మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్, రాజశేఖర్‌కు బెదిరింపులు: రేవంత్ రెడ్డి

20 Mar, 2023 08:32 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్‌ పేషీ నుంచే జరిగిందని, మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లీకేజీ కేసులో అరెస్టు చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారించకుండానే ఇద్దరి వల్లే పేపర్‌ లీక్‌ అయ్యిందంటూ మంత్రి కేటీఆర్‌ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేటీఆర్‌ పీఏ తిరుపతి షాడో మంత్రి అని, ఆయన ద్వారానే అన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి కీలక బాధ్యతలు అప్పగించడంలోనే అసలు రహస్యం దాగి ఉందన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలు నోరు విప్పితే పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్లను ఎన్‌కౌంటర్‌ చేస్తామని జైలులో బెదిరించారని రేవంత్‌ ఆరోపించారు. ఈనెల 13 నుంచి 18 వరకు చంచల్‌గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.  

ఎన్‌వోసీ ఎలా ఇచ్చారు.. 
టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్న వారు పోటీ పరీక్షలు రాయడానికి అనర్హులని నిబంధనలు చెబుతున్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అందులో పనిచేస్తున్న 20 మందికి పరీక్షలు రాయడానికి ఎన్‌వోసీ ఎలా ఇచి్చందని ప్రశ్నించారు. అమెరికానుంచి వచ్చిన మాధురికి గ్రూప్‌–1 మొదటి ర్యాంకు, జూనియర్‌ అసిస్టెంట్‌ రజనీకాంత్‌రెడ్డికి నాలుగో ర్యాంకు ఎలా వచ్చాయన్నారు. శ్రీలక్షి్మ, ప్రవీణ్, వెంకటాద్రి, శ్రీదేవి, రమేశ్, వాసు, మధులతలతో పాటు మరికొందరికి పరీక్షలకు అనుమతి ఇచ్చారా? లేదా? అనేది ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 2016లో ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన 25 మందికి గ్రూప్‌–1 ఉద్యోగాలు వచ్చాయని, దీనిపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

ఏ2 రాజశేఖర్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనే.. 
లీకేజీ వ్యవహారంలో ఏ2గా ఉన్న రాజశేఖర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి దగ్గరి స్నేహితుడని, ఇద్దరిదీ ఒకే ప్రాంతమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ పరిచయంతోనే రాజశేఖర్‌రెడ్డికి 2017లో ఉద్యోగం ఇప్పించాడని, వెనువెంటనే ప్రమోషన్‌ వచి్చందని, తర్వాత టీఎస్‌పీఎస్సీలోకి బదిలీ అయ్యాడని ఆయన వెల్లడించారు. వీటన్నింటికీ కేటీఆర్‌ పీఏ తిరుపతే కారణమని ఆరోపించారు. అలాగే లీకేజీ వ్యవహారంలో కాని్ఫడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకర్‌లక్ష్మి పాత్రపై విచారణ జరపాలన్నారు. తాజా గ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్‌లో మల్యాల ప్రాంతానికి చెందిన వంద మందికిపైగా అభ్యర్థులకు 103 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయని, వారి వివరాలను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లకు అన్ని వివరాలు తెలిసి ఉంటాయన్నారు.  

సిట్‌ అధికారి కేటీఆర్‌ బావమరిదికి దోస్త్‌.. 
పేపర్‌ లీకేజీ కేసు బాధ్యతలు అప్పగించిన సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌.. మంత్రి కేటీఆర్‌ బావమరిదికి దగ్గరి స్నేహితుడని, ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంలో ఉద్దేశం ఏమిటో అర్థమవుతోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, లేదంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. లీకేజీ వ్యవహారంపై తాము కోర్టులో వేసిన కేసుపై సోమవారం విచారణ జరగనుందని తెలిపారు. 21న గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మహేశ్‌కుమార్‌ గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, సీతక్క, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో కొత్త కోణం.. ఎన్‌ఆర్‌ఐ లీడర్‌ సిఫారసుతోనే  రాజశేఖర్‌కు ఉద్యోగం?

మరిన్ని వార్తలు