అదో కప్పల తక్కెడ

1 Oct, 2023 04:36 IST|Sakshi
ఖమ్మంలో స్పోర్ట్స్‌ పార్క్‌ను ప్రారంభించిన అనంతరం ఫుట్‌బాల్‌ ఆడుతున్న కేటీఆర్‌

కాంగ్రెస్‌లో ఒకరి మాట మరొకరు వినరు 

వాళ్లను నమ్మితే కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లే..: పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 

రేవంత్‌ రూ. 50 కోట్లతో పీసీసీ చీఫ్‌ పదవి తెచ్చుకున్నాడని కోమటిరెడ్డే అన్నారు 

మళ్లీ వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే.. 

సత్తుపల్లి నియోజకవర్గం అంతా దళితబంధు అమలు చేస్తాం

ఎన్టీఆర్‌ పేరులో పవర్‌ ఉంది..

ఖమ్మం పర్యటనలో మంత్రి వ్యాఖ్యలు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘కాంగ్రెస్‌ పార్టీ వారంటీ ఎప్పుడో అయిపోయింది. ఆ పార్టీ నాయకుల మాటలకే గ్యారంటీ లేదు. ఇక ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారు? కాంగ్రెస్‌ పార్టీ కప్పల తక్కెడ. ఒకరు పైకి ఎక్కుతుంటే నలుగురు కిందకు లాగుతారు. ఒకరి మాట ఒకరు వినరు. 150 ఏళ్ల ముసలినక్క కాంగ్రెస్‌ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే..’’ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఖ­మ్మం జిల్లా ఖమ్మం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గా­ల్లో రూ.1,797.52 కోట్ల పథకాలు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు కేటీఆర్‌ మాటల్లోనే.. 

‘‘సత్తుపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే గౌరవించి జిల్లా స్థాయిలో పెద్ద పదవిలో పెడితే.. ఇప్పుడు టికెట్‌ ఇవ్వకపోతే కేసీఆర్‌ను నిందిస్తున్నారు. పార్టీ అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. నిన్నటిదాకా దేవుడిలా కనబడిన కేసీఆర్‌ వెంటనే దయ్యమై పోతాడా? రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం. కానీ ఇష్టం వచ్చినట్లు నిందించడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి (తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను ఉద్దేశించి పరోక్ష విమర్శలు). 

గ్యారంటీల పేరిట ఊదరగొడుతున్నారు 
కేసీఆర్‌ ఒకటి అంటే మేం రెండు చేస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు ఊదరగొడుతున్నారు. గ్యారంటీలు అంటున్నారు. కాంగ్రెస్‌ హయాంలో బిందెడు నీళ్ల కోసం గోసపడ్డాం. ఇప్పుడు 96శాతం గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీళ్లు అందుతున్నాయి. 24 గంటల కరెంట్‌ చూపిస్తే రాజీనామా చేస్తానంటున్నాడు ఓ ఎంపీ (కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ..). ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గానికి వస్తారో రండి.

ఇక్కడ కరెంట్‌ తీగలను పట్టుకుంటే కరెంట్‌ వస్తుందో, రాదో తెలుస్తుంది. కాంగ్రెస్‌ వాళ్లే సమస్యలు పరిష్కరించి ఉంటే ప్రజలు మాకెందుకు అధికారం ఇస్తారు? కొందరు నాయకులు సీతారామ ప్రాజెక్టు నీటితో ప్రజల కాళ్లు కడుగుతామంటున్నారు. గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆ ప్రాజెక్టును పూర్తిచేసి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.
 
కాంగ్రెస్‌ సీట్లు అమ్ముకుంటున్నారు! 
పీసీసీ అధ్యక్షుడు రూ.50 కోట్లకు పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా అన్నారు. మరో నాయకుడు టికెట్‌ కోసం పదెకరాలు అడిగాడు. పది కోట్లు అడిగారని చెప్తున్నారు. కోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారు. వారికి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోరా? మొండి చేయికి ఓటేస్తే మూడు గంటల కరెంట్, ఏడాదికో సీఎం మారడం గ్యారంటీ. 

ప్రతిపక్షాలను ఫుట్‌బాల్‌ ఆడాలని.. 
గ్రౌండ్‌లో పిల్లలు ఫుట్‌బాల్‌ ఆడతారు. ఎన్నికలు వస్తున్నాయి, మీరు ప్రతిపక్షాలను ఫుట్‌బాల్‌ ఆడండి అని మంత్రి అజయ్‌కి చెప్పాను. ఖమ్మంలో అజయ్‌ ప్రత్యర్థుల కుట్రలను తుత్తునీయలు చేసి గెలవాలని ఆకాంక్షిస్తున్నా. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్యను గెలిపించుకోవాలి. హుజూరాబాద్‌ తర్వాత ఆ స్థాయిలో సత్తుపల్లిలో దళితబంధు ప్రారంభించాలని సీఎం చెప్పారు. అలాగే మధిర నియోజకవర్గం బోనకల్‌ మండలంలోనూ ప్రతీ దళిత కుటుంబానికి దళతబంధు ఇస్తాం.  

కర్ణాటక డబ్బులు వస్తున్నాయి 
కర్ణాటక నుంచి డబ్బులు ఇక్కడకు బాగా వస్తున్నాయట.. అక్కడి కాంగ్రెస్‌ నుంచి ఇక్కడకు డబ్బులు వస్తున్నాయట., అక్కడ స్పెషల్‌ టాక్స్‌లు వేస్తున్నారట. కొత్తగా బిల్డింగ్‌ కడితే స్క్వేర్‌ ఫీట్‌కు రూ.500 ముక్కు పిండి వసూలు చేస్తున్నారట.. తెలంగాణ కాంగ్రెస్‌కు రూ.వందల కోట్లు పంపుతున్నారట.. కానీ అమ్ముడుపోయే అంగడి సరుకు కాదు నా తెలంగాణ అని ఢిల్లీ, బెంగళూరు వారికి తెలిసేలా తీర్పు ఇవ్వండి. మోసాన్ని మోసంతోనే జయించాలి. కర్ణాటక నుంచి వచ్చే సొమ్మును తప్పకుండా తీసుకోండి. ఓటు మాత్రం కచ్చితంగా కారు గుర్తుకు కేసీఆర్, అజయ్‌కుమార్, వెంకటవీరయ్యకు వేసి గెలిపించండి.  

ఎన్టీఆర్‌ పేరులో పవర్‌ 
తెలుగువారిని దేశం గుర్తించేలా వ్యవహరించింది ఆనాడు ఎన్టీఆర్‌ అయితే.. తెలంగాణ వారికి అస్తిత్వం ఉంది, పాలన చేతవుతుందంటూ తెలంగాణ పౌరుషం ఏమిటో దేశానికి రుచి చూపించినది కేసీఆర్‌. ఎన్టీఆర్‌ అనే పేరులోనే పవర్‌ ఉంది. ఆయన ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి కావాలి..’’ అని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు