జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ లేఖ కలకలం

15 Nov, 2021 08:55 IST|Sakshi

టీడీపీని ఓడించాలని పిలుపు 

సాక్షి,తిరుపతి: కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయవద్దంటూ జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ఫ్యాన్స్‌ సామాజిక మాథ్యమాల్లో లేఖ పోస్ట్‌ చేశారన్న విషయం పట్టణంలో కలకలం రేపింది. ఎక్కడ చూసినా ఈ లేఖపైనే విస్తృత చర్చలు జరిగాయి. ‘కుప్పం గడ్డపై అన్న ఎన్‌టీఆర్‌ పేరు ఎత్తకుండా, ఫ్లెక్సీలు కట్టకుండా మాపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి ఈ రోజు టీడీపీ తరఫున మున్సిపల్‌ చైర్మన్‌గా పోటీ చేస్తున్నాడు. జూనియర్‌ ఎన్‌టీఆర్‌ పేరు వినిపించకుండా రెండుసార్లు మనపై దాడి చేయించాడు. ఇప్పుడు గాయపడిన ప్రతి జూనియర్‌ అభిమానికి సమయం వచ్చింది.

చదవండి: టీడీపీకి ఓటు వేయనన్నందుకు దళితుడిపై దాడి

మన దెబ్బకు లోకేష్‌ పర్యటించిన అన్ని వార్డుల్లోనూ టీడీపీని ఓడించి మన ప్రతీకారం రుచి చూపిద్దాం. ఎన్‌టీఆర్‌ అభిమాని అనేవాడు దెబ్బతినడమే కాదు, తన సమయం వస్తే కోలుకోలేని దెబ్బ కొట్టగలడు. అని చూపిద్దాం.’ అంటూ లేఖలో పేర్కొన్న విషయంపై ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు టీడీపీకి ఓటు వేయవద్దని జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ఫ్యాన్స్‌ లేఖ విడుదల చేశారన్న సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో దుమారం రేపింది.

పరిస్థితి తమ కొంప ముంచే ప్రమాదం ఉందని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఏ మాథ్యమాల్లో అయితే లేఖ వైరల్‌ అవుతోందని ప్రచారం జరుగుతోందో అక్కడే అందులోని సమాచారం అవాస్తవమని సమర్థించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లేఖ వాస్తవమా.. అవాస్తవమా అనే విషయం పక్కన పెడితే  ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు