స్కాముల్లో ఈ ఇద్దరి పాత్ర.. చంద్రబాబు చీకటి కోణం ఇది!

17 Feb, 2024 13:35 IST|Sakshi

"తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఖర్చు కోసం నల్లధనాన్ని సమీకరీస్తున్న వైనం, వడ్డీకి అప్పులు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీని చంద్రబాబు నాయుడు  కైవసం చేసుకున్న తర్వాతే ఎన్నికలలో ధన వ్యయం విపరీతంగా పెంచేశారు. ఆ రోజుల్లో ఎన్‌టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి లాగేసి తాను ముఖ్యమంత్రి అయ్యాక వచ్చాక జరిగిన కొన్ని ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితిలోను గెలవవలసిన అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు  ఓటర్లకు 500 రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారన్నది ఆరోపణ కాదు.. వాస్తవం అని చాలామంది నమ్ముతారు."

1996లో జరిగిన అత్తిలి ఉప ఎన్నికలో  కొందరు టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంచవద్దని సూచించినా, చంద్రబాబు రిస్క్ తీసుకోలేమని చెప్పి స్వీట్ బాక్స్ తో సహా డబ్బులు పంపిణీ చేశారని ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న అప్పటి మంత్రి ఒకరు చెప్పారు. ఆ ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచిన దండు శివరామరాజు మాట్లాడుతూ ఈ డబ్బు ఖర్చేమిటి? అయ్యబాబోయ్ .. ఉప ఎన్నికలో ఈ రకంగా వ్యయం చేస్తే, జనరల్ ఎన్నికలో  నా  పరిస్థితి ఏమిటి? ఈ స్థాయిలో డబ్బు చంద్రబాబు ఇస్తారో, ఇవ్వరో తెలియదు.. అని స్వయంగా నాతోనే అన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో సిద్దహస్తుడని చెబుతుంది.

దొరకకుండా స్కామ్‌లు చేయడంలో కూడా చంద్రబాబు  దిట్టే అని అంతా నమ్ముతారు. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తూ తాను టెక్నికల్‌గా, లీగల్‌గా దొరకనని చెబుతుంటారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ స్థాయిలో డబ్బు రావడం కష్టం కనుక ఎన్నికల సమయంలో డబ్బు పోగు చేయడానికి రకరకాల మార్గాలను ఆయన ఎంచుకుంటారు. అందులో ఒకటి తన మద్దతుదారులైన బడా పెట్టుబడి దారుల నుంచి డబ్బు సమీకరించడం, అందులో అత్యధిక భాగం నల్లధనం అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. అమెరికా వంటి దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులలో టీడీపీ మద్దతుదారులు, సామాజికంగా  టీడీపీపై ఆసక్తి ఉన్న వారి నుంచి డబ్బు హవాలా ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో ధనం పోగు చేస్తుంటారు.

2019 ఎన్నికల సమయంలో పవర్‌లో ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐల నుంచి కూడా తిరిగి ఇచ్చివేసే ప్రాతిపదికన డబ్బు తీసుకున్నారని, ఓటమి ఎదురవడంతో వారిలో పలువురికి తిరిగి ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంటుంది. దీనిలో నిజం ఉందో, లేదో తెలియదు కాని టీడీపీ వర్గాలే ఈ విషయాలపై చర్చించుకుంటాయి. మరో కొత్త మార్గం ఏమిటంటే తనను నమ్మిన ప్రముఖ విద్యా సంస్థల అధినేతల నుంచి డబ్బు వచ్చేలా చూసుకోవడం. అందులో భాగంగానే నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ ద్వారా నల్లధనం పెద్ద ఎత్తున వచ్చేలా చూస్తుంటారని అంటారు. దీనిని నిర్ధారణ చేస్తూ మీడియాలో కథనం వచ్చింది.

నారాయణ తనకు తెలిసిన వ్యాపారులు, మార్వాడీల నుంచి ఐదు రూపాయల వడ్డీకి రుణం రూపేణా డబ్బు స్వీకరించారట. సుమారు 600 కోట్ల రూపాయల మేర ఇలా జమచేసి, దానిని రహస్య స్థలానికి తరలించారట. 2014లో సైతం నారాయణ తన కాలేజీ సిబ్బందిని, విద్యార్దులను ఎన్నికల ప్రచారానికి, డబ్బు పంపిణీకి వాడుకున్నారు. 2019 లో రెండు రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పి 300 కోట్లు పోగుచేశారట. ఈసారి అది ఐదు రూపాయల వడ్డీగా మార్చి వ్యాపారులను ఆకర్షించే యత్నం చేశారట. మీడియాలో వచ్చిన ఈ కథనాలను ఆయన ఎందువల్లో ఖండించలేదు.

2014లో నారాయణ పెట్టిన ఖర్చులకు ప్రతిఫలంగానే ఆయనను మంత్రిగా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చంద్రబాబు చూసుకున్నారని అంటారు. చంద్రబాబు, నారాయణలు అమరావతి రాజధాని భూ స్కామ్‌లో కూడా నిందితులుగా కూడా ఉన్నారు. రాజధాని గ్రామాలలో 58 ఎకరాలను నారాయణ తన బినామీల ద్వారా కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈసారి  టీడీపీ గెలిస్తే, ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఆర్ధిక వనరులను కూడా భారీగా సమకూర్చుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది.

ఇప్పుడు తాజాగా వచ్చిన మరో కథనం ప్రకారం చంద్రబాబు తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్‌ను కూడా నల్లధనం మార్పిడికి బాగానే వాడుకున్నారని మీడియాలో ప్రచారం అయింది. దీని ప్రకారం చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో రోహిత్ 13 సినిమాలు తీశారు.  అంతకు ముందు మూడు, నాలుగు సినిమాలకే పరిమితం అయ్యారు. 2019 తర్వాత దాదాపు సినిమాలు తీయలేదట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల పైగా వ్యయం చూపించారట. నిజానికి ఆ సినిమాలకు నాలుగైదు కోట్లకు మించి వ్యయం కాదని సినీరంగ ప్రముఖులు చెబుతుంటారు. అంటే ఆ మేర నల్లధనానికి లెక్కలు తయారు చేయడానికి ఈ సినిమాలను అడ్డుపెట్టుకున్నారన్నది అభియోగంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా పదమూడు సినిమాలు తీసిన వ్యక్తి, ఈ ఐదేళ్లలో ఒక్క సినిమా కూడా తీయకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది సోషల్ మీడియాలో వస్తున్న  ప్రశ్న. ఇందులో నిజం ఉంటే మాత్రం ఆందోళనకరమైనదే. అవినీతికి సినిమాల ముసుగు వేస్తున్నారని అర్ధం అవుతుంది.

ఈసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలతో విపరీత ప్రచారం చేయిస్తూ, గెలుస్తామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నిధుల వసూళ్ల కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విడత ఎన్నికలు టీడీపీకి చావో, రేవో తేల్చేవిగా అంతా అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వివిధ పార్టీలను తనవెంటబెట్టుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు.

బీజేపీతో కాపురం చేస్తున్న జనసేన అక్కడనుంచి లేచి వచ్చేలా చేయగలిగారు. కాంగ్రెస్‌తో పరోక్ష స్నేహం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు సాయం చేయడం కోసం పోటీ నుంచే తప్పుకున్న సంగతి తెలిసిందే. సీపీఐ ఏపీ శాఖ ఎప్పటి నుంచో టీడీపీకి తోకగా మారింది. ఇక బీజేపీని కూడా కాకా పట్టడానికి ఢిల్లీ వెళ్లి నానా పాట్లు పడ్డారు. బీజేపీ పెద్దలు రకరకాల షరతులు పెట్టడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఒక వైపు ధన సమీకరణ, మరోవైపు ఆయా రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష, పరోక్ష ఎత్తుల వ్యూహాలతో చంద్రబాబు రాజకీయం సాగిస్తున్నారు. అయినా సఫలం అవుతానన్న నమ్మకం రాక ఆయన బెంబేలెత్తిపోతున్నారు.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

whatsapp channel

మరిన్ని వార్తలు