గవర్నర్‌ వ్యవస్థ ఎందుకు?

31 Jan, 2023 01:26 IST|Sakshi

ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్‌ 

బ్రిటిష్‌ కాలంనాటి గవర్నర్‌ వ్యవస్థను తొలగించాలి..

ప్రధాని మోదీకి ఇదే చివరి బడ్జెట్‌ 

పీఎం కిసాన్‌ కింద ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలి.. ఎనిమిదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదు

సిరిసిల్ల: ‘ప్రజలు ఎన్నుకున్న సభ్యులతో పార్లమెంట్, శాసన సభలు ఉండగా గవర్నర్‌ వ్యవస్థ ఎందుకు.. అది బ్రిటిష్‌ కాలం నాటిది కదా? రాజ్‌భవన్‌లు రాజకీయ వేదికలుగా మారిపోయాయి’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ బానిసత్వ చిహ్నాలు పోవాలన్నారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా.. గవర్నర్‌ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారని గుర్తుచేశారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ ప్రధాని మోదీకి చివరిదన్నారు. బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సోయం బాపురావు, అరవింద్‌లు సోయి తెచ్చుకుని రాష్ట్రానికి నిధులు సాధించాలని సూచించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క పని కూడా కేంద్రం చేయలేదని కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీ ఎంపీలకు తెలివి ఉంటే.. ఈ సారి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు సాధించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు మంజూరు చేయాలని కోరారు.

రైల్వే ప్రాజెక్టులన్నీ అధోగతి
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులన్నీ అధోగతి పాలయ్యాయని, ఒక్క కొత్త రైల్వే మార్గం వేయలేదని కేటీఆర్‌ విమర్శించారు తెలంగాణలో రైల్వే వ్యవస్థ కేవలం 3 శాతం మేరకే ఉందని, అందులోనూ సింగిల్‌ట్రాక్‌ వ్యవస్థ 57 శాతం ఉందని పేర్కొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే మొత్తం రైల్వేలైన్‌ వేసేదని, ప్రస్తుతం ప్రధాని మోదీ మాత్రం కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం.. అంటూ కొత్తవిధానాన్ని ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు.  

రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధును చూసి మోదీ కాపీ కొట్టారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రైతులకు పీఎం కిసాన్‌ పథకం కింద ఎకరానికి రూ.2 వేలు ఇస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు కేంద్రం కూడా ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని పాలమూరు ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలని, సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలని, అలాగే వరంగల్‌కు కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమ ఉన్నా.. బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు