ముడిచమురు ధర తగ్గినా పెట్రో ధరలు తగ్గించరా?

25 Aug, 2022 05:51 IST|Sakshi

కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌

జనం నుంచి దోచుకుని కార్పొరేట్‌ పెద్దలకు మాఫీ చేస్తోంది

మధ్యతరగతిపై ప్రధాని మోదీకి ఏమాత్రం ప్రేమలేదు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్‌ ధర వంద డాలర్లకు దిగువన ఉన్నా.. ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ధరలు తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు ఉపశమనం కలిగించకుండా, ఎక్సైజ్‌ సుంకాలు, సెస్సులను కేంద్రం భారీగా పెంచుతోందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

పెట్రో ఉత్పత్తులపై పన్నులు, సెస్సుల రూపంలో జనం నుంచి దోచుకున్న రూ.26 లక్షల కోట్లను కార్పొరేట్‌ పెద్దల రుణాలు మాఫీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ఉపయోగిస్తోందని, కాయకష్టం చేసుకునే దిగువ, మధ్య తరగతి వర్గాలపై మోదీకి ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు. ధరల అదుపులో విఫలమైన విషయాన్ని మోదీ ఒప్పుకోవాలన్నారు. 2014లో 110 డాలర్లుగా ఉన్న ముడిచమురు బ్యారెల్‌ ధర.. 2015 జనవరిలో 50 డాలర్లు, 2016 జనవరిలో 27 డాలర్లకు పడిపోగా, 2020 కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఏకంగా 11 డాలర్లకు పడిపోయిందన్నారు. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడూ పెట్రో ధరలు తగ్గించిన పాపాన పోలేదన్నారు. 

ముక్కుపిండి వసూలు చేశారు..
పెట్రో ధరలను పెంచడం ద్వారా ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోదీ సర్కార్‌ దానిని మరింత పెంచుకునే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని గరిష్టంగా పెంచుకునేందుకు 2020 మార్చిలో చట్ట సవరణ చేసిందని కేటీఆర్‌ విమర్శించారు. కోవిడ్‌ మహమ్మారితో ప్రజలు ఆర్థికంగా చితికి పోయి ఉన్న సమయంలో కనీస కనికరం లేకుండా 2020 నాటికే ఒక్క ఎక్సైజ్‌ సుంకం రూపంలోనే సుమారు రూ.14 లక్షల కోట్లను మోదీ ప్రభుత్వం ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందన్నారు.

రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే వ్యూహంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే ఎక్కువగా పెట్రో రేట్లను పెంచి కేంద్రం తన ఖజానా నింపుకుంటోందన్నారు. కేంద్రం విధించిన పెట్రో సుంకాలను ఎత్తివేస్తే లీటరు పెట్రోల్‌పై రూ.30 వరకు వినియోగదారులకు ఉపశమనం కలుగు తుందన్నారు. సెస్సులు, సుంకాల పేరుతో ఓ వైపు ప్రజల నుంచి దోపిడీ చేస్తూ ఆ నెపాన్ని తెలంగాణ వంటి రాష్ట్రాలపై నెడుతోందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రజలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై అన్ని రకాల సెస్సులను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు