అమిత్‌ షా చెప్పులు మోసిన చేతులతో ప్రమాణం చేయడం పాపం: కేటీఆర్‌ కౌంటర్‌

29 Oct, 2022 16:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రజల ముందకు అన్ని విషయాలు వచ్చాయి. దొంగ ఎవరో.. దొర ఎవరో తేలిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పులు మోసిన చేతులతో బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేయడం పాపం. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. యాదాద్రిని సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరుతున్నాను. ప్రమాణాలు చేసుకుంటూ పోతే చట్టాలు, కోర్టుల అవసరం  ఏముంది. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా నేను మాట్లాడను. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ యాదాద్రి ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణం చేస్తున్న సందర్భంగా బండి సంజయ్‌.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ, తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ ఆడుతున్న డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు