రేవంత్‌ ఒక థర్డ్‌ రేటెడ్‌ క్రిమినల్‌: కేటీఆర్‌

17 Sep, 2021 07:29 IST|Sakshi

శశిథరూర్‌ను గాడిద అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం 

రేవంత్‌ కామెంట్‌పై సొంత పార్టీలోనూ దుమారం...

క్షమాపణలతో సద్దుమణిగిన వివాదం 

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ హోదాలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఇటీవల రాష్ట్ర పర్యటనలో తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. కానీ పార్లమెంటులో ఆయన సహచరుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం శశిథరూర్‌ను గాడిద అంటూ సంబోధించారు. ఓ థర్డ్‌ రేటెడ్‌ క్రిమినల్, దుండగుడికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది’అని మంత్రి కేటీఆర్‌ గురువారం ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని జతచేస్తూ ట్వీట్‌ చేశారు. ‘రేవంత్‌రెడ్డిలాంటి నీచమైన వ్యక్తులు స్పందించరేమో కానీ, రాజకీయాల్లో ఉన్న చెత్తను అందరి ముందు పెట్టాల్సిన అవసరం ఉంది.

శశిథరూర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కూడిన ఆడియోను ఓ మిత్రుడు పంపించాడు. దీన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్‌రెడ్డి స్వరంతో కచ్చితంగా సరిపోతుంది. రేవంత్‌ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ ఏమైనా స్పందిస్తారా’అని ట్వీట్‌లో కేటీఆర్‌ ప్రశ్నించారు. కాగా, కేటీఆర్‌కు బదులిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ‘కేటీఆర్‌ పెద్ద అబద్ధాలకోరు’అని ట్వీట్‌ చేశారు. చిన్నారి హత్యాకాండలాంటి ఘటనల నుంచి కేటీఆర్‌ ప్రజలను తప్పు దోవ పట్టించేయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.  

రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో అలజడి 
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మరోవైపు జాతీయస్థాయిలో సొంత పార్టీ నేతలూ స్పందించారు. ‘బహుశా రేవంత్‌రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొని గాడిద అనే మాట అన్నారేమో’అని శశిధరూర్‌ వ్యాఖ్యానించారు. ‘శశిధరూర్‌ పార్టీ సీనియర్‌. ఆయన అందరికీ గౌరవప్రదమైన వ్యక్తి. ఆయనపై చేసిన వ్యాఖ్యలను రేవంత్‌ ఉపసంహరించుకోవాలి’అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ కూడా ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి శశిథరూర్‌కు ఫోన్‌చేసి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానంటూ క్షమాపణ కోరారు. దీనిపై ‘రేవంత్‌రెడ్డి నాతో మాట్లాడారు. క్షమాపణ చెప్పారు’అంటూ శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనను మరిచిపోయి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలోపేతానికి కలిసి పనిచేద్దామని థరూర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు