శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. విజయంపై కేటీఆర్‌ వ్యాఖ్యలు

6 Nov, 2022 18:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. గులాబీ పార్టీ విజయం సందర్భంగా కేటీఆర్‌.. మునుగోడు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడు ప్రజలు కేసీఆర్‌ పాలనకు పట్టం కట్టారు. అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ప్రజలు పట్టం కట్టారు. నల్లగొండ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన సీపీఐ, సీపీఎం నేతలకు ధన్యవాదాలు. నల్లగొండ జిల్లాలో 12కు 12 సీట్లు గెలిపించి కొత్త చరిత్ర లిఖించిన ప్రజలకు ధన్యవాదాలు. అహంకారం, డబ్బు మదంలో తెలంగాణ ప్రజలపై ఢిల్లీబాసులు ఉప ఎన్నిక రుద్దారు. ఉప ఎన్నిక రుద్దినవారికి గట్టిగా బుద్ధిచెప్పారు.

ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాకు చెంప పెట్టులాంటి తీర్పునిచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు. డబ్బుతో జనం గొంతు నొక్కాలని బీజేపీ భావించింది. సంజయ్‌ అనుచరుడు, ఈటల రాజేందర్‌ పీఏ డబ్బులతో దొరికిపోయారు. తెలంగాణలో క్రూరమైన క్రీడకు బీజేపీ తెరలేపింది. వివేక్‌ రూ. 75కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేసిన మాట వాస్తవం కాదా?. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్‌ఎస్‌ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. బీజేపీ అక్రమాలపై మేం ఆధారాలిచ్చినా ఈసీ పట్టించుకోలేదు. ప్రలోభాలతో మెజార్టీ తగ్గించారు కానీ గెలుపును ఆపలేకపోయారు. 

గతంలో కంటే మునుగోడులో మాకు 23వేల ఓట్లు అధికంగా వచ్చాయి. గతంతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు 9 శాతం ఓట్లు పెరిగాయి. ఈటల, రాజగోపాల్‌రెడ్డి వల్లే ఎన్నికలు డబ్బుమయమయ్యాయి. వాళ్లకు వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. కారును పోలిన గుర్తుకు 6 వేల ఓట్లు వచ్చాయి. కావాలనే రోడ్డు రోలర్‌ గుర్తును బలవంతంగా తెచ్చారు. బీజేపీ డ్రామాలను ప్రజలు నమ్మలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు