గవర్నర్‌ వ్యవస్థను ఎత్తేయాలి.. లేదా ప్ర‌ధాని పేరైనా మార్చుకోవాలి.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

30 Jan, 2023 21:29 IST|Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజ్‌భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మనుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సూచించారు. రాజ్‌భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకున్నారని విమర్శించారు. గవర్నర్‌ వ్యవస్థను బ్రిటిష్‌ వారు ప్రవేశ పెట్టారని.. దానిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ను ఎవరు ఎన్నుకున్నారని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో ఉన్న వారు కూడా పార్టీల‌కు అనుకూలంగా, పార్టీల ప్ర‌తినిధులుగా పార్టీల చ‌ర్చ‌ల్లో పాల్గొన‌డం, రాజ‌కీయ ప‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకుంటే మంచిది. ఇంత అన్యాయంగా ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీ నాయకుల ఫోటోల‌నే రాజ్‌భ‌వ‌న్‌లో పెట్టుకుంటూ రాజ్‌భ‌వ‌న్‌ను రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా మార్చ‌డం దేశానికి మంచిది కాదు. వ్య‌వ‌స్థ‌కు మంచిది కాదు.

బ్రిటీష్ కాలం నాటి బానిస చిహ్నాలు పోవాల‌ని మొన్న మోదీ గొప్ప స్పీచ్‌ ఇచ్చారు.  అందుకే రాజ్‌ప‌థ్‌ను క‌ర్త‌వ్య ప‌థ్ అని మార్చామ‌ని ప్రధాని అన్నారు. మరి గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ కూడా బ్రిటీషోళ్లు పెట్టిందే. అవి ఎందుకు ఉండాలి..  దాని వ‌ల్ల దేశానికి ఏం ఉప‌యోగమో చెప్పాలి. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని మోదీనే చెప్పారు. రెండేండ్ల పాటు రాజకీయాల‌కు దూరంగా ఉంటేనే ఇవ్వాల‌న్నారు. మ‌రి ఇవాళ మోదీ అది పాటిస్తున్నాడా..? ముఖ్య‌మంత్రి మోదీనేమో నీతులు చెబుతాడు. ప్ర‌ధాన‌మంత్రి మోదీనేమో అదే నీతుల‌ను తుంగ‌లో తొక్కుతాడు.

పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాలు ఉంటాయి. ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధాన‌మంత్రి ఉంటారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి బ్రిటీష్ కాలంలో అర్థం ఉండే. ఎందుకంటే పైనా వైశ్రాయ్ ఉండే.. కింద గ‌వ‌ర్న‌ర్ ఉండే.. వారు సంభాషించుకునేవారు. ఇక ప్ర‌ధానమంత్రైనా ఆయ‌న పేరును వైశ్రాయ్ అని మార్చుకోవాలి. లేదంటే ఇక్క‌డ గ‌వ‌ర్న‌ర్లను అయినా ఎత్తేయాలి. ఇత‌రుల‌కు చెప్పేముందు ఆయ‌న ఆలోచించుకుంటే మంచిది’ అని కేటీఆర్ సూచించారు.
చదవండి: అసెంబ్లీ బడ్జెట్‌ ప్రసంగానికి గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వానం

మరిన్ని వార్తలు