కారు కౌంటర్ అటాక్.. కేంద్ర మంత్రి అమిత్‌ షాపై విరుచుకుపడిన టీఆర్‌ఎస్‌ నేతలు

16 May, 2022 00:55 IST|Sakshi

ఒకరి తర్వాత మరొకరుగా మాటలతో దాడి  

తుక్కుగూడలో తుక్కు మాటలంటూ మండిపాటు

మోదీపైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన మంత్రులు

అసమర్థ ప్రధాని వల్లే దేశం అప్పుల పాలు 

దద్దమ్మకు అధికారం ఇవ్వడంతో ధరలు పెరిగిపోతున్నాయ్‌ 

30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఆందోళనకరంగా ద్రవ్యోల్బణం 

45 సంవత్సరాల్లో ఎన్నడూ చూడనంతగా నిరుద్యోగం 

మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన కేటీఆర్‌ 

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌ నేతలు విరుచుకుపడ్డారు. అదే సమయంలో ప్రధాని మోదీపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. జూటేబాజ్, బట్టేబాజ్‌లంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం తుక్కుగూడ సభలో టీఆర్‌ఎస్‌ పాలనపై అమిత్‌ షా చేసిన విమర్శలు, ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఆదివారం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు నేతలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌ మాటల దాడి చేశారు. అమిత్‌ షాను అబద్ధాల బాద్‌షాగా అభివర్ణించారు. రాష్ట్రం గురించి పచ్చి అబద్ధాలు వల్లె వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని చేతగాని దద్దమ్మ అని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్‌ విసిరారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ దాడిని తిప్పి కొట్టేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మాటల తూటాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.  

సాక్షి, హైదరాబాద్‌: అసమర్థుడైన ప్రధానమంత్రి ఉండడం వల్లే దేశం అప్పుల పాలైందని, చేతకాని దద్దమ్మకు అధికారం ఇవ్వడంతో దేశంలో ధరలు భగభగమంటున్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఆందోళనకరంగా ద్రవ్యోల్బణం ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా గ్యాస్‌ సిలిండర్‌ ధర మన దగ్గర ఉందని, పెట్రోల్, డీజిల్‌ ధరలకు అదుపే లేదని విమర్శించారు. 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు దేశంలో ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్‌ హయాంలో రూ.56.69 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఎన్‌డీఏ హయాంలోని ఎనిమిది సంవత్సరాల్లోనే రూ.100 లక్షల (కోటి) కోట్లు అప్పులు చేసిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సామాన్యుల నుంచి రూ.26.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేసిన మోదీ ప్రభుత్వం, ఇందులో నుంచి రూ.11.68 లక్షల కోట్ల మేరకు తన కార్పొరేట్‌ మిత్రుల బ్యాంకు రుణాలు మాఫీ చేసిందని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పైనా నిప్పులు చెరిగారు. నాలాయక్, జూటేబాజ్‌లంటూ మోదీ, షా పై తీవ్ర విమర్శలు చేశారు. వారిని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ముఖ్యాంశాలు కేటీఆర్‌ మాటల్లోనే..  
ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ 

సింగరేణినీ అమ్మేసేటట్టున్నారు 
ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో చాయ్‌ అమ్ముకున్న వ్యక్తికి ప్రధాని పదవి ఇస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్లనే అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్న మోదీ ప్రభుత్వం.. విశాఖ ఉక్కు సంస్థను అమ్మేసింది. త్వరలో సింగరేణిని కూడా అమ్మేసేటట్టున్నారు. మత రాజకీయాలతో మభ్య పెట్టడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు. 

అప్పుల్లో ముందుంది బీజేపీ పాలిత రాష్ట్రాలే.. 
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేరు అబద్ధాల బాద్‌షా అంటే సరిగ్గా ఉంటుంది. తుక్కుగూడకు వచ్చిన ఆయన అన్నీ తుక్కు మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పి వెళ్లారు. తెలంగాణ అప్పుల పాలైందని షా అంటున్నాడు. అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కింది నుంచి ఐదో ది. పైన ఉన్న రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. డబుల్‌ ఇంజన్‌ అని మాటిమాటికీ చెప్పే బీజేపీ నేతలు.. డబుల్‌ ఇంజన్‌ ఉన్న రాష్ట్రాల్లో ఏం సాధించారో చెప్పాలి. ఆ రాష్ట్రాల్లో అప్పులు తప్ప చెప్పుకోడానికి ఇంకేం లేవు. మోదీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్‌లో తాగునీటికి కటకట ఉంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే.. రాష్ట్రానికి ఇచ్చింది 1.68 లక్షల కోట్లు మాత్రమే. 

షా మాటలకు జనం నవ్వుకుంటున్నారు 
మోదీ హయాంలో కేవలం కార్పొరేట్‌ మిత్రులకు మాత్రమే అచ్ఛేదిన్‌. సామాన్యులకు మాత్రం చచ్చేదిన్‌. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లతో నిరుద్యోగ యువతను ప్రోత్సహిస్తుంటే కేంద్రం.. ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తూ ప్యాకప్‌ చెబుతోంది. అమిత్‌ షా నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. అబద్ధాల బాద్‌షాకు వాటి గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఇక్కడి నేతలు తమకు తోచిన స్క్రిప్ట్‌ రాసిస్తే ఆయన చదివి వెళ్లిపోయాడు. కేంద్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీల గురించి మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు. 

బీజేపీవన్నీ జూటా, బట్టేబాజ్‌ మాటలే..
రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను యాభై పెసలు పెంచితే లొల్లి చేస్తున్న బీజేపీ నేతలు.. గుజరాత్‌లో 5 నెలల్లో ఐదుసార్లు కరెంటు బిల్లులు పెం చితే ఏం చేస్తున్నారు? బీజేపీ నేతలు చెప్పేవన్నీ జూటా మాటలు, బట్టేబాజ్‌ మాటలే. నాలాయక్, జూటేబాజ్‌లు ఏంచేసినా చెల్లుతుందనే భావనలో ఉన్నారు. వారిని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్రంలో సరైన సమయంలోనే ఎన్నికలు జరుగుతాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వస్తే మేము కూడా అసెంబ్లీని రద్దు చేసి బరిలో దిగుతాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అడిగే ప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్‌తో సమాధానం చెప్పిస్తాం.   

మరిన్ని వార్తలు