మళ్లీ సెంటిమెంట్ వైపు తెలంగాణ రాజకీయాలు

13 Feb, 2024 14:31 IST|Sakshi

తెలంగాణలో రాజకీయాలు మళ్లీ సెంటిమెంట్ వైపు నడుస్తున్నట్లున్నాయి. శాసనసభలో కృష్ణా జలాల వాటాకు సంబంధించి, ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించే అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య జరిగిన వాగ్యుద్దం చూస్తే గాలిలో కత్తులు తిప్పుతున్నట్లుగా కనిపించింది. ఇరుపక్షాలు ఒకదానిపై మరొకటి అప్పర్ హ్యండ్‌ అవడానికి గట్టి ప్రయత్నమే చేశాయి. వీరిద్దరు కాకుండా భారతీయ జనతా పార్టీ, ఎమ్‌ఐఎమ్‌లు కొంత ప్రాక్టికల్‌గా మాట్లాడారు. సీపీఐ మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పై పరోక్ష విమర్శలు చేశారు.

ఈ క్రమంలో రాయలసీమకు నీటిని పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ చేస్తున్న కృషిని ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం గుర్తించకపోయినా, తెలంగాణ రాజకీయ పక్షాలు అకనాలెడ్జ్ చేసినట్లు  అనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వృధాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఏపీకి రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో తీసుకోవడానికి గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను తలపెట్టారు.

కాని కొందరు ఎన్‌జీటీకి వెళ్లి నిలుపుదల చేయించారు. ఇందులో ఏపీలో విపక్ష తెలుగుదేశం పరోక్ష పాత్ర ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ అంశాన్ని పక్కనబెడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, సాగర్ తదితర ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించడానికి అంగీకరించిందంటూ బీఆర్‌ఎస్‌ వివాదం చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆద్వర్యంలో నల్గొండలో సభ జరపతల పెట్టిన నేపధ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ చేపట్టి శాసనసభలో ఏభై శాతం నీటి వాటా ఇచ్చేవరకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ఒక తీర్మానాన్ని పెట్టింది. ఆ తీర్మానానికి బీఆర్‌ఎస్‌తో సహా వివిధ పార్టీలు ఆమోదం తెలిపాయి.

బీఆర్‌ఎస్‌ మాత్రం ఆ తీర్మానంలో తమ గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను తొలగించాలని డిమాండ్ చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎమ్‌బీ) కు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, దానికి ముందు తెలంగాణకు కూడా కృష్ణా జలాలలో ఏభై శాతం ఇవ్వాలని తెలంగాణ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎమ్‌సీల నీటిని కేటాయించారు. రెండు రాష్ట్రాలలో ఉన్న  ప్రాజెక్టుల ఆధారంగా, ఇతర ప్రాధాన్యాల ఆధారంగా తెలంగాణకు 299 టీఎమ్‌సీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎమ్‌సీలు నీటిని వాడుకునే అవకాశం కల్పించారు.

రాష్ట్ర విభజన సమయంలో దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధన ముఖ్యం అంతా భావించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావిస్తారు. ఇప్పుడు అదే నీటి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు రాజకీయ లబ్ది పొందడానికి యత్నించాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఈ సెంటిమెంటును వాడుకోవడానికి ఈ రెండు పార్టీలు ఇప్పటినుంచే కృషి చేస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని బీఆర్‌ఎస్‌ తప్పుపడుతుంటే, ఆ మొత్తం తప్పంతా బీఆర్‌ఎస్‌ దేనని కాంగ్రెస్ బుట్ట బోర్లవేస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ ఎప్పుడెప్పుడూ ఏమి జరిగింది? చెప్పే యత్నం చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఎఫెక్స్ కమిటీ సమావేశంలో కృష్ణా జలాలలో తెలంగాణకు 299 టీఎమ్‌సీలు వాటానీటికి, ఏపీకి 511 టీఎమ్‌సీలు నీరు ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌  అంగీకరించారని  ఉత్తమ్‌ తెలిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్‌ వద్ద పనిచేసిన ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజక్టులను అప్పగించడానికి అంగీకరిస్తూ లేఖ రాశారని, దానిని ఆమోదించడం లేదని, ఏభై శాతం నీటి వాటాకు ఒప్పుకుంటేనే బోర్డుకు అప్పగిస్తామని ఉత్తమ్‌ చెప్పారు.

ఈ క్రమంలో నీటి పారుదల శాఖను కేసీఆర్‌ నాశనం చేశారని, వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఉత్తమ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మొత్తం తప్పు బీఆర్‌ఎస్‌దే తప్పు అని రుజువు చేయడానికి మంత్రి వాదన వినిపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ సామర్ధాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కులకు పెంచుకోగలిగారని, అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 8 టీఎమ్‌సీలు తీసుకువెళ్లే స్కీమ్‌ను చేపట్టారని ఆయన అన్నారు.

కాగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షనేత కేసీఆర్‌ ఎందుకు సభకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయన వచ్చి ఇంతటి ముఖ్యమైన విషయంపై మాట్లాడాలి కదా అని అన్నారు. ఈ చర్చలో పాల్గొంటూ  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత హరీష్‌రావు తమ పార్టీపై నెపం వేయడానికి మంత్రి వక్రీకరణ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టులను కేఆర్ఎమ్‌బీకి అప్పగించడానికి  అంగీకరిస్తూ అధికారులు లేఖ రాశారని ఇటీవలవరకు ఉన్న ఈఎన్‌సీ మురళీదర్ బోర్డు సమావేశం తర్వాత చేసిన వ్యాఖ్యల వీడియోను హరీష్ ప్రదర్శించారు.

దానికి ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి జోక్యం చేసుకుంటూ ఆయన బీఆర్‌ఎస్‌ ఏజెంట్ అని అందుకే తీసివేశామని, మరికొందరు ఏజెంట్లు ఉన్నారని, వారిపై కూడా చర్య తీసుకుంటామని అన్నారు. హరీష్ రావు, మరో నేత కడియం శ్రీహరిలు 299 టీఎమ్‌సీల కేటాయింపు తమకు సంబంధం లేనిదని, గతంలో ట్రిబ్యునల్ చేసిందని  వివరించే యత్నం చేశారు. మంత్రి ఉత్తమ్‌ ఆ విషయాన్ని దాటవేస్తూ మాట్లాడడం విశేషం. అలాగే కేసీఆర్‌ సభకు రాని అంశాన్ని హరీష్‌రావు సమాదానం చెప్పకుండా దాటవేశారు.

నిజానికి తెలంగాణకు కేటాయించిన 299 టీఎమ్‌సీల నీటిని పూర్తిగా వాడుకోగలిగితే ముప్పై లక్షల ఎకరాలు సాగు చేయవచ్చు. కాని ఇంకా ఆ పరిస్తితి రాలేదు. అంతేకాక కృష్ణానదికి నీరురావడం ఆరంభం అయిన వెంటనే కల్వకుర్తి వంటి లిఫ్ట్ స్కీమును ఆపరేట్ చేసి నీటిని తీసుకోవచ్చు. వీటన్నిటినీ విస్మరించి, కేఆర్ఎమ్‌బీ ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఏదో నష్టం జరుగుతుందన్న చందంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు చర్చను జరిపారయి. ఇది పరస్పరం విమర్శలకే ఉపయోగపడుతుంది. కేసీఆర్‌ కూడా ఎన్నికలలో పరాజయం తర్వాత తొలిసారి నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యపైనే భారీ సభలో మాట్లాడబోతున్నారు.

అంటే తెలంగాణ సెంటిమెంట్ తమతోటే ఉండేలా వారుప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవాలి. దీనిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారిన వైనం, అవినీతిపై ఫోకస్ పెట్టింది. కాగా బీజీపీ సభ్యుడు మహేష్  రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు ఘర్షణ పడే పరిస్తితి ఉన్నప్పుడు కేఆర్ఎమ్‌బీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తప్పేముందని అభిప్రాయపడ్డారు. బోర్డుకు ప్రాజెక్టులకు అప్పగించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? లాభం ఏమిటన్న దానిపై ఆలోచించాలని సూచించారు. కాంగ్రస్, బీఆర్‌ఎస్‌లు ఈ కోణంలో కాకుండా పరస్పరం నిందలు మోపుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాయి.

ఎమ్‌ఐఎమ్‌ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ విభజన చట్టం చేసినప్పుడే తాము ఈ సమస్యలు వస్తాయని చెప్పామని గుర్తు చేశారు. కానీ అప్పట్లో ఏ రాజకీయ పార్టీ దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టులకు ఎంత నీరు అవసరమో, అంతమేర నీటిని పొందడానికి యత్నించడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్‌లో ఈ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఏభై శాతం కృష్ణానది జలాలలో వాటా ఇవ్వాలన్న డిమాండ్‌కే పరిమితం అయ్యారు. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆయా పార్టీలు దీనిని ఒక నినాదంగా తీసుకోవాలని చూస్తున్నాయి.

ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఇప్పటికే సభలు, ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది. దానిని తిప్పి కొట్టడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ప్లాన్ చేశారు. కర్నాటక రాష్ట్రం తుంగభద్ర నదిపై కడుతున్న కొత్త ప్రాజెక్టు, వర్షాభావ పరిస్థితిలో కృష్ణానదికి నీటి కొరత ఏర్పడుతున్న విషయాన్ని కూడా ఆయా సభ్యులు ప్రస్తావించారు.

ఇంకో సంగతి చెప్పాలి. కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు గతంలో భేటీ అయిన సందర్భాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అప్పట్లో గోదావరి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించే ఒక స్కీమును కేసీఆర్‌ ప్రతిపాదించారు. దానికి తొలుత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సముఖత వ్యక్తం చేశారు. అప్పుడు ఏపీ శాసనసభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించారని అంటూ ఉత్తంకుమార్ రెడ్డి ఒక వీడియోని ప్రదర్శించారు. నిజానికి అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్‌గా దానిని చూపారు. ఆ తర్వాత రోజులలో ఏపీ ప్రభుత్వం ఆ స్కీముపై వెనక్కి తగ్గింది.

నిజానికి దానివల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం.దానిని గుర్తించే ఏపీ వెనక్కి తగ్గింది. కానీ ఉత్తమ్‌ మాత్రం అదేదో ఏపీకి కేసీఆర్‌ మేలు చేసేసినట్లు పిక్చర్ ఇచ్చారు. అలాగే ఒకసారి కుటుంబంతో సహా కంచి వెళుతూ  కేసీఆర్‌ మధ్యలో నగరిలో ప్రస్తుత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి భోజనం చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని రాయలసీమకు తరలించగలిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. దానిని వక్రీకరిస్తూ కేసీఆర్‌ ఏదో రాయలసీమకు నీళ్లు ఇస్తానని అన్నట్లు ఉత్తమ్‌, తదితర కాంగ్రెస్ సభ్యులు చెప్పడం విశేషం.

తెలంగాణతో పోల్చితే ఏపీలో విస్తీర్ణం ఎక్కువ సాగు భూమి ఎక్కువ. జనాభా ఎక్కువ. నది దిగువ ప్రాంతం కావడంతో వరదలు వచ్చినా భరించేది ఆ రాష్ట్రమే. అలాగే మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే ఏపీ వాడుకోవల్సిన పరిస్థితి పలుమార్లు వస్తోంది. శ్రీశైలంలో నీటి కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ  ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదలివేస్తుంటుంది. తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ చెప్పినట్లు కృష్ణాపై పది అనుమతి లేని ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటికి శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్నా లిప్ట్ ద్వారా నీటిని తీసుకువెళతారు.

అదే ఏపీ వైపు నీటి మట్టం 854 ఉంటేనే అది కూడా వరద నీటినే  తరలించుకోగలుగుతారు. కొన్నిసార్లు తన వాటా నీటిని కూడా వాడుకోలేకపోతున్నామని ఏపీ వాదన. ఈ నేపధ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోత స్కీమ్‌ను చేపట్టింది. అయితే ఈ విషయాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు ఏపీతో సమానంగా నీటి వాటాను డిమాండ్ చేస్తూ చర్చలు జరిపారు. చివరికి దీనిని ఎంత సెంటిమెంటుగా మార్చుతారో తెలియదు కానీ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సభ్యులు మాత్రం గాలిలో కత్తులతో పోరాటం చేసినట్లే అనిపించింది.


– కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

whatsapp channel

మరిన్ని వార్తలు