రాజకీయ విమర్శలు-ఎబి వెంకటేశ్వరరావు చేసిన తప్పేమిటి!

12 Jul, 2022 13:49 IST|Sakshi

ఆంద్ర ప్రదేశ్  సీనియర్ పోలీసు అధికారి, గత టిడిపి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం డిజిగా ఉన్న ఎబి వెంకటేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకటన మాదిరిగానే ఉన్నాయి. ఆయనను ఇప్పటికే రెండోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ అన్యాయమైనదని ఆయన వాదించవచ్చు. అంతవరకు తప్పు లేదు. 

కాని మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, ఇతర సీనియర్ అధికారులపైన ఆయన అనుచితంగా మాట్లాడినట్లు అనిపిస్తోంది. మీడియాతో మాట్లాడడానికి ముందు ఆయన ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? తన సస్పెన్షన్ సరికాదని ఛీఫ్ సెక్రటరికి  వాదన తెలియచేయకుండా ఇలా మాట్లాడవచ్చా? బహుశా ఆయన కూడా ప్రస్టేషన్ కు లోనవుతుండవచ్చు. 

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన అనుభవపూర్వకంగా చెబుతుండవచ్చు. ఇజ్రాయిల్ నుంచి ఫోన్ టాపింగ్ పరికరాలు తెప్పించడానికి , ఆయన కుమారుడి కంపెనీకి సంబంధిత కాంట్రాక్టు అప్పగించడానికి ప్రయత్నించారన్నది అభియోగం. ఆయన వాటిలో అవినీతి జరగలేదని అంటున్నారు. కాని అసలు ఆ పరికరాలు కొనవలసిన అవసరం ఏమి వచ్చింది. 

నిజంగానే తీవ్రవాదులపై నిఘా కోసమే అయితే వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా పలువురు నేతల ఫోన్ లు టాప్ చేయించారన్న అభియోగాలు ఎందుకు వచ్చాయి? ఆయనపై విచారణ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? వీటన్నిటికి ఆయన వివరణ పరిమితం అయి ఉంటే బాగుండేది. 

నిజానికి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ లోకి వచ్చేంతవరకు ఎబి వెంకటేశ్వరరావు పెద్దగా వివాదాస్పదుడు అయినట్లు వార్తలు రాలేదు. కాని చంద్రబాబు జత పట్టగానే ఎందుకు ఇలా అయ్యారో తెలియదు. ఆయనపై పలు రాజకీయ ఆరోపణలు కూడా వచ్చేవి. గతంలో అనేక మంది ఇంటెలెజెన్స్ డిజిలు పనిచేసినా ఒకరిద్దరు తప్ప ఎవరూ వివాదాలలో లేరు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అధికారి అరవిందరావు నిఘా విభాగం అధిపతిగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ రాజకీయ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు రాలేదు. ఆ తర్వాత కూడా పలువురు ఇంటెలిజెన్స్ లో పనిచేసినా అసలు ప్రజలకు తెలిసేవారే కారు. అంతదాకా ఎందుకు వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిఘా విభాగం అధినేతలు ఎవరైనా పబ్లిక్ లో కనిపించారా? 

వారెవరో ప్రజలకు తెలుసా? వారు తమ పనిని సైలెంట్ గా చేసుకుపోతుంటారు. అలా అని పోలీసు ఉన్నతాధికారులంతా రాజకీయాలకు అతీతంగా ఉంటారన్న గ్యారంటీ లేదు. గతంలో ఎమ్‌.వి.భాస్కరరావు డిజిపి గా ఉన్నప్పుడు ఆయన తమ్ముడికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం గాంధీ భవన్ కు వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. ఐఎఎస్, ఐపిఎస్ వంటి అఖిలభారత సర్వీసులో ఉన్నవారు సాధ్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలి. వారిది కూడా కత్తిమీద సామె. 

ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా తమకు సానుకూలంగా ఉండే అధికారులనే ఆయా బాధ్యతలలో నియమిస్తారు.అదేమీ కొత్త విషయం కాదు. మరో ఉదాహరణ కూడా చెప్పాలి. సీనియర్ ఐఎఎస్ అధికారిగా పనిచేసిన ఎవిఎస్ రెడ్డికి టిడిపి హయాంలో ప్రభుత్వంతో విబేధాలు వచ్చాయి. దాంతో ఆయన అసంతృప్తికి గురై భరతసేన అనే పేరుతో కొంతకాలం ఒక సంస్థను నడిపారు. 
చదవండి👉రాష్ట్రపతి ఎన్నికలు.. బాబును పట్టించుకోని ప్రధాని మోదీ

తదుపరి కొంతకాలానికి  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన తిరిగి ప్రభుత్వంలో  చేరిపోయారు. హర్యానాలో నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తారన్న పేరు ఉన్న అశోక్ ఖేమ్కే అనే అధికారి డెబ్బై సార్లకు పైగా బదిలీ అయ్యారని గతంలో వార్తలు వచ్చాయి. దాదాపు అన్ని రాష్ట్రాలలో అఖిలభారత సర్వీసుల వారు కొందరు వివాదాస్పదులవడం, మరికొందరు ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరుగుతూనే ఉంటాయి. 

కొందరు ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కోసం కాండిడేట్లను కూడా సిఫారస్ చేస్తుంటారని  చెబుతారు. ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి. ఆనాటి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే యత్నంలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన నిఘా విషయం పసికట్టలేకపోయారని అప్పటి  ఎపి నిఘా విభాగం అదికారిని బదిలీ చేశారన్నది వాస్తవం కాదా? 

