‘కేటీఆర్‌ ఎక్కడ.. 12 కోట్ల జాబులను వెతుకుతున్నాను’

1 Mar, 2021 14:15 IST|Sakshi

టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య సవాళ్ల పర్వం

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న కేటీఆర్‌, రామచందర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఉద్యోగాల కల్పన చుట్టే తిరుగుతున్నాయి. అధికార పక్షం, విపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ ఉద్యోగాల కల్పన మీద అధికార పార్టీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ తాము ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించామని చెప్పగా.. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఉద్యోగాల కల్పనపై ఉస్మానియా యూనివర్శిటీ సాక్షిగా చర్చకు రావాల్సిందిగా బీజేపీ నాయకుడు రామ చందర్‌ రావు కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. దీనికి బదులుగా కేటీఆర్‌ బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్తానన్నారు. 

సవాల్‌ ప్రకారం రామచందర్‌ రావు సోమవారం ఉదయం ఓయూకు వెళ్లారు. కేటీఆర్ అక్క‌డ‌కు రాలేద‌ని తెలుపుతూ రామ‌చందర్‌ రావు ట్వీట్ చేశారు. 'నేను ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద ఉన్నాను.. ఎక్క‌డున్నావు మిస్ట‌ర్ కేటీఆర్?' అంటూ ఆయ‌న ట్విట్టర్‌ వేదికగా ప్ర‌శ్నించారు. దీనిపై స్పందిస్తూ రామ‌చందర్‌ రావుకి కేటీఆర్ చుర‌క‌లంటించారు. ప్ర‌ధాని మోదీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల‌ను కేటీఆర్‌ గుర్తు చేశారు. 

ఈ మేరకు ‘‘మీరు అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు(ఇప్పటి వరకు 12 కోట్ల జాబ్స్‌).. జన్‌ధన్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పారు కదా. వీటిని ఎంత వరకు నెరవేర్చరా అనే దాని గురించి సమాచారం సేకరించే పనిలో నేను బిజీగా ఉన్నాను. దీనికి ఎన్‌డీఏ సమాధానం చెప్పాలి. అసలు ఎన్‌డీఏ అంటే నో డాటా అవైలబుల్’’‌ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. త‌న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఉంటే షేర్ చేయాల‌ని ఆయ‌న స‌వాలు విసిరారు.

చదవండి: 
1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం  
పట్టభద్రుల పోరు.. బరిలో కోటీశ్వరులు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు