సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఎన్ని మార్పులు.. ఎన్ని సంస్కరణలు

26 May, 2023 11:11 IST|Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అప్పుడే నాలుగేళ్లు అయిందా అనిపిస్తుంది. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్ని మార్పులు, ఎన్ని సంస్కరణలు, ఎన్ని స్కీములు, ఎన్ని పోర్టులు.. అన్నిటిని గమనిస్తే జగన్ సమర్ధత, కార్యదక్షత, కార్యదీక్ష స్పష్టంగా కనపడతాయి. మద్యలో రెండేళ్ల పాటు కరోనా సంక్షోభం వచ్చినా జగన్ తన పట్టుదల వీడకుండా కార్యక్రమాలు అమలు చేసిన తీరు అబ్బురపరుస్తుంది. 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి, 2019 నుంచి పాలన చేస్తున్న వైఎస్ జగన్ కు ఉన్న తేడా ఏమిటి? ఎవరు హామీలు నెరవేర్చారు? ఎవరు కొత్త విధానాలు తెచ్చారు? ఇలాంటివన్నిటిని పరిశీలిస్తే జగన్ మొత్తం డామినేట్ చేశారన్న విషయం ఇట్టే బోధపడుతుంది. అదెలాగో చూద్దాం.

చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మానిఫెస్టోలో వందల వాగ్దానాలతో పాటు రైతుల వ్యవసాయ రుణాలను మాఫి చేస్తామని, బ్యాంకులలో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిస్తామని ప్రకటన చేశారు. చాలా మంది దానికి ఆకర్షితులయ్యారు. తత్పలితంగా ఆయనకు విజయం కూడా సిద్దించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఆయన దానిని అమలు చేయలేకపోయారు. పైగా రైతులను ఆశపోతులని విమర్శించారు.సుమారు 400 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆ మానిఫెస్టోని పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించారు. 2019 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మానిఫెస్టోలో వివిధ హామీలు ఇవ్వడమే కాకుండా అధికారంలోకి వచ్చాక ౯98.5 శాతం అమలు చేసి చూపి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అన్న మాటను నిలబెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మానిఫెస్టోని సచివాలయంలో మంత్రులు, అధికారులకు ఇచ్చి దానిని అమలు చేయాలని స్పష్టం చేశారు.

అంతే తప్ప దానిని వెబ్ సైట్ నుంచి తొలగించలేదు. రైతులకు ఇస్తానన్న భరోసా నిధులను ప్రతి సంవత్సరం ఇస్తున్నారు.అదొక్కటే కాదు. ఆయన ఏవైతే చెప్పారో... అమ్మ ఒడి, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ, స్కూళ్ల నాడు-నేడు.ఆస్పత్రుల నాడు-నేడు, రైతు భరోసా కేంద్రాలు, ప్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ డిజిటల్ లైబ్రరీ, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టడం వైఎస్ ఆర్ చేయూత, వైఎస్ ఆర్ నేస్తం తదితర పేర్లతో ఎన్నో విన్నూత్నకార్యక్రమాలు తీసుకు వచ్చారు. చంద్రబాబు టైమ్ లో జన్మభూమి కమిటీలు ప్రజలను వేదించేవి. అవినీతికి అలవాలంగా ఉండేవి .చివరికి రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇవ్వవలసి వచ్చేది. తెలుగుదేశం కు మద్దతు ఇస్తేనే ప్రభుత్వ స్కీమ్ ఇస్తామని ఆ రోజుల్లో చెప్పేవారు.

జగన్ పాలనలో అందుకు భిన్నంగా కంప్యూటర్లో బటన్ నొక్కగానే లబ్దిదారులకు నేరుగా ఆర్దికసాయం అందుతోంది. ఇక్కడ పార్టీ తేడా లేదు. కులం, మతం, ప్రాంతం ఏ గొడవా లేదు. నేరుగా బ్యాంక్ ఖాతాలలో డబ్బు చేరుతుండడంతో పైసా అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది.చంద్రబాబు పాలనలో వృద్దులు ఎమ్.ఆర్.ఓ ఆఫీస్ ల వద్ద తమకు వచ్చే కొద్దిపాటి పెన్షన్ కోసం గంటలు, కొన్నిసార్లు రోజుల తరబడి పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. జగన్ పాలన రాగానే వృద్దాప్య పెన్షన్ ను వారి ఇళ్లకే చేర్చడం ఆరంభం అయింది. ఇందుకోసం వలంటీర్ల వ్యవస్థను సమర్ధంగా వినియోగిస్తున్నారు.రేషన్ ను కూడా ప్రజలు తమ ఇళ్ల వద్దే పొదగలుగుతున్నారు. చంద్రబాబు టైమ్ లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం పెద్దగా జరగలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక రికార్డు. చంద్రబాబు అమరావతి పేరుతో రాజధాని గ్రామాలలో రియల్ ఎస్టేట్ వెంచర్ నపడాలని యోచిస్తే, కేవలం ధనికుల ప్రదేశంగా మార్చాలని తలపెడితే, జగన్ వచ్చాక రాజధాని ప్రాంతంలో పేదలకు అవకాశం ఉండాలని తలపెట్టి ఏభైవేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మరో రికార్డు సృష్టించారు.

విద్య అన్నది ప్రభుత్వ బాద్యత అని జగన్ భావిస్తే, విద్యను ప్రైవేటు రంగం చూసుకోవాలన్నది చంద్రబాబు అబిప్రాయం. దాంతో పేదలు అప్పుడు విద్యకు దూరం అయ్యే పరిస్థితి అప్పుడు ఏర్పడితే, ఇప్పుడు పేదలు సైతం చదువుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వ స్కూళ్ళు సరైన సదుపాయాలు లేక చంద్రబాబు పాలనలో కునారిల్లితే , ప్రస్తుత జగన్ పాలనలో అవి అన్ని సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. స్కూళ్లలో వాష్ రూమ్స్ లో ఫైవ్ స్టార్ స్థాయిలో పరికరాలు ఏర్పాటు చేశారంటేనే అవి ఏ రకంగా అభివృద్ది చెందుతున్నాయో అర్ధం అవుతుంది. పరిశ్రమల రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరసగా గత మూడేళ్లుగా మొదటి స్థానం సాధిస్తోంది.

విశాఖలో చంద్రబాబు పెట్టుబడుల సదస్సులలో ఎవరు పడితే వారు కోటు,బూటువేసుకుని పారిశ్రామికవేత్తల మాదిరి వ్యవహరిస్తే, జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సులో రిలయన్స్ , అదాని సంస్థల అధినేతలు ముకేష్ అంబానీ,కరణ్ అదాని వంటివారు పాల్గొని నిండుదనం తెచ్చారు. చంద్రబాబు టైమ్ లో సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెట్ చేస్తే, జగన్ ప్రస్తుతం తీర ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించి కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ లు నిర్మిస్తున్నారు. వీటికి తోడు భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి శంకుస్థాపన చేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే కేంద్రం నుంచి ఏకంగా పదిన్నర వేల కోట్ల రూపాయల నిధులు సాధించి జగన్ సరికొత్త చరిత్ర నెలకొల్పారు. ఇలా పోల్చుకుంటూ పోతే జగన్ కు, చంద్రబాబుకు హస్తిమశకాంతమంత తేడా కనిపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు