దమ్ముంటే లక్ష కోట్లు తెండి

21 Nov, 2020 03:15 IST|Sakshi

కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్యాకేజీ ఇప్పించండి

బీజేపీ రాష్ట్ర నాయకులకు కేటీఆర్‌ సవాల్‌

అది బాగుంటేనే రాష్ట్రం, రైతులు బాగుంటారు

అభివృద్ధా? అశాంతా? అనేది ప్రజల్లో చర్చకు పెడదాం

బల్దియాలో ఈసారి సెంచరీ కొట్టాల్సిందే

వరదసాయం, చలానాల విషయంలో బీజేపీది బాధ్యతారాహిత్యం.. ప్రగతి నివేదిక విడుదల

28న ఎల్‌బీ స్టేడియంలో కేసీఆర్‌ బహిరంగ సభ

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ నాయకులు బాధ్యతారహితంగా అలవిగాని హామీలు ఇవ్వడం మానుకొని... దమ్ముంటే హైదరాబాద్‌కు కేంద్రం నుంచి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని తేవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు సవాల్‌ విసిరారు. వరదసాయం కింద కేంద్రం నుంచి నయాపైసా తేలేకపోయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల వేళ... అడ్డగోలుగా మాట్లాడుతోందని మండిపడ్డారు.

‘తెలంగాణకు హైదరాబాద్‌ ఆర్థిక ఇంజిన్‌ లాంటిది. నగరం బాగుంటేనే రాష్ట్రంతో పాటు రైతులు బాగుంటారు. నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. హైదరాబాద్‌లో అశాంతి చెలరేగితే అమెజాన్, గూగుల్, యాపిల్‌ వంటి కంపెనీలు రావు. నగరంలో బిర్లామందిర్, తాడ్‌బండ్‌ ఆంజనేయస్వామి వంటి గుడులు ఎన్నో ఉండగా, చార్మినార్‌ భాగ్యలక్ష్మి గుడి వద్దే బీజేపీ నేతలు ధర్నా పేరిట ఎందుకు కెలుక్కోవాలి. వారం రోజుల పాటు వాళ్లు కావాల్సినంత వినోదం పంచుతారు. బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్‌కు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని కేంద్రంతో ప్రకటన ఇప్పించాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 150 మందికి శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో బీ ఫారాలు అందజేశారు.

ఈ సందర్భంగా గత ఆరేళ్లుగా హైదరాబాద్‌ నగరంలో రూ.67 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రగతి నివేదికను విడుదల చేశారు. ‘రాష్ట్రానికి సంబంధించి ఇది కీలకమైన ఎన్నిక. విద్వేష, విషప్రచారంతో కూడినహైదరాబాద్‌ కావాలా? అశాంతి కావాలా? అభివృద్ది కావాలా? అని ప్రజల్లో చర్చ పెట్టండి. గ్రేటర్‌ ఎన్నికలను రొటీన్‌గా కొట్లాడొద్దు. అభ్యర్థులు గర్వం, అహం లేకుండా టికెట్లు రాని వారిని కూడా కలుపుకొని వెళ్లండి. ప్రగతి నివేదిక మన పార్టీ అభ్యర్థులకు ప్రచార అస్త్రం. శనివారం ఉదయం పార్టీ అభ్యర్థులు అందరూ బీ– ఫారాలు సమర్పించాలి’అని కేటీఆర్‌ సూచించారు. 

ఈసారి సెంచరీ కొట్టాల్సిందే
‘గత ఎన్నికల్లో ఒక్క సీటు తేడాతో గ్రేటర్‌లో సెంచరీ మిస్సయ్యాం. ఈసారి ప్రజల ఆశీర్వాదంతో వందస్థానాల్లో గెలుపొందేలా పార్టీ అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడాలి. ఈ నెల 28న ఎల్‌బీ స్టేడియంలో జరిగే బహిరంగసభతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భారీ సంఖ్యలో డివిజన్ల నుంచి కార్యకర్తలు తరలివచ్చేలా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించండి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో నేను కూడా శనివారం నుంచే రోడ్‌ షోలలో పాల్గొంటా’అని కేటీఆర్‌ ప్రకటించారు.


ప్రభుత్వ సొమ్ముతో జరిమానాలు కడతారా... ఇదెక్కడి విడ్డూరం?
‘కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలవడంతో పాటు వలస కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాం, వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం నయాపైసా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంది. ఇటీవలి వరదల సమయంలో మనం ప్రజల్లో ఉండి వరదసాయాన్ని అందించాం. కేంద్రం ఇప్పటివరకు నయాపైసా ఇవ్వకున్నా... బల్దియాలో గెలిస్తే ఇంటికి రూ.25 వేలు ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారికి జరిమానా కట్టేందుకు... గుజరాత్, కర్నాటక, యూపీల్లో ఎక్కడైనా ప్రభుత్వ సొమ్ము చెల్లించారా’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆరేళ్లుగా శాంతిభద్రతల సమస్య లేదని, తాగునీటి సమస్యలు 95 శాతం వరకు పరిష్కరించామని అన్నారు. 

టికెట్ల కేటాయింపులో సామాజికన్యాయం
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇస్తూ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. 150 డివిజన్లలో 50 శాతం కింద 75 స్థానాలు మహిళలకు రిజర్వు అయితే... తాము అంతకంటే ఎక్కువగా 85 చోట్ల అవకాశమిచ్చామన్నారు. బీసీలకు 75, ఎస్టీలకు 3, ఎస్సీలకు 13, మైనారిటీలకు 17 స్థానాల్లో టికెట్లు ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, మహిళా కేటగిరీల్లో అన్ని సామాజికవర్గాలకు అవకాశం ఇచ్చామన్నారు. తమిళనాడు నుంచి వచ్చి స్థిరపడిన అరవ మాలలకు రెండు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన 8 మందికి గ్రేటర్‌ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, మంత్రుల మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్‌లతో పాటు నగరానికి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

బీ ఫారాలు జారీ.. ప్రతిజ్ఞ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్న 150 మంది అభ్యర్థులకు కేటీఆర్‌ బీ ఫారాలు అందజేశారు. నగర ప్రజల సంక్షేమం, అభివృద్ది కట్టుబడి ఉంటామని, అవినీతికి ఆస్కారం లేకుండా జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం, పార్టీ గౌరవాన్ని నిలబెడతామని, పార్టీ, ప్రజల పట్ల విధేయులుగా ఉంటామని అభ్యర్థులతో కేటీఆర్‌ ప్రతిజ్ఞ చేయించారు. 

ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ @ 6 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్‌ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రగతి నివేదికను టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు శుక్రవారం విడుదల చేశారు. ‘హైదరాబాద్‌– ది రైజింగ్‌ గ్లోబల్‌ సిటీ’పేరిట రూపొందించిన ఈ నివేదికలో రంగాల వారీగా మౌలికవసతుల కల్పన కోసం ప్రభుత్వం చేపట్టిన పనులు, వెచ్చించిన నిధుల వివరాలను వెల్లడించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని 1.60 కోట్ల జనాభాతో దేశంలోని మెట్రో నగరాల్లో ఆరో స్థానంలో, అర్బన్‌ ఎకానమీలో దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నట్లు ప్రగతి నివేదికలో వెల్లడించారు.  

మెట్రో రైలు, రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, విద్యుత్, శాంతిభద్రతలు తదితరాల కోసం ఆరేళ్లలో రూ.67,149.23 కోట్లు వెచ్చించాం. 
దేశంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.17,290 కోట్లతో నిర్మితమైన ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ హైదరాబాద్‌లో ఉంది. 66 స్టేషన్లతో 72 కి.మీ. పొడవుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. 
ఎస్‌ఆర్‌డీపీ, హెచ్‌ఆర్‌డీసీఎల్, సీఆర్‌ఎంపీ, ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుల ద్వారా రోడ్డు సౌకర్యం కోసం రూ.14,738.55 కోట్ల వ్యయం. 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 రోడ్‌ఓవర్‌ బ్రిడ్జీలు, 1 కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం. 
రూ.313.65 కోట్లతో 126.2 కిమీ పొడవుతో 137 రోడ్ల నిర్మాణం. మియాపూర్‌ హెచ్‌టీ లైన్, పాత ముంబై రోడ్డు హెచ్‌టీ లైన్, ప్రశాసన్‌నగర్‌ లింక్‌ రోడ్ల పూర్తి. 
రూ.709.49 కోట్లతో 709.49 కి.మీ పొడవునా రోడ్డు నిర్వహణ కార్యక్రమం. 
158 కి.మీ పొడవునా రూ.3,309 కోట్లతో ఓఆర్‌ఆర్‌ అభివృద్ది. 
రూ.14,175 కోట్లతో 4,725 కి.మీ. పొడవైన తాగునీరు, మురుగునీటి పైపులైన్ల నిర్మాణం 
రూ.2,374.36 కోట్లతో నిరంతర విద్యుత్‌ సరఫరా. 
శాంతిభద్రతల కోసం రూ.1,940.33 కోట్లు, పోలీసు వ్యవస్థ ఆధునీకీకరణ, లక్షకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు.  
రూ.9,700 కోట్లతో 111 చోట్ల లక్ష డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు. 
రూ.1,716.33 కోట్లతో స్వచ్చ హైదరాబాద్, స్వచ్ఛ ఆటోలు, 3 వేలకు పైగా పబ్లిక్‌ టాయిలెట్లు. రూ.332.70 కోట్లతో హరితహారం. ఆరేళ్లలో 8 కోట్లకు పైగా మొక్కల పెంపకం 
250 కోట్లతో పార్కులు 
► రూ.156.59 కోట్లతో ప్రజారవాణా మెరుగు, రూ.45 కోట్లతో బస్‌షెల్టర్ల నిర్మాణం. పాదచారుల కోసం 430 కి.మీ. పొడవైన ఫుట్‌పాత్‌లు. 
రూ.66.97 కోట్లతో వైకుంఠధామాలు, రూ.97.37 కోట్లతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు. 
► ఐటీ, పారిశ్రామిక రంగంలో మౌలిక వసతులకు రూ.2,115.93 కోట్లు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల రాక... 15 లక్షల మందికి ఉద్యోగాలు. 
► రూ.30.51 కోట్లతో బస్తీ దవాఖానాలు, రూ.152.03 కోట్లతో 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజుకు 40 వేల మందికి భోజనం. 

మరిన్ని వార్తలు