జీవో ఇచ్చింది చంద్రబాబే

12 Dec, 2020 03:39 IST|Sakshi

33% పంటలు నష్టపోతేనే పరిహారం 

అబద్ధాలు చెప్పడంలో లోకేశ్, యనమల దొందూదొందే

జగనన్న జీవక్రాంతిపై అసత్య వార్తలు రాసిన ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేస్తాం

15న రైతుల ఖాతాల్లోకి పంటల ఉచిత బీమా పరిహారం 

ఈ నెలాఖరుకు నివర్‌ తుపాను నష్టపరిహారం

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 

సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లు వ్యవసాయాన్ని పట్టించుకోని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. రైతుల గురించి మాట్లాడే హక్కు, అర్హత టీడీపీకి లేవన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం  ఆయన మీడియాతో మాట్లాడారు. 33 శాతం పంటలు నష్టపోతేగానీ పరిహారం ఇవ్వరా? అని లోకేశ్‌ అన్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని.. లోకేశ్‌ సమాచారం అంతా తెలుసుకుని ఉండకపోవచ్చని ఎద్దేవా చేశారు. 33 శాతం పంట నష్టపోతే పరిహారం ఇవ్వాలన్న నిబంధన కొత్తగా సీఎం జగన్‌ తీసుకురాలేదని చెప్పారు. 33 శాతం పంటలు నష్టపోతేనే పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ 2015 డిసెంబర్‌ 4న చంద్రబాబు ప్రభుత్వం జీవోఎంఎస్‌ 15 జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ జీవో ఇచ్చినప్పుడు లోకేశ్‌కు అంత అవగాహన ఉండి ఉండదన్నారు. అప్పట్లో లోకేశ్‌ దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వం మీద పెత్తనం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారన్నారు. జీవోలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనలు, వీటిని ఎలా పొందుపరిచారో లోకేశ్‌ తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారమే చేస్తామన్నారు. చంద్రబాబు 2014లో జరిగిన పంట నష్టాలకు కూడా 2019లోనూ పరిహారం ఇవ్వలేదన్నారు.   

ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన మొదటిరోజే ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్‌ ప్రకటించి ఆ దిశగా ముందుకెళుతున్నారని మంత్రి కన్నబాబు చెప్పారు. దేశంలో ఎక్కడాలేని రైతు పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రతిరోజూ వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపైన సీఎం జగన్‌ సమీక్షిస్తున్నారని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున శాశ్వత మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు చెప్పారు. గోడౌన్‌లు, కోల్డ్‌ స్టోరేజీలు, గ్రేడింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు చేశామన్నారు. సీఎం జగన్‌ రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకునేసరికి.. ఇక రైతులు తమకు శాశ్వతంగా దూరమవుతారనే భయంతో టీడీపీ నేతలు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని, నోటికి వచ్చినమేర అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపైన, సీఎం జగన్‌పైన పత్రికల్లో దిగజారుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఏ ఏడాదికి ఆ ఏడాది ఇవ్వకుండా చంద్రబాబు ఐదేళ్లూ ప్రభుత్వాన్ని నడిపారన్నారు. పంటల ఉచిత బీమా పథకం పరిహారం రూ.1251.77 కోట్లను ఈనెల 15న సీఎం జగన్‌ రైతుల ఖాతాలకు జమచేయనున్నారని చెప్పారు. నివర్‌ తుపానుకు వాటిల్లిన పంట నష్టం అంచనాలను ఈనెల 15 నాటికి పూర్తిచేసి నెలాఖరుకల్లా రైతులకు పరిహారం అందజేస్తామని తెలిపారు. 

మేకలు, గొర్రెలను ఎవరికైనా అమ్ముకోవచ్చు
మేకలు, గొర్రెలకు మంచి ధర వస్తే అల్లానాకే కాకుండా ఇతరులకు కూడా అక్కచెల్లెమ్మలు అమ్ముకోవచ్చని మంత్రి చెప్పారు. జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడిన వీడియోను కన్నబాబు ప్రదర్శించారు. అల్లానా సంస్థ మాంసాహార ఉత్పత్తుల వ్యాపారంలో ఉందన్నారు. మంచి మనసుతో ప్రారంభించినా పచ్చి అబద్ధాలు రాసి వక్రీకరించటం ఏమిటని ప్రశ్నించారు. సీఎం మాట్లాడి 24 గంటలు కాకముందే క్విడ్‌ ప్రోకో అంటున్నారు.. చంద్రబాబు హయాంలో జరిగిన రూ.15 లక్షల కోట్ల ఒప్పందాల్లో చంద్రబాబుకు ఎన్ని లక్షల కోట్లు క్విడ్‌ ప్రో కో ద్వారా వచ్చాయో చెప్పాలి అని పేర్కొన్నారు. జగనన్న జీవక్రాంతి పథకంపై ఆంధ్రజ్యోతిలో అసత్య వార్తలు రాశారని, దీనిపై పరువునష్టం దావా వేస్తామన్నారు.

దివీస్‌కు భూమి కేటాయించింది చంద్రబాబు సర్కారే
కాకినాడ సమీపంలో దివీస్‌ సంస్థను పెట్టాలని సంకల్పించింది, ఆ సంస్థకు భూములు ఏపీఐఐసీ ద్వారా కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో యనమల నిద్రపోయారా? అని నిలదీశారు. 500 ఎకరాలకు పైగా టీడీపీ ప్రభుత్వం ఇస్తే తాము 200 నుంచి 250 ఎకరాలకు తగ్గించామన్నారు. దివీస్‌కు అనుమతిచ్చినప్పుడు.. రసాయన వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేయటానికి టీడీపీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. జీరో డిశ్చార్జ్‌ అయితేనే పరిశ్రమకు అనుమతి ఇస్తామని తమ ప్రభుత్వం చెప్పిందన్నారు. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించిందన్నారు. ఆ పరిశ్రమ శంకుస్థాపనకు సీఎం హాజరవుతారని ప్రచారం చేశారని, దానికి సీఎం వెళ్లడంలేదని మంత్రి స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు