అమరావతి ఉద్యమం కథ,స్క్రీన్‌ప్లే బాబుదే

2 Nov, 2020 03:21 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

సాక్షి, విశాఖపట్నం: అమరావతి ఉద్యమానికి కథ, స్క్రీన్‌ ప్లే చంద్రబాబుదేనని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల వ్యతిరేక ఉద్యమంగా ప్రజలు దీనిని పరిగణిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అమరావతిలో కొంతమంది ఆస్తులను కాపాడడానికే అమరావతి ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఇక్కడి సర్క్యూట్‌ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి లోపల రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు అందజేయకపోతే, నిర్మించకపోతే.. ఆ ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని చంద్రబాబు అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసలు చంద్రబాబు హయాంలో ఒక్క ఇల్లు కూడా పూర్తిగా నిర్మించిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగుల ఫ్లాట్‌కు సంబంధించిన రూ.3 లక్షలు ప్రభుత్వమే భరిస్తూ పూర్తి ఉచితంగా..ఇంట్లో మహిళపేరిట రిజి్రస్టేషన్‌  చేయించి మరీ పట్టాలు చేతిలో పెడతామని చెప్పారు. రూ. 600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామన్నారు.  

పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారు
పోలవరం ప్రాజెక్టును టీడీపీ మొదటి నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసమే వాడుకుందని మంత్రి విమర్శించారు. అందువల్లే రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టుకు నిధులు రాని దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతుంటే.. తండ్రి గణిత మేధావి, కొడుకు బాల మేధావి తరహాలో చంద్రబాబు, లోకేష్‌లు మాట్లాడుతున్నారన్నారు. వరిచేను, చేపల చెరువుకు మధ్య తేడా కూడా లోకేష్కు తెలియదని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీని తమ ప్రభుత్వం రైతులకు ఇస్తోందన్నారు. 

నెలఖారులోగా నష్ట పరిహారం 
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి నవంబర్‌ నెలాఖరులోగా నష్ట పరిహారం అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కన్నబాబు తెలిపారు. నష్ట పరిహారాల వివరాలు గ్రామ సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు