గుజరాత్‌కు గులాములం కాదు.. ఢిల్లీకి బానిసలం కాదు 

9 Dec, 2021 03:27 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం: కేటీఆర్‌

మీరు ఏం చేశారని ఉద్యమకారులు బీజేపీలోకి రావాలి? 

తెలంగాణకు పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? 

సాక్షి, హైదరాబాద్‌: ‘బీజేపీ నాయకులకు విషయం తెలియదు, విషం చిమ్మడమే తెలుసు. తెలంగాణ ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయరు. తెలంగాణ రైతులను రోడ్లమీదకు గుంజి యుద్ధం చేయాలనే ఆలోచన తప్ప..సమస్యకు పరిష్కారం చూపే సోయి లేదు. ఏమైనా అంటే ఐటీ, ఈడీ, జైల్లో వేస్తం అని చెబుతున్నారు. మీ ఉడత ఊపులకు భయపడం.. గుజరాత్‌కు గులాములం కాదు.. ఢిల్లీకి బానిసలం అంతకంటే కాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం. తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై గొంతువిప్పి ఎందాకైనా కొట్లాడతాం..’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు బుధవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడారు. 

ఎందుకు మీతో కలిసి రావాలి: ‘ఉద్యమకారులు బీజేపీలోకి రావాలని ఆ పార్టీ నాయకుడు ఒకాయన పిలుపునిస్తున్నారు. మీరు ఏం పీకారని మీ పార్టీలోకి రావాలి. ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం చేసినందుకా? నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వనందుకా? పునర్విభజ న చట్టంలోని హామీలను నెరవేర్చనందుకా? ఎందు కు మీతో కలిసి రావాలి..’అని మంత్రి నిలదీశారు. 

మేం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ 
‘ఓ వైపు తెలంగాణ రైతులు గోస పడుతుంటే వరి ధాన్యం సాగు చేయాలా వద్దా అనే అంశంపై ఫిబ్రవరిలో నిర్ణయం చెప్తామని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పీయూష్‌ గోయల్‌ చెప్తున్నరు. టీఆర్‌ఎస్‌ ఎంపీలకు మద్దతు పలకకుండా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లలా తయారయ్యారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణకు సంబంధించిన అంశాలపై పేగులు తెగేలా కొట్లాడుతున్నది గులాబీ జెండా మాత్రమే. మాకు బాస్‌లు గుజరాత్, ఢిల్లీలో లేరు. మేము తెలంగాణ గల్లీల్లోని ప్రజలకు మా త్రమే జవాబుదారీ..’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

మెదడులో చిప్‌ దొబ్బిందా? 
‘వరి ధాన్యం కొనుగోలులో జాతీయ విధానంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు వారం రోజులు కొట్లాడినా దున్నపోతుపై వాన పడినట్లే ఉంది. కేసీఆర్, కేటీఆర్‌ బియ్యం స్మగ్లర్లు అంటున్న బీజేపీ ఎంపీ మనిషా? పశువా? టీపీసీసీకి ఉన్నది చీఫ్‌ కాదు.. చీప్‌ అధ్యక్షుడు. వాడు చిల్లరగాడు.. దిమాక్‌ ఖరాబైంది. రూ.3 వేల కోట్ల కుంభకోణం ఏదో ఉన్నందునే టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేస్తుండ్రని అంటడు. కొత్త సెక్రటేరియట్‌ నేలమాళిగ నుంచి సొరంగం తవ్వుకుని కేసీఆర్‌ ప్రగతిభవన్‌కు పైసలు తీసుకెళ్లాడని అంటడు. వానికి మెదడులో చిప్‌ దొబ్బిందా? ’అంటూ ఘాటుగా విమర్శించారు. ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్, వన్‌ నేషన్‌ వన్‌ ట్యాక్స్‌’అంటున్న పార్టీ ‘వన్‌ నేషన్‌..వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌’పాలసీ ప్రవేశ పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు