అచ్చెన్న వ్యాఖ్యలు అక్షర సత్యం

20 Sep, 2021 04:31 IST|Sakshi

ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టింది.. డబ్బులూ పంచింది

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 

సాక్షి, అమరావతి: పార్టీ లేదు.. బొక్కా లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ ముహూర్తాన అన్నారో గానీ ఆ వ్యాఖ్యలు అక్షర సత్యమవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలతో సీఎం వైఎస్‌ జగన్‌ విజయాల పరంపర కొనసాగుతోందన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు చూసినా, ఇప్పటి ఫలితాలు చూసినా అదే ట్రెండ్‌ కొనసాగుతోందని తెలిపారు. గతంలో 80 శాతం వస్తే ఇప్పుడు అంతకు మించి రానున్నాయన్నారు. ఒక నాయకుడి నిబద్ధతకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు.

ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వానికి ప్రజామోదం లభించిందని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలతో టీడీపీ ఇక కనుమరుగు అవుతుందన్నారు. తాము ఎన్నికలు బహిష్కరించడం వల్లే వైఎస్సార్‌సీపీ గెలిచిందని టీడీపీ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. మరి ఎన్నికల్లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టారని.. ఎందుకు డబ్బులు పంచారని నిలదీశారు. ఇది బహిష్కరణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్నికలు బహిష్కరిస్తే టీడీపీ అభ్యర్థులు ఎలా గెలిచారని నిలదీశారు. 

ఏనాడూ టీడీపీకి ప్రజామోదం దక్కలేదు..
2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 జిల్లా పరిషత్‌లు, టీడీపీ 2, టీఆర్‌ఎస్‌ ఒకటి గెలుచుకున్నాయన్నారు. కాంగ్రెస్‌ 620 మండలాల్లో, టీడీపీ 355, టీఆర్‌ఎస్‌ 22, సీపీఐ 23, సీపీఎం 6 చోట్ల విజయం సాధించాయని చెప్పారు. అంటే.. ఏనాడూ టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజామోదం దక్కలేదన్నారు. మొన్న జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 12 కార్పొరేషన్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుందన్నారు. 671 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 563 చోట్ల (83.09 %) విజయం సాధించిందని తెలిపారు. టీడీపీకి 78 డివిజన్లే్ల (11.62%) దక్కాయన్నారు. ఇతరులు 28 చోట్ల గెలిచారన్నారు. మునిసిపాలిటీల్లో 75కు 74 చోట్ల (98.96%) వైఎస్సార్‌సీపీ గెలుపొందగా టీడీపీకి ఒకటి మాత్రమే వచ్చిందన్నారు. 2,123 వార్డుల్లో 1,754 ( 82.65%) చోట్ల వైఎస్సార్‌సీపీ, 17 చోట్ల వైఎస్సార్‌సీపీ రెబల్‌ అభ్యర్థులు గెలిచారన్నారు. టీడీపీ 270 వార్డుల్లో మాత్రమే విజయం సాధించిందన్నారు.   

మరిన్ని వార్తలు