లోకేశ్‌.. పిచ్చి ప్రేలాపనలు వద్దు

1 Sep, 2021 02:36 IST|Sakshi
చంద్రబాబుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను చూపిస్తున్న మంత్రి కన్నబాబు

మంత్రి కన్నబాబు హెచ్చరిక

అధికారంలో ఉన్న ఐదేళ్లు పోలవరాన్ని పట్టించుకోలేదు

పోలవరం చంద్రబాబుకు ఏటీఎం.. అని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారు

కాకినాడ రూరల్‌: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ మాటతీరు చూస్తే ఒళ్లు బలిసి, కొవ్వెక్కి మాట్లాడుతున్నట్లుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని నిరసించారు. బలుపుతో పిచ్చి ప్రేలాపనలు చేయవద్దని హెచ్చరించారు. కాకినాడలో మంగళవారం  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని గాలిగాడు అని, నాయకులను వైసీపీ కుక్కలని వ్యాఖ్యానించడమే లోకేశ్‌కు చంద్రబాబు నేర్పిన సంస్కారమా అన్ని ప్రశ్నించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. కానీ మాట్లాడే భాష సంస్కారవంతంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బయట తిరగలేవని హెచ్చరించారు. 

పిల్ల రాక్షసుడిలా.. 
దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును చేపట్టి అనుమతులు తీసుకువస్తే తరువాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం వంటిదని రాజమహేంద్రవరం సభలో ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు. దానికి సంబంధించి ఒక టీవీ చానల్‌లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్‌ను మంత్రి ప్రదర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదన్నారు. అటువంటి పరిస్థితుల్లో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి పోలవరాన్ని సకాలంలో పూర్తిచేసేందుకు యజ్ఞంలా ముందుకు తీసుకువెళుతుంటే.. లోకేశ్‌ యజ్ఞాన్ని భగ్నంచేసే పిల్ల రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి 2017వరకు పోలవరం పనులు పట్టించుకోకపోతే నువ్వు ఏంచేశావని ప్రశ్నించారు. ఇప్పటివరకు పట్టించుకోని మీరు ఇప్పుడు పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చాపరాయి, ఎటపాక, రాజవొమ్మంగిల్లో గిరిజనులకు ఇబ్బందులు వస్తే మీరు స్పందించకపోయినా.. ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ వారిని పరామర్శించారని గుర్తుచేశారు.

ఐదేళ్లలో చంద్రబాబు 3,110 ఇళ్లు కడితే.. జగన్‌ రెండేళ్లలో నిర్మించింది 16 వేల ఇళ్లు
కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.2,300 కోట్లు ఇంకా ఇవ్వకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చుచేసి పోలవరాన్ని ముందుకు తీసుకెళుతోందని చెప్పారు. చంద్రబాబు పాలనలో నిర్వాసితులకు కేవలం 3,110 ఇళ్లు కట్టారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్లలో 16 వేల ఇళ్లు కట్టారని, 47 కాలనీలు నిర్మాణం పూర్తయిందని, మొత్తం 1,02491 ఇళ్లు పూర్తిచేస్తున్నారని వివరించారు. గిరిజనులకు ఇంటి నిర్మాణానికి రూ.3.59 లక్షలు, గిరిజనేతరులకు రూ.3.34 లక్షలు మంజూరు చేస్తున్నారన్నారు. గిరిజనుల ఉపాధికి శిక్షణ ఇవ్వడంతో పాటు, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడానికి కేబినెట్‌లో తీర్మానం చేశారని తెలిపారు.

టీడీపీ ప్రభుత్వ నిర్వాకంతోనే నిర్వాసితులు ముంపునకు గురయ్యారని చెప్పారు. రాజశేఖరరెడ్డి వారసుడిగా, ఆయన ఆశయాలను నెరవేర్చే తనయుడిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలవరాన్ని పూర్తిచేస్తారని పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.840 కోట్లు ఆదాచేశారని గుర్తుచేశారు. జూలై 19న పోలవరాన్ని సందర్శించిన సీఎం జగన్‌ నిర్వాసితుల సమస్యపై ఎక్కువగా మాట్లాడారని చెప్పారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తి నాణ్యతతో చేపడతామన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ 2024లో అధికారంలోకి వస్తామని పగటి కలలుకంటూ హైదరాబాద్‌ వదిలి రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్‌ వాస్తవంలో బతకాలని సూచించారు. 

ఎరువులు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు
రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అన్ని రైతుభరోసా కేంద్రాల్లో కావల్సిన మేర అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎరువులను డీలర్లు ఎక్కడైనా బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. 

>
మరిన్ని వార్తలు