అన్ని స్థానాల్లో ఆత్మీయ సమ్మేళనాలు

13 Mar, 2023 03:12 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ నేతలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు 

నాయకుల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకునే దిశలో కార్యాచరణ  

ప్రతి 10 గ్రామాలతో ఒక యూనిట్‌.. 

సమ్మేళనాల షెడ్యూల్‌ను పార్టీ కి పంపాలి 

జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకుల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసుకునే దిశలో కార్యాచరణ రూపొందించుకోవాలని, ఇందుకోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ఆత్మీ య సమ్మేళనాలు’నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేస్తూ, 60 లక్షల మంది పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన కోరారు. ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు రూపొందించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు వివరించారు. వీలున్నంత మేరకు నాయకులు ప్రజల్లో ఉండేలా ఈ కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు.  

కార్యకర్తలే బలం.. 
బీఆర్‌ఎస్‌కు పార్టీ కార్యకర్తలే బలమని, వారితో ఆత్మీ య సమ్మేళనాలు నిర్వహించాలని కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్‌లో నాయకులకు సూచించారు. ‘ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకోండి. ఆ 10 గ్రామాల కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయండి. పట్టణాల్లో అయితే పట్టణానికి ఒక యూనిట్‌గా లేదంటే కొన్ని డివిజన్లను ఒక యూనిట్‌గా చేసి సమ్మేళనాలు నిర్వహించండి.

ఈ సమావేశాలకు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, ఇతర పార్టీ ముఖ్యులను ఆహ్వా నించండి’అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ సమ్మేళనాలు పూర్తయ్యేలా ఏ రోజు ఏ యూనిట్‌లో నిర్వహిస్తారనే షెడ్యూల్‌ను తేదీలతో సహా జిల్లా అధ్యక్షులు పార్టీకి తెలియజేయాలని సూచించారు.  

విద్యార్థి విభాగం బలోపేతం.. 
2023–24 విద్యాసంవత్సరం జూన్‌ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు విద్యార్థి విభాగానికి నూతన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటర్‌ నుంచి వృత్తి విద్యాకోర్సుల వరకు అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు స్వాగత సభలు నిర్వహించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేయాలని, పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం చేయాలని సూచించారు. ఈ అంశాలన్నింటిపై పూర్తిస్థాయి కార్యాచరణ కోసం వారం రోజుల్లోగా రాష్ట్ర పార్టీ సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్‌ పార్టీ నేతలకు తెలిపారు.


అంబేడ్కర్‌ స్ఫూర్తిని గౌరవించుకుంటున్నాం 
పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల ప్రారంబోత్సవాలను కూడా పూర్తి చేసుకోవాలని కేటీఆర్‌ ఆదేశించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌. బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని, ఆ దిశగా జయంతి కార్యక్రమాల షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలని సూచించారు.

‘దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు నూతన సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకుంటున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేడ్కర్‌ వారసత్వ స్ఫూర్తిని ఇంత ఘనంగా గౌరవించుకోలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పార్టీ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉత్సవాలు నిర్వహించాలి’అని చెప్పారు.  

మరిన్ని వార్తలు