కాపులకు సీఎం జగన్‌ వెన్నుదన్నుగా నిలిచారు

4 Feb, 2022 05:04 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, అమరావతి/కరప: కాపులకు వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాపు ఉద్యమ సమయంలో కాపు నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు కాపు జాతి రుణపడి ఉంటుందన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కరపలో మీడియాతో మాట్లాడారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కాపుల విషయంలో టీడీపీ పాలకులు దుర్మార్గంగా వ్యవహరించారని గుర్తుచేశారు. కాపులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించి చిత్రహింసలకు గురిచేశారన్నారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ రైతులను కూడా ఇదే రీతిలో అవమానాలకు గురిచేసారన్నారు. వారిపై అన్యాయంగా కేసులు బనాయించి జైలులో పెట్టించడమే కాకుండా.. చివరకు బాత్‌రూమ్‌లను కూడా రైతులతో కడిగించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇక కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించి, అవమానాలకు గురిచేశారని, మహిళలపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కాపులపై అక్రమ కేసులన్నీ ఎత్తివేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని, ఆ మాటప్రకారం 2020లోనే 163 కేసులు ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. తాజాగా మరో 161 కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. తుని రైలు ధ్వంసం కేసులు కూడా ఎత్తివేయాలని కోరుతూ సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాశారన్నారు. కొద్దిరోజుల్లోనే అవి కూడా ఎత్తివేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్‌ఈజెడ్‌ రైతులపై గత ప్రభుత్వ హయాంలో బనాయించిన కేసులను ఉపసంహరించాలన్న తమ అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే ఈమేరకు జీవో రానుందని చెప్పారు. 

కాపులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన చరిత్ర చంద్రబాబుది: అడపా శేషు
కాపు ఓట్లతో 2014లో గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు ఆ సామాజిక వర్గాన్ని రోడ్డునపడేశాడని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు ఆరోపించారు. సీఎం జగన్‌ కాపులకు వెన్నుదన్నుగా నిలిచి వారి సంక్షేమానికి పాటుపడుతున్న విషయాన్ని కాపు జాతి మర్చిపోదన్నారు. ఐదుగురు కాపులను మంత్రులను చేయడమే కాకుండా.. 50 మందికిపైగా కాపులను కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అప్పట్లో తునిలో బహిరంగ సభకు పిలుపునిస్తే పవన్, చంద్రబాబు పత్తాలేకుండా పోయారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే నాటి ఉద్యమానికి మద్దతు ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు కేసులను మాఫీ చేసి చిత్తశుద్ధి చాటుకున్నారన్నారు.

కాపు మహిళలకు ఆర్థిక చేయూత
కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కాపు మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్‌ కాపు నేస్తాన్ని అమలు చేస్తూ ఏటా ఒక్కొక్కరికీ రూ. 15 వేల చొప్పున ఆర్థిక చేయూతనందిస్తున్నారని చెప్పారు.  రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని, ఆలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణానికి కృషి చేస్తుందన్నారు. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరతలేదని, కొంతమంది సృష్టించే పుకార్లను రైతులు నమ్మవద్దని మంత్రి కోరారు. 

మరిన్ని వార్తలు