ఆ తర్వాత ఎబి వెంకటేశ్వరరావును ఆ పదవిలోకి తీసుకు వచ్చారు. దురదృష్టవశాత్తు ఎబి వెంకటేశ్వరరావు  టిడిపి ప్రభుత్వ హయాంలో ఏదో రూపంలో నిత్యం వార్తలలో ఉండేవారు. దాని ఫలితమే ఇప్పుడు ఆయన ఈ చిక్కులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఎవరు సలహా ఇచ్చారో అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనకూ వర్తిస్తాయి. ఎవరి సలహా మేర ఎబి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన రాజకీయ విమర్శలు చేశారో తెలియదు. 

ఇవి పూర్తిగా  అనుచితం అవుతాయి. సీనియర్ అధికారిగా ఉన్న ఆయనకు ఈ విషయం తెలియదా? తెలిసినా, ఇంతకన్నా పోయేది ఏముందని మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలనే ఆయన చేసినట్లుగా ఉందన్న భావానికి  ఆస్కారం ఇవ్వకుండా ఉండాల్సింది. అన్నిటికి మించి కోడికత్తి కేసు అంటూ , గతంలో వైఎస్‌ జగన్ పై జరిగిన దాడి ఘటనలో రాష్ట్రాన్ని  తగులబెట్టాలని చూశారని, తాను అడ్డుకున్నానని ఆయన అంటున్నారు. 

ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఆ ఘటన జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాని, టిడిపి నేతలు కాని ఇలాంటి ఆరోపణ చేయలేదు. కాని ఇప్పుడు ఎబి చేస్తున్నారంటే దాని మతలబు ఏమిటి? అది నిజమే అయితే ఆయన తన బాధ్యతను సరిగా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టి ఉండాల్సింది కదా? ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్నదానికి జవాబు చెప్పవలసి ఉంటుంది. 

ముఖ్యమంత్రి వైఎస​్‌ జగన్ పై సిబిఐ , ఈడి చార్జీషీట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఇది ఎబి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు. ఆ కేసులు ఎలా వచ్చాయో అందరికి తెలిసిందే. కేసుల పేరుతో ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆ తరువాత ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి, ప్రజానీకాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి అయ్యారు. 

ఎబి కూడా అలాగే ప్రజల వద్దకు వస్తారేమో తెలియదు. ప్రభుత్వాన్ని పగడొడతానంటూ తానేమీ కామెంట్ చేయలేదని చెబుతున్న ఆయన టిడిపి హయాంలో 23 మంది వైసిపి ఎమ్మెల్యేల కొనుగోలు లావాదేవీలలో ప్రమేయం కలిగి ఉన్నారని వైసిపి పలుమార్లు ఆరోపించింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. తనకు సంబందం లేదని ఆయన చెబుతుండవచ్చు. 
చదవండి👉‘కుప్పంలో సత్తా చూపిస్తాం.. రాజీనామా చెయ్యి’.. చంద్రబాబుకు మంత్రి నాగార్జున సవాల్‌

వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసు. ఆయన అంతరాత్మకు తెలియకుండా ఉంటుందా? దుర్మార్గుడైన రాజు పాలనలో పనిచేయడం కన్నా అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదన్న కవి మాటలను ఆయన అసందర్భంగా చెప్పినట్లు అనిపిస్తుంది. వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై ఆయనకు కోపం ఉండవచ్చు. కాని ద్వేషపూరితంగా మాట్లాడకూడదు. 

నిజంగానే అలా వ్యవసాయం చేయదలిస్తే షంషేర్ గా చేసుకోవచ్చు. అలాకాకుండా తన ఉద్యోగం కోసమే ఆయన ఎందుకు పాకులాడుతున్నట్లు? ఎన్నో వెధవ పనులు అడ్డుకోవడం వల్లే తాను టార్గెట్ అయ్యానని ఆయన చెప్పారు. మంచిదే. మరి తుని రైలు దగ్దం ఘటనను, టిడిపి లో చేరిన అప్పటి వైసిపి ఎమ్మెల్యే , అలాగే మాజీ ఎమ్మెల్యే లు నక్సల్స్ చేతిలో హత్యకు గురికాకుండా అడ్డుకోగలిగి ఉంటే మంచి పేరు వచ్చేదికదా? 

ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి వద్ద పుష్కర ఘాట్ లో స్నానం చేస్తున్న సందర్భంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన ఘటనను ఎబి ముందుగా నివారించగలిగి ఉంటే చాలా మంది ప్రాణాలు నిలబడేవి కదా? తిరుపతిలో ఇరవై మంది ఎన్ కౌంటర్ కాకుండా వారిని చట్టపరంగా శిక్షించేలా ఎబి ప్రయత్నించి ఉంటే  అప్పుడు  ఏ వెధవ పనులనైనా అడ్డుకున్నారన్న మంచి పేరు వచ్చేది కదా? 

తెలుగుదేశం యువత అధ్యక్ష పదవికి సంబంధించి ఎబి తో సంప్రదించినట్లు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పినట్లు వచ్చిన వీడియో సంగతి ఏమిటి? తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా తప్పని నిరూపిస్తానని ఆయన అనవచ్చు. అలా చేయగలిగితే ఆయనకు గుర్తింపు కూడా వస్తుంది. కాని ఆ పని మీద ఉండకుండా రాజకీయంగా మాట్లాడడంలోని ఆంతర్యం ఏమిటన్నదానిపై ఎవరికి వారు ఊహించుకోవచ్చు. 

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు 

మరిన్ని వార్తలు