ్యవహారాలను ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు వదిలిపెట్టాలే తప్ప కుల సంఘాల జోక్యం తగదు. అశోక్‌గజపతిరాజు తప్పు చేసి క్షత్రియ కులాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదెంతమాత్రం క్షమార్హం కాదు’’ అని విశాఖలో ఉత్తరాంధ్ర నేతలు స్పష్టంచేశారు. 

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు విజయవాడలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘గతంలోనూ చంద్రబాబు వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడూ ఎల్లో మీడియా సాయంతో రెడ్డి, క్షత్రియుల మధ్య గొడవలు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు బుద్ధి రాకపోవడం సిగ్గు చేటు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆస్తులకు సంబంధించి ఊరు, పేరు లేకుండానే క్షత్రియుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు ప్రకటనలివ్వడం దారుణం. క్షత్రియులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు... సిద్ధాంతాలకు కట్టుబడే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిది’’ అని హితవు చెప్పారు. బాబు హైదరాబాద్‌లో కూర్చుని ఇక్కడ కులాల కురుక్షేత్రాన్ని కోరుకోవడం మానుకోవాలని హితవు పలికారు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి వైఎస్‌ జగన్‌ క్షత్రియులకు మూడు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు, మంత్రి పదవి ఇచ్చారని, దీన్నెవరూ మరచిపోరని చెప్పారాయన. 

మహిళపై వివక్ష క్షత్రియ ధర్మమా? 
విశాఖలో మాట్లాడిన క్షత్రియ నేతలు... ఇప్పుడు అశోక్‌గజపతిరాజును సమర్థిస్తూ, కొమ్ముకాస్తున్న ఒక వర్గం క్షత్రియ నేతలే గతంలో ఆయన తండ్రి దోపిడీదారుడని విమర్శించారని గుర్తుచేశారు. అశోక్‌గజపతిరాజు అంశాన్ని కులానికి ముడిపెట్టి కొన్ని పత్రికల్లో కథనాలు రాయడాన్ని క్షత్రియుల తరఫున ఖండిస్తున్నామన్నారు. అశోక్‌గజపతిరాజు తన అన్న కూతురు సంచయితకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై వివక్ష చూపించడం క్షత్రియ ధర్మమా? అసలు క్షత్రియ కుటుంబంలో మహిళలకు ఎంత గౌరవమిస్తారో అశోక్‌ గజపతికి తెలుసా? అని ప్రశ్నించారు. మహిళలకు ఎటువంటి హక్కులుండవని చెప్పడమే అశోక్‌ గజపతి ఉద్దేశమయితే.. ఆ వాదనను రాష్ట్రంలో క్షత్రియలెవ్వరూ సమర్థించరని చెప్పారు. ‘‘పంచగ్రామాల సమస్య పరిష్కారానికి అనుకూలమో, వ్యతిరేకమో.. అశోక్‌గ జపతి తక్షణమే చెప్పాలి.

కోటిపల్లి వద్దనున్న మాన్సాస్‌ ట్రస్టు భూములను ఏపీఎండీసీకి (2020కి ముందు) అప్పగించక మునుపు అక్కడ ఇసుకను లెక్కాపత్రం లేకుండా దోచుకున్నది ఎవరు? మాన్సాస్‌ విద్యాసంస్థలకు రావాల్సిన రూ.35 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం« దరఖాస్తు కూడా చేయకుండా ఆ సంస్థలను నాశనం చేసింది ఎవరు? మాన్సాస్‌ భూములను కోర్టుకు తెలియకుండా వేలం వేయించింది ఎవరు? 20 ఏళ్లుగా మాన్సాస్‌ ట్రస్టు అకౌంట్లను ఆడిటింగ్‌ చేయించలేదంటే.. ఇది ట్రస్టుగా నడుస్తోందా? లేక అశోక్‌గజపతి సొంత వ్యవహారంలా నడుస్తోందా? అని ప్రశ్నించారు. వీరితో పాటు ఈ సమావేశంలో విశాఖ డీసీసీబీ చైర్మన్‌ సుకుమార్‌రాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రఘురామరాజు, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, మాజీ సీఈసీ సభ్యుడు శ్రీనివాసరాజు, కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌రాజు, భూపతిరాజు సుజాత, జానకిరామరాజు, పార్టీ అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, సంయుక్త కార్యదర్శి కిరణ్‌రాజు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